![Sri Lanka Beat Australia By 174 Runs In Second ODI, Clean Sweep The Series](/styles/webp/s3/article_images/2025/02/14/lanka.jpg.webp?itok=FixM49ZD)
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు వరల్డ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియాకు ఘోర అవమానం జరిగింది. శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆసీస్ 0-2 తేడాతో చిత్తుగా ఓడింది. ఇవాళ (ఫిబ్రవరి 14) జరిగిన రెండో వన్డేలో ఆసీస్ 174 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు గాయాలతో సతమతమవుతున్న ఆసీస్‌ను ఈ పరాజయం మరింత కృంగదీసింది.
మ్యాచ్ విషయానికొస్తే.. కొలొంబో వేదికగా జరిగిన రెండో వన్డేలో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిస్సంక (6) వికెట్ కోల్పోయింది. అయితే నిషాన్ మధుష్క (51), కుసాల్ మెండిస్ (101) రెండో వికెట్‌కు 98 పరుగులు జోడించి లంక ఇన్నింగ్స్‌కు జీవం పోశారు.
మధుష్క ఔటైన అనంతరం కుసాల్ మెండిస్.. కెప్టెన్ అసలంక (78 నాటౌట్) సహకారంతో ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. మెండిస్, అసలంక నాలుగో వికెట్‌కు 94 పరుగులు జోడించి తమ జట్టును భారీ స్కోర్ దిశగా తీసుకెళ్లారు. ఇన్నింగ్స్ చివర్లో అసలంకతో కలిసి జనిత్ లియనాగే (32 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ఫలితంగా శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో డ్వార్షుయిష్, ఆరోన్ హార్డీ, సీన్ అబాట్, ఆడమ్ జంపా తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం 282 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఆదిలోనే ఓటమిని ఖరారు చేసుకుంది. తొలుత ఆసీస్‌ను అశిత ఫెర్నాండో (4-0-23-3) ఇబ్బంది పెట్టాడు. ఆతర్వాత దునిత్ వెల్లలగే (7.2-0-35-4), వనిందు హసరంగ (7-2-23-3) ఆసీస్ భరతం పట్టారు.
లంక బౌలర్ల ధాటికి ఆసీస్ 100 పరుగులు చేయడం కూడా అసాధ్యమనిపించింది. మొత్తానికి ముక్కీమూలిగి ఆసీస్ 24.2 ఓవర్లలో 107 పరుగులు చేసి ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ (29) టాప్ స్కోరర్ కాగా.. జోస్ ఇంగ్లిస్ (22), ట్రవిస్ హెడ్ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.
కాగా, ఆసీస్ తొలి వన్డేలోనూ ఇదే రీతిలో ఊహించని పరాజయాన్ని ఎదుర్కొంది. ఆ మ్యాచ్‌లో కూడా తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. కెప్టెన్ అసలంక సెంచరీ చేయడంతో అతికష్టం మీద 214 పరుగులు చేయగలిగింది. అయితే ఈ ఇంతటి లక్ష్యాన్ని కూడా ఛేదించలేక ఆసీస్ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. మహీశ్ తీక్షణ (9.5-1-40-4), అశిత ఫెర్నాండో (5-1-23-2), వెల్లలగే (7-0-33-2), హసరంగ (6-0-47-1), అసలంక (2-0-5-1) ఆసీస్‌ను దెబ్బకొట్టారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో అలెక్స్ క్యారీ (41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఇదిలా ఉంటే, ఆసీస్.. శ్రీలంక నుంచే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం నేరుగా పాకిస్తాన్‌కు బయల్దేరుతుంది. ఛాంపియన్స్‌ట్రోఫీలో ఆస్ట్రేలియా ఫిబ్రవరి 22న తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. లాహోర్‌లో జరిగే ఆ మ్యాచ్‌లో ఆసీస్.. ఇంగ్లండ్‌ను ఢీకొంటుంది. ఈ టోర్నీలో ఆసీస్.. ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లతో కలిసి గ్రూప్-బిలో ఉంది. గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు పోటీపడతాయి.
2025 ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరుగనున్నాయి. మిగతా మ్యాచ్‌లకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 19న జరిగే టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడతాయి. అనంతరం ఫిబ్రవరి 20న జరిగే మ్యాచ్‌లో భారత్, బంగ్లాదేశ్‌ను ఢీకొంటుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా జట్టు..
స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ క్యారీ, బెన్ డ్వార్షుయిష్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబూషన్, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘ, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా. [ట్రావెలింగ్ రిజర్వ్: కూపర్ కొన్నోలీ]
Comments
Please login to add a commentAdd a comment