మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జింబాబ్వేతో (కొలొంబో వేదికగా) జరిగిన తొలి టీ20లో శ్రీలంక 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. సికందర్ రజా (62) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. సికందర్ రజా మినహా జింబాబ్వే ఇన్నింగ్స్‌లో అందరూ తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు.
కమున్‌హుకంవే 26, క్రెయిగ్ ఎర్విన్ 10, సీన్ విలియమ్స్ 14, ర్యాన్ బర్ల్ 5 పరుగులు చేసి ఔట్ కాగా.. బ్రియాన్ బెన్నెట్ 10, జోంగ్వే 13 పరుగులతో అజేయంగా నిలిచారు. లంక బౌలర్లలో తీక్షణ (4-0-16-2), హసరంగ (4-0-19-2), చమీరా (4-0-38-1) వికెట్లు పడగొట్టారు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో శ్రీలంక సైతం తడబడింది. ఆ జట్టు అతి కష్టం మీద చివరి బంతికి విజయం సాధించింది. ఆఖరి ఓవర్‌లో ఏంజెలో మాథ్యూస్ (38 బంతుల్లో 46; 5 ఫోర్లు, సిక్స్) వరుసగా రెండు బౌండరీలు బాది లంక విజయాన్ని ఖరారు చేశాడు. ఆతర్వాత చమీరా ఐదు, ఆరు బంతులకు ఆరు పరుగులు (4, 2) సాధించి లంకను విజయతీరాలకు చేర్చాడు.
లంక ఇన్నింగ్స్‌లో మాథ్యూస్, షనక (18 బంతుల్లో 26 నాటౌట్; 4 ఫోర్లు) రాణించగా.. జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా (4-0-13-3) బంతితోనూ సత్తా చాటాడు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబానీ 2, రిచర్డ్ నగరవ, వెల్లింగ్టన్ మసకద్జ తలో వికెట్ పడగొట్టారు. రెండో టీ20 ఇదే వేదికపై జనవరి 16న జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment