కొలంబో: గాయం నుంచి కోలుకున్నాక శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ ఘనంగా పునరాగమనం చేశాడు. జింబాబ్వేతో గురువారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో హసరంగ బంతితో మాయ చేశాడు. 5.5 ఓవర్లు వేసిన హసరంగ కేవలం 19 పరుగులిచ్చి ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు.
వన్డే క్రికెట్‌లో ఇవి ఐదో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు కావడం విశేషం. వర్షం కారణంగా 27 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే జట్టు హసరంగ ధాటికి 22.5 ఓవర్లలో 96 పరుగులకే ఆలౌటైంది. వన్డే మ్యాచ్‌లో 7 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన 15వ బౌలర్‌గా... చమిందా వాస్ (8/19; జింబాబ్వేపై 2001లో), ముత్తయ్య మురళీధరన్ (7/30; భారత్‌పై 2000లో) తర్వాత ఈ ఘనత సాధించిన మూడో శ్రీలంక బౌలర్‌గా హసరంగ గుర్తింపు పొందాడు.
జింబాబ్వే నిర్దేశించిన 97 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక 16.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించి గెలిచింది. ఈ గెలుపుతో శ్రీలంక సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. తొలి వన్డే వర్షంతో రద్దయింది.
Comments
Please login to add a commentAdd a comment