డంబుల్లా వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న రెండో టీ20లో శ్రీలంక జట్టు ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవరల్లో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. మిడిలార్డర్ ఆటగాడు సమరవిక్రమ (42 బంతుల్లో 51; 5 ఫోర్లు) అర్దసెంచరీతో రాణించాడు.
ఆఖర్లో హసరంగ (9 బంతుల్లో 22; ఫోర్, 2 సిక్సర్లు), ఏంజెలో మాథ్యూస్ (22 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. ఓపెనర్లు పథుమ్ నిస్సంక (11 బంతుల్లో 25; 5 ఫోర్లు), కుశాల్ మెండిస్‌లకు (14 బంతుల్లో 23; 4 ఫోర్లు) శుభారంభం లభించినప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ధనంజయ డిసిల్వ 14, అసలంక 4 పరుగులు చేసి ఔటయ్యారు.
ఆఫ్ఘన్ బౌలర్లలో అజ్మతుల్లా, మొహమ్మద్ నబీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఫజల్ హాక్ ఫారూకీ, నవీన్ ఉల్ హాక్ చెరో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 21 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్ (1), ఇబ్రహీం జద్రాన్ (10) ఔట్ కాగా.. రహ్మానుల్లా గుర్బాజ్ (9), గుల్బదిన్ నైబ్ (1) క్రీజ్‌లో ఉన్నారు. బ్యాటింగ్‌లో చెలరేగిన ఏంజెలో మాథ్యూస్ బౌలింగ్‌లోనూ సత్తా చాటి రెండు వికెట్లు పడగొట్టాడు.
మూడు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌లో శ్రీలంక తొలి మ్యాచ్‌లో విజయం సాధించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment