Angelo Mathews- Shakib Al Hasan- Timed Out: బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌కు శ్రీలంక ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ సోదరుడు ట్రెవిన్ మాథ్యూస్ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ‘టైమ్డ్ అవుట్’ విషయంలో షకీబ్ వ్యవహరించిన తీరుకు కచ్చితంగా మూల్యం చెల్లించాల్సి వస్తుందంటూ హెచ్చరించాడు.
క్రీడాస్ఫూర్తిని మరిచిన అతడు శ్రీలంకలో అడుగుపెడితే అభిమానుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రెవిన్ పేర్కొన్నాడు. షకీబ్‌కు రాళ్లతో సన్మానం ఖాయమంటూ తీవ్ర విమర్శలు చేశాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో శ్రీలంక క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్ అనూహ్య, అరుదైన రీతిలో అవుటైన విషయం తెలిసిందే.
ఆలస్యం చేశాడు.. అనుభవించకతప్పలేదు
న్యూఢిల్లీలో జరిగిన ఈ మ్యాచ్‌లో.. లంక ఇన్నింగ్స్ 25వ ఓవర్ రెండో బంతికి సమరవిక్రమ అవుటయ్యాడు. నిబంధనల ప్రకారం తర్వాతి బ్యాటర్ 2 నిమిషాల్లోగా బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. క్రీజ్‌లోకి మాథ్యూస్ సరైన సమయానికే వచ్చినా బంతిని ఎదుర్కోవడంలో ఆలస్యం చేశాడు.
తన హెల్మెట్‌ను సరి చేసుకుంటుండగా దాని స్ట్రాప్ తెగింది. దాంతో మరో హెల్మెట్ కోసం సైగ చేయగా, చమిక మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చాడు. అప్పటికే సమయం మించిపోవడంతో బౌలర్, బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ ‘టైమ్డ్ అవుట్’ కోసం అప్పీల్ చేశాడు.
ఈ అప్పీల్‌ను పరిