ప్రతీకారం తీర్చుకున్న లంకేయులు.. భారీ విజయం | SL VS AFG 2nd ODI: Sri Lanka Beat Afghanistan By 132 Runs | Sakshi
Sakshi News home page

SL VS AFG 2nd ODI: ప్రతీకారం తీర్చుకున్న లంకేయులు.. భారీ విజయం

Published Sun, Jun 4 2023 6:49 PM | Last Updated on Sun, Jun 4 2023 6:49 PM

SL VS AFG 2nd ODI: Sri Lanka Beat Afghanistan By 132 Runs - Sakshi

తొలి వన్డేలో ఆఫ్ఘనిస్తాన్‌ చేతిలో ఎదురైన పరాభవానికి శ్రీలంక ఆటగాళ్లు ప్రతీకారం తీర్చుకున్నారు. హంబన్‌తోట వేదికగా ఇవాళ (జూన్‌ 4) జరిగిన రెండో వన్డేలో ఆఫ్ఘనిస్తాన్‌ను మట్టికరిపించారు. తొలుత బ్యాటింగ్‌లో ఆతర్వాత బౌలింగ్‌లో రెచ్చిపోయిన లంకేయులు.. పర్యాటక జట్టుపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి గెలుపొందారు. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకున్నారు. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే జూన్‌ 7న ఇదే వేదికగా జరుగనుంది. 

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక.. పథుమ్‌ నిస్సంక (43), కరుణరత్నే (52), కుశాల్‌ మెండిస్‌ (78), సమర విక్రమ (44),  ధనంజయ డిసిల్వ (29 నాటౌట్‌), షనక (23), హసరంగ (29 నాటౌట్‌) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 323 పరుగులు చేసింది. తొలి వన్డేలో సత్తా చాటిన అసలంక (6) మినహా లంక ఇన్నింగ్స్‌లో ప్రతి ఒక్కరు బ్యాట్‌ను ఝులిపించారు. ఆఫ్ఘనిస్తాన్‌ బౌలర్లలో నబీ, ఫరీద్‌ అహ్మద్‌ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. 

అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్‌.. ఓ దశలొ (146/2) విజయం దిశగా సాగుతున్నట్లు కనిపించినప్పటికీ.. స్పిన్నర్‌ ధనంజయ డిసిల్వ (10-0-39-3) ఆ జట్టును భారీగా దెబ్బకొట్టాడు. సెట్‌ బ్యాటర్లు ఇబ్రహీం జద్రాన్‌ (54), హస్మతుల్లా షాహిది (57)లను ఔట్‌ చేసి ఆఫ్ఘన్ల ఓటమికి బీజం వేశాడు. అనంతరం హసరంగ (9-2-42-3) వారి పతనాన్ని శాశించాడు. 

వీరితో పాటు చమీరా (2/18), తీక్షణ​ (1/35), షనక (1/29) తలో చేయి వేయడంతో ఆఫ్ఘన్లు 42.1 ఓవర్లలో 191 పరుగులు మాత్రమే చేసి ఆలౌటయ్యారు. ఫలితంగా 132 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలయ్యారు. ఆఫ్ఘనిస్తాన్‌ ఇన్నింగ్స్‌లో జద్రాన్‌, షాహిది హాఫ్‌ సెంచరీలతో రాణించగా.. రహ్మత్‌ షా (36), అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (28) ఓ మోస్తరుగా రాణించారు. మిగతా వారంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌కే పరిమితమయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement