
లంక కెప్టెన్సీకి మాథ్యూస్ బైబై
కొలంబో: శ్రీలంక క్రికెట్ జట్టు కెప్టెన్ ఎంజెలో మాథ్యూస్ సారథ్యానికి గుడ్‌బై చెప్పాడు. టెస్టు, వన్డే, టి20 ఈ మూడు ఫార్మాట్లకు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. బలహీనమైన జింబాబ్వేతో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌ను లంక జట్టు కోల్పోవడంతో అతనీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. 2–3తో జింబాబ్వే చేతిలో ఓడటాన్ని తన కెరీర్‌లోనే అత్యంత ఘోర పరాభవంగా చెప్పుకొచ్చిన మాథ్యూస్ 34 టెస్టులు, 98 వన్డేలు, 12 టి20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
అతని సారథ్యంలోనే గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌ను లంక క్లీన్‌స్వీప్ చేసింది. అయితే ఈ సీజన్‌లో అతను గాయంతో కీలకమైన సిరీస్‌లకు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్, ఆస్ట్రేలియాతో జరిగిన టి20లకు, స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లకు అతను గైర్హాజరయ్యాడు. జయవర్ధనే వారసుడిగా 2013లో జట్టు పగ్గాలు చేపట్టడం ద్వారా లంక తరఫున యువ కెప్టెన్‌గా మాథ్యూస్ ఘనతకెక్కాడు.