శ్రీలంకతో రెండో టెస్టుకు ఇంగ్లండ్ బోర్డు తమ తుదిజట్టును ప్రకటించింది. తొలి మ్యాచ్‌లో ఆడిన జట్టులో ఒక మార్పుతో లార్డ్స్‌లో బరిలోకి దిగనున్నట్లు తెలిపింది. పేసర్ మార్క్‌వుడ్ స్థానాన్ని ఓలీ స్టోన్‌తో భర్తీ చేసినట్లు వెల్లడించింది. కాగా 2021లో చివరగా ఇంగ్లండ్ తరఫున టెస్టు ఆడిన ఓలీ స్టోన్.. మూడేళ్ల తర్వాత పునరాగమనం చేయనుండటం విశేషం.
లంకతో తొలి టెస్టులో మార్క్‌వుడ్ గాయపడిన విషయం తెలిసిందే. మూడో రోజు ఆటలో భాగంగా కండరాల నొప్పితో విలవిల్లాడిన ఈ ఫాస్ట్‌బౌలర్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ క్రమంలో 20 ఏళ్ల పేసర్ జోష్ హల్‌ను అతడి స్థానంలో జట్టుకు ఎంపిక చేసిన ఇంగ్లండ్ బోర్డు.. హల్‌ను బెంచ్‌కే పరిమితం చేసింది. ఓలీ స్టోన్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం కల్పించింది.
కాగా రైటార్మ్ పేసర్ అయిన 30 ఏళ్ల ఓలీ స్టోన్.. 2018లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు ఇంగ్లండ్ తరఫున 3 టెస్టుల్లో 10, ఎనిమిది వన్డేల్లో 8 వికెట్లు తీశాడు. ఒకే ఒక్క టీ20 ఆడినా వికెట్ మాత్రం తీయలేకపోయాడు. ఇదిలా ఉంటే.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా సొంతగడ్డపై శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది.
ఈ క్రమంలో మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. పర్యాటక లంక నుంచి గట్టి పోటీ ఎదురుకాగా.. ఇంగ్లండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్(128 బంతుల్లో 62) పట్టుదలగా నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
ఇరు జట్ల మధ్య లండన్‌లో లార్డ్స్ మైదానంలో ఆగష్టు 29- సెప్టెంబరు 2 వరకు రెండో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది. ఇదిలా ఉంటే.. ఈ సిరీస్‌కు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ దూరం కాగా.. అతడి స్థానంలో ఓలీ పోప్ సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. అతడికి డిప్యూటీగా యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను ఎంపిక చేసింది ఇంగ్లండ్ బోర్డు.
శ్రీలంకతో లండన్ వేదికగా రెండో టెస్టు ఇంగ్లండ్ తుదిజట్టు
లారెన్స్, బెన్ డకెట్, ఓలీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, మాథ్యూ పాట్స్, ఓలీ స్టోన్, షోయబ్ బషీర్.
Comments
Please login to add a commentAdd a comment