#BanvsSL- #Angelo Mathews- #ShakibAlHasan: వన్డే వరల్డ్‌కప్-2023.. ఢిల్లీ.. అరుణ్‌జైట్లీ స్టేడియం.. శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్.. ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన రెండు జట్ల మధ్య పోటీ.. ఇందులో గెలిచినా.. సెమీ ఫైనల్లో అడుగుపెట్టే అవకాశం లేదు.. కానీ.. చాంపియన్స్ ట్రోఫీ-2025కి అర్హత సాధించాలంటే మాత్రం ఇరు జట్లకు ఈ మ్యాచ్‌లో గెలుపు అత్యవసరం...
పాయింట్ల పట్టికలో టాప్-7లో నిలిచి చాంపియన్స్ ట్రోఫీ బరిలో నిలవాంటే... అత్యంత కీలకమైన ఈ మ్యాచ్‌లో ఎలాగైనా పైచేయి సాధించాల్సిందేనన్న పట్టుదలతో బరిలోకి దిగాయి. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.
లంక ఓపెనర్ కుశాల్ పెరీరాను 4 పరుగులకే పెవిలియన్‌కు పంపి బంగ్లాకు శుభారంభం అందించాడు పేసర్ షోరిఫుల్ ఇస్లాం. వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ కుశాల్ మెండిస్(19)ను షకీబ్ అవుట్ చేశాడు.
ఈ క్రమంలో మరో ఓపెనర్ పాతుమ్ నిసాంక(41), సదీర సమరవిక్రమతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. నిసాంక అవుటైన తర్వాత చరిత్ అసలంక సమరవిక్రమకు తోడయ్యాడు.
అయితే.. లంక ఇన్నింగ్స్ 25వ ఓవర్ రెండో బంతికి.. 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నపుడు.. సమరవిక్రమ షకీబ్ బౌలింగ్‌లో మహ్మదుల్లాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
హైడ్రామా మొదలైంది అప్పుడే
దీంతో నాలుగు వికెట్లు కోల్పోయిన శ్రీలంక వ్యూహాత్మకంగా ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్‌ను బరిలోకి దింపింది. కానీ దురదృష్టవశాత్తూ మాథ్యూస్ రాంగ్ హెల్మెట్ వెంట తెచ్చుకున్నాడు.
క్రీజులోకి వచ్చిన తర్వాత బ్యాటింగ్ పొజిషన్ తీసుకోకముందే ఈ విషయాన్ని గమనించిన అతడు.. వేరే హెల్మెట్ కావాలంటూ డ్రెస్సింగ్‌రూం వైపు సైగ చేశాడు. సబ్‌స్టిట్యూట్ కరుణరత్నె వెంటనే హెల్మెట్ తీసుకుని మైదానంలోకి వచ్చాడు.
షకీబ్ బుర్ర పాదరసంలా పనిచేసింది!
ఇదంతా జరగడానికి రెండు నిమిషాలకు పైగా సమయం పట్టింది. అప్పుడే షకీబ్ బుర్ర పాదరసంలా పనిచేసింది. అంతర్జాతీయ క్రికెట్ నిబంధనలకు అనుగుణంగా.. మాథ్యూస్ విషయంలో ‘టైమ్డ్ అవుట్’కి అప్పీలు చేశాడు. అంతేకాదు ఈ నిబంధన అమలు చేయాల్సిందేనంటూ పట్టుబట్టాడు.
ప్రయత్నం చేయకుండానే వికెట్
దీంతో అంపైర్లు ఏంజెలో మాథ్యూస్ అవుటైనట్లు ప్రకటించారు. ఎలాంటి ప్రయత్నం చేయకుండానే వికెట్ దొరికిన సంబరంలో బంగ్లాదేశ్ మునిగిపోగా.. ఈ అనూహ్య ఘటనతో శ్రీలంక శిబిరంలో ఒక్కసారిగా అయోమయం నెలకొంది.
బంగ్లా సంబరం.. శ్రీలంక అయోమయం
ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ బ్యాటర్ ‘టైమ్డ్ అవుట్’గా వెనుదిరగడం ఇదే తొలిసారి. అలా.. నిర్ణీత సమయంలో బంతిని ఎదుర్కోవడంలో విఫలమైనందున ఏంజెలో మాథ్యూస్ ఈ ‘శిక్ష’ అనుభవించకతప్పలేదు.
బతిమిలాడినా కరుణించలేదు
హెల్మెట్ కారణంగా జరిగిన తాత్సారం మూలంగా అతడు భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. అంపైర్లు, షకీబ్ దగ్గరికి వెళ్లి మరీ విషయం ఏమిటో వివరించేందుకు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. మాథ్యూస్ బాధను అర్థం చేసుకోవాల్సిన అవసరం తనకు లేదన్నట్లు షకీబ్ నవ్వుతూ అలా చూస్తూ ఉండిపోయాడు.
