రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కొలొంబో వేదికగా ఆస్ట్రేలియాతో (Australia) జరుగుతున్న తొలి వన్డేలో శ్రీలంక (Sri Lanka) కెప్టెన్ చరిత్ అసలంక (Charith Asalanka) సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో కష్టాల్లో ఉన్న తన జట్టును అసలంక ఒంటిచేత్తో ఆదుకున్నాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 55 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ దశలో అసలంక.. వెల్లలగే (30), మిగతా టెయిలెండర్ల సాయంతో ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. మరో ఎండ్‌లో బౌలర్ ఎషాన్ మలింగను (26 బంతుల్లో 1 నాటౌట్) పెట్టుకుని అసలంక కెరీర్‌లో నాలుగో వన్డే సెంచరీని పూర్తి చేశాడు. అసలంక 112 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో సెంచరీ మార్కును తాకాడు. 127 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అసలంక తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. అదే ఓవర్‌లో అషిత ఫెర్నాండో డకౌట్ కావడంతో శ్రీలంక ఇన్నింగ్స్ 214 పరుగుల వద్ద ముగిసింది (46 ఓవర్లలో).
అంతకుముందు శ్రీలంక బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. ఓపెనర్లు పథుమ్ నిస్సంక 4, అవిష్క ఫెర్నాండో ఒక్క పరుగుకే ఔటయ్యారు. వన్‌డౌన్‌లో వచ్చిన కుసాల్ మెండిస్ 19 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ఆతర్వాత కమిందు మెండిస్ 5, జనిత్ లియనాగే 11 పరుగులకు ఔటయ్యారు. టెయిలెండర్లు వనిందు హసరంగ 7, మహీశ్ తీక్షణ 2 పరుగులకు ఔటయ్యారు.
ఆసీస్ బౌలర్లలో నాథన్ ఇల్లిస్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇల్లిస్ 9 ఓవర్లలో 2 మెయిడిన్లతో 23 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. మరో పేసర్ ఆరోన్ హార్డీ 6 ఓవర్లలో 13 పరుగులిచ్చి అవిష్క ఫెర్నాండో, కుసాల్ మెండిస్ వికెట్లు పడగొట్టాడు. సీన్ అబాట్ 3, స్పెన్సర్ జాన్సన్ 2, మాథ్యూ షార్ట్ ఓ వికెట్ పడగొట్టారు.
కాగా, ఈ వన్డేకు ముందు జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఆసీస్ 2-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ 242 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన ఆసీస్.. రెండో టెస్ట్‌లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండు మ్యాచ్‌ల ఈ వన్డే సిరీస్ అనంతరం ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు పాకిస్తాన్‌ను వెళ్లనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా ఫిబ్రవరి 22న తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. లాహోర్‌లో జరిగే ఆ మ్యాచ్‌లో ఆసీస్.. ఇంగ్లండ్‌ను ఢీకొంటుంది. ఈ టోర్నీలో ఆసీస్.. ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లతో కలిసి గ్రూప్-బిలో ఉంది. గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు పోటీపడతాయి. ఈ టోర్నీకి శ్రీలంక అర్హత సాధించలేకపోయింది.
2025 ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరుగనున్నాయి. మిగతా మ్యాచ్‌లకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 19న జరిగే టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడతాయి. అనంతరం ఫిబ్రవరి 20న జరిగే మ్యాచ్‌లో భారత్, బంగ్లాదేశ్‌ను ఢీకొంటుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే ఆస్ట్రేలియా జట్టు..
స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ క్యారీ, బెన్ డ్వార్షుయిష్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబూషన్, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘ, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా. [ట్రావెలింగ్ రిజర్వ్: కూపర్ కొన్నోలీ]
Comments
Please login to add a commentAdd a comment