
లండన్: సొంతగడ్డపై సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తున్న ఇంగ్లండ్ జట్టు... శ్రీలంకతో మూడో టెస్టులోనూ అదే జోరు కొనసాగిస్తోంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గి సిరీస్ కైవసం చేసుకున్న ఇంగ్లండ్... శుక్రవారం వర్షం అంతరాయం మధ్య ప్రారంభమైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 44.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.
తాత్కాలిక కెప్టెన్ ఒలీ పోప్ (103 బంతుల్లో 103 బ్యాటింగ్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ సెంచరీతో చెలరేగగా... ఓపెనర్ బెన్ డకెట్ (79 బంతుల్లో 86; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) చక్కటి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.
వీరిద్దరూ వన్డే తరహా ఆటతీరుతో చెలరేగడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వర్షం కారణంగా మ్యాచ్‌కు పలుమార్లు అంతరాయం ఏర్పడగా... ఆఖర్లో వెలుతురు లేమితో ఆటను నిర్ణీత సమయం కంటే ముందే నిలిపివేశారు.
గత మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసిన మాజీ కెప్టెన్ జో రూట్ (13) తో పాటు డాన్ లారెన్స్ (5) విఫలమయ్యారు. లంక బౌలర్లలో లహిరు కుమార 2 వికెట్లు పడగొట్టాడు. పోప్‌తో పాటు హ్యారీ బ్రూక్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.
చదవండి: Fab Four: ‘అతడే నంబర్ వన్.. కోహ్లికి ఆఖరి స్థానం’