అప్పీలు వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదన్నట్లు ముందుకు సాగిపోయాడు. శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండిస్ సైతం బంగ్లాదేశ్ కోచ్ చండిక హతుర్‌సింఘతో ఈ విషయం గురించి చర్చించాడు. ఫోర్త్ అంపైర్ దృష్టికి కూడా విషయాన్ని తీసుకువెళ్లారు.
తప్పు ఎవరిది?
కానీ అప్పటికే కొత్త బ్యాటర్ క్రీజులోకి రావడం బ్యాటింగ్ మొదలుపెట్టడం జరిగిపోయింది. అంతగా ఆసక్తి కలిగించదనుకున్న మ్యాచ్ కాస్తా ఈ అనూహ్య ఘటన మూలంగా.. క్రీడా వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారిపోయింది.
సోషల్ మీడియాలో రెండు వర్గాలుగా విడిపోయి ఈ ఘటనపై చర్చిస్తున్నారు నెటిజన్లు. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌లో క్రీడాస్ఫూర్తి కొరవడిందని చాలా మంది ట్రోల్ చేస్తుంటే.. ఇదంతా నిబంధనలకు అనుగుణమే కదా అని మరికొందరు వాదిస్తున్నారు.
నిబంధనలు ఏం చెప్తున్నాయి?
ఎంసీసీ నిబంధన ప్రకారం.. ఓ జట్టు బ్యాటింగ్ చేస్తున్నపుడు వికెట్ పడిన తర్వాత లేదంటే.. బ్యాటర్ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగితే... సదరు ప్లేయర్ స్థానంలో వచ్చే ఆటగాడు.. మైదానంలోకి వచ్చిన మూడు నిమిషాల్లోపే బంతిని ఎదుర్కోవాలి.
లేదంటే బ్యాటర్‌ను టైమ్డ్ అవుట్‌గా పరిగణిస్తారు. ఇక ఐసీసీ వరల్డ్‌కప్ నిబంధనల ప్రకారం.. రెండు నిమిషాల్లోపే బ్యాటర్ బాల్‌ను ఫేస్ చేయాలి. ఈ నిబంధనను ఆధారం చేసుకునే షకీబ్ అల్ హసన్ ఏంజెలో మాథ్యూస్ విషయంలో అప్పీలుకు వెళ్లి సఫలమయ్యాడు.
అతడి విషయంలో అలా అనుకున్న వాళ్లదే తప్పు
అయితే, దీని మూలంగా.. జెంటిల్మన్‌గేమ్‌లో క్రీడాస్ఫూర్తిని మరచిన ఆటగాడిగా అతడు చరిత్రలో మిగిలిపోతాడని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇందుకు సంబంధించి గతంలో.. తమకు(స్థానిక లీగ్ మ్యాచ్) ప్రతికూల ఫలితం వచ్చినపుడు అంపైర్ల పట్ల షకీబ్ వ్యవహరించిన తీరును గుర్తు చేస్తున్నారు.
ఇలాంటి వ్యక్తి నుంచి స్పోర్ట్స్‌మెన్‌షిప్ ఆశించినవాళ్లదే తప్పు అంటూ ట్రోల్ చేస్తున్నారు. షకీబ్ తీరే అంత అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. టైమ్‌బ్యాడ్ అని సరిపెట్టుకోకతప్పదంటూ మాథ్యూస్‌కు హితవు పలుకుతున్నారు. సమయం వృథా చేయడం వల్ల మూల్యం చెల్లించావంటూనే సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
మరికొందరేమో.. టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్‌లో.. మాథ్యూస్‌లాగే మహ్మద్ రిజ్వాన్ టైమ్ వేస్ట్ చేసినపుడు విరాట్ కోహ్లి చేతిగడియారం చూసుకుంటున్నట్లు అభినయించిన ఫొటోలు షేర్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీరు ఎటువైపు ఉంటారు?!
చదవండి: Virat Kohli: అవును.. కోహ్లి స్వార్థపరుడే! ముమ్మాటికీ స్వార్థపరుడే..!!
#BANvSL "Angelo Mathews"
— Ankur Jain 🇮🇳 (@aankjain) November 6, 2023
what is this? pic.twitter.com/JIsQo6cPut
Angelo Mathews becomes the first cricketer in history to be out on 'timed out'
— Troll Mafia (@offl_trollmafia) November 6, 2023
If you Expect sportsmanship from Shakib-al-hasan then it's your Mistake
He didn't even respect Umpires 🤮#SLvBAN #ODIWorldCup2023 #ICCWorldCup2023 #SLvsBAN pic.twitter.com/PGqQfM9HFQ
Comments
Please login to add a commentAdd a comment