
రిషభ్ పంత్ (Photo Courtesy: BCCI/IPL)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2025లో లక్నో సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరైన రైజర్స్‌కే షాకిస్తూ.. సొంతమైదానంలోనే కమిన్స్ బృందానికి చుక్కలు చూపించింది.
బిగ్ రిలీఫ్
ఇటు బౌలర్లు.. అటు బ్యాటర్లు.. సమిష్టి ప్రదర్శనతో రాణించగా.. లక్నో కెప్టెన్‌గా టీమిండియా స్టార్ రిషభ్ పంత్‌కు తొలి గెలుపు దక్కింది. ఈ నేపథ్యంలో విజయానంతరం పంత్ హర్షం వ్యక్తం చేశాడు. ‘‘నిజంగా మాకు ఎంతో ఉపశమనాన్ని ఇచ్చే ఫలితం ఇది. గెలిచినప్పుడు పొంగిపోయి.. ఓడినపుడు కుంగిపోయే రకం మేము కాదు.
జట్టుగా మా నియంత్రణలో ఉన్న అంశాలపైనే దృష్టి పెడతాం. మా మెంటార్ ప్రతిసారీ ఇదే చెబుతారు. మన పరిధిలో ఉన్న అంశాల గురించి మాత్రమే ఆలోచించాలని.. వాటి ద్వారా లబ్ది పొందేందుకు అత్యుత్తమ మార్గాలు అన్వేషించాలని అంటారు. ఈరోజు నేను అదే చేశాను.
మా బెస్ట్ ఇవ్వలేకపోయాం.. పర్లేదు గెలిచాం
మా బౌలర్లు ప్రిన్స్, ఠాకూర్ అద్భుతంగా ఆడారు. ఇక పూరన్ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతడిని మూడో స్థానంలో ఆడిస్తే బాగుంటుందని అనుకున్నాం. తనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చాం. ఈరోజు అతడు అత్యద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.
మా జట్టు మొత్తం రాణించింది. మా స్థాయికి తగ్గ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయాం. అయినప్పటికీ గెలుపొందినందుకు సంతోషంగా ఉంది’’ అని రిషభ్ పంత్ పేర్కొన్నాడు.
కాగా ఐపీఎల్-2025లో లక్నో తమ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడింది. విశాఖపట్నంలో ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో లక్నో ఒక్క వికెట్ తేడాతో ఓటమిపాలైంది. వికెట్ కీపర్‌గా పంత్ చేసిన తప్పిదం కారణంగా భారీ మూల్యమే చెల్లించుకుంది.
రైజర్స్ దూకుడుకు లక్నో బౌలర్ల కళ్లెం
ఈ నేపథ్యంలో తాజాగా తదుపరి సన్‌రైజర్స్‌తో మ్యాచ్ ఆడిన లక్నో ఉప్పల్ మైదానంలో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసింది. సొంత గ్రౌండ్‌లో రైజర్స్ బ్యాటింగ్ సత్తా ఏమిటో తెలిసీ పంత్ ఈ నిర్ణయం తీసుకోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. అయితే, కెప్టెన్ నమ్మకాన్ని లక్నో బౌలర్లు నిలబెట్టారు.
రైజర్స్ పవర్ హిట్టర్లు అభిషేక్ శర్మ(6), ఇషాన్ కిషన్(0)లను శార్దూల్ ఠాకూర్ వెనువెంటనే పెవిలియన్‌కు పంపగా.. ప్రమాదకర బ్యాటర్లు ట్రవిస్ హెడ్ (28 బంతుల్లో 47)ను అవుట్ చేసిన ప్రిన్స్ యాదవ్.. హెన్రిచ్ క్లాసెన్(26)ను రనౌట్‌గా వెనక్కి పంపాడు. ఈ క్రమంలో అనికేత్ వర్మ(13 బంతుల్లో 36) మెరుపులు మెరిపించగా.. దిగ్వేశ్ రాఠీ అతడిని అవుట్ చేశాడు.
అయితే, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (4 బంతుల్లో 18) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి స్కోరును 200 దాటించే ప్రయత్నం చేయగా.. ఆవేశ్ ఖాన్ అతడి దూకుడుకు కళ్లెం వేశాడు. ఈ క్రమంలో రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో శార్దూల్ (4/34) నాలుగు వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్, దిగ్వేశ్ రాఠీ, రవి బిష్ణోయి, ప్రిన్స్ యాదవ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
నికోలస్ పూరన్ తుపాన్ ఇన్నింగ్స్
ఇక లక్ష్య ఛేదనలో ఓపెనర్ మిచెల్ మార్ష్ (31 బంతుల్లో 52) లక్నోకు శుభారంభం అందించాడు. మరో ఓపెనర్ ఐడైన్ మార్క్రమ్(1) మరోసారి విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన నికోలస్ పూరన్ తుపాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు.
కేవలం 26 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 70 పరుగులు సాధించాడు. మిగతా వాళ్లలో డేవిడ్ మిల్లర్ (7 బంతుల్లో 13), అబ్దుల్ సమద్ (8 బంతుల్లో 22) ధనాధన్ బ్యాటింగ్‌తో అజేయంగా నిలిచి లక్నోను విజయతీరాలకు చేర్చారు.
ఐపీఎల్-2025: సన్‌రైజర్స్ వర్సెస్ లక్నో
👉వేదిక: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం, హైదరాబాద్
👉టాస్: లక్నో.. తొలుత బౌలింగ్
👉సన్‌రైజర్స్ స్కోరు: 190/9 (20)
👉లక్నో స్కోరు: 193/5 (16.1)
👉ఫలితం: ఐదు వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌పై లక్నో గెలుపు
👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శార్దూల్ ఠాకూర్ (4/34).
చదవండి: IPL 2025: 13 బంతుల్లో విధ్వంసం.. ఎస్ఆర్‌హెచ్ నయా హీరో! ఎవరీ అనికేత్?
Hyderabad conquered ✅
Win secured ✅#LSG get their first 𝐖 of #TATAIPL 2025 with a comfortable victory over #SRH 💙
Scorecard ▶ https://t.co/X6vyVEvxwz#SRHvLSG | @LucknowIPL pic.twitter.com/7lI4DESvQx— IndianPremierLeague (@IPL) March 27, 2025