ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు శ్రీలంక క్రికెట్ బోర్డు తమ తుదిజట్టును ప్రకటించింది. పేసర్ మిలన్ రత్నాయకేకు ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టే అవకాశం కల్పించింది. మిలన్ ఆగమనం మినహా.. ఈ ఏడాది ఆరంభంలో బంగ్లాదేశ్‌తో తలపడ్డ జట్టుతోనే ఇంగ్లండ్‌తో టెస్టులోనూ బరిలోకి దిగనున్నట్లు తెలిపింది.
కాగా టెస్టు సిరీస్ ఆడేందుకు శ్రీలంక ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా ఆతిథ్య జట్టుతో మూడు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య ఆగష్టు 21న మొదటి టెస్టు ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇంగ్లండ్ తమ తుదిజట్టును ప్రకటించగా.. మంగళవారం శ్రీలంక సైతం తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను వెల్లడించింది.
ధనంజయ డి సిల్వ సారథ్యంలోని ఈ జట్టులో వెటరన్ బ్యాటర్ దిముత్ కరుణరత్నె.. యువ క్రికెటర్ నిషాన్ మదుష్కతో కలిపి లంక ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. ఇక మిడిలార్డర్‌లో కుశాల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, దినేశ్ చండిమాల్ ఆడనుండగా.. కెప్టెన్ ధనంజయ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు.
అతడి తర్వాతి స్థానంలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కమిందు మెండిస్ రానున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో పేసర్లు అసితా ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండోతో పాటు కొత్తగా రత్నాయకే కూడా చోటు దక్కించుకున్నాడు. ఇప్పటికి రెండు సార్లు జాతీయ జట్టు సెలక్టర్ల నుంచి పిలుపు అందుకున్నా తుదిజట్టులో మాత్రం అతడికి స్థానం దక్కలేదు. అయితే, ఇంగ్లండ్‌తో సిరీస్ సందర్భంగా ఆ లోటు తీరనుంది.
కాగా 28 ఏళ్ల మిలన్ రత్నాయకే ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 39 మ్యాచ్‌లు ఆడి 79 వికెట్లు తీశాడు. ఇందులో మూడు నాలుగు వికెట్ల హాల్స్, ఒక ఐదు వికెట్ల హాల్ ఉంది. ఇక 45 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడిన మిలన్ రత్నాయకే 47 వికెట్లు పడగొట్టాడు. 22 టీ20లలో 24 వికెట్లు తీశాడు.
ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో ఒకే ఒక్క స్పెషలిస్టు స్పిన్నర్ ప్రభాత్ జయసూర్యకు మాత్రమే చోటు దక్కింది. ఇక పాతుమ్ నిసాంక, సదీర సమరవిక్రమ, రమేశ్ మెండిస్, నిసాల తారక, లాహిరు కుమార, కసున్ రజిత, జెఫ్రే వాండర్సె బెంచ్‌కే పరిమితం కానున్నారు. కాగా 2016లో చివరగా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన శ్రీలంక 0-2తో ఓటమిని చవిచూసింది. గత మూడు సందర్భాల్లోనూ ఇంగ్లండ్ చేతిలో ఓటమి(ఎనిమిది టెస్టుల్లో ఏడు పరాజయం, ఒకటి డ్రా) పాలైంది.
ఇంగ్లండ్ వర్సెస్ శ్రీలంక తొలి టెస్టు:తుదిజట్లు
ఇంగ్లండ్
డాన్ లారెన్స్, బెన్ డకెట్, ఓలీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గుస్ అట్కిన్సన్, మాథ్యూ పాట్స్, మార్క్ వుడ్, షోయబ్ బషీర్.
శ్రీలంక
దిముత్ కరుణరత్నే, నిషాన్ మదుష్క, కుసల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, దినేశ్ చండిమాల్, ధనంజయ డిసిల్వా (కెప్టెన్), కమిందు మెండిస్, ప్రభాత్ జయసూర్య, అసిత ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో, మిలన్ రత్నాయకే.
Comments
Please login to add a commentAdd a comment