కొలొంబో: పసికూన జింబాబ్వే.. తమకంటే చాలా రెట్లు మెరుగైన శ్రీలంకకు ఊహించని షాకిచ్చింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నిన్న (జనవరి 16) జరిగిన రెండో మ్యాచ్‌లో లంకేయులు ఓ మోస్తరు స్కోర్ చేసినా, దాన్ని కాపాడుకోవడంలో విఫలమయ్యారు. అనుభవజ్ఞుడైన ఏంజెలో మాథ్యూస్ (1.5-0-35-0) చివరి ఓవర్‌లో 24 పరుగులిచ్చి లంక ఓటమికి కారకుడయ్యాడు.
లూక్ జాంగ్వే.. మాథ్యూస్ వేసిన చివరి ఓవర్‌లో 2 సిక్సర్లు, బౌండరీ బాది జింబాబ్వేకు అద్భుత విజయాన్నందించాడు. ఈ గెలుపుతో జింబాబ్వే 1-1తో సిరీస్‌ను సమం చేసింది. తొలి మ్యాచ్‌లో శ్రీలంక గెలువగా.. నిర్ణయాత్మక మూడో టీ20 జనవరి 18న జరుగనుంది.
మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. చరిత్ అసలంక (39 బంతుల్లో 69; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఏంజెలో మాథ్యూస్ (51 బంతుల్లో 66 నాటౌట్, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో అసలంక, మాథ్యూస్ మినహా అంతా విఫలమయ్యారు.
నిస్సంక 1, కుశాల్ మెండిస్ 4, కుశాల్ పెరీరా 0, సమరవిక్రమ 16, షనక 9 పరుగులు చేసి ఔటయ్యారు. జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ, లూక్ జాంగ్వే చెరో 2 వికెట్లు పడగొట్టగా.. నగరవ, మసకద్జ తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే.. ఆఖరి ఓవర్‌లో జాంగ్వే మెరుపులు (12 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరిపించడంతో మరో బంతి మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. అంతకుముందు క్రెయిగ్ ఎర్విన్ (70) జింబాబ్వే ఇన్నింగ్స్‌కు పునాది వేయగా.. బ్రియాన్ బెన్నెట్ (25) పర్వాలేదనిపించాడు.
వరుస హాఫ్ సెంచరీలతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన సికందర్ రజా (8) ఐదు మ్యాచ్‌ల తర్వాత తొలిసారి విఫలమయ్యాడు. ఆఖర్లో జాంగ్వే.. క్లైవ్ మదండే (15 నాటౌట్) సాయంతో జింబాబ్వేను గెలిపించాడు. లంక బౌలర్లలో తీక్షణ, చమీరా తలో 2 వికెట్లు పడగొట్టగా.. కెప్టెన్ హసరంగ భారీ పరుగులు (4 ఓవర్లలో 41) సమర్పించుకుని ఓ వికెట్ తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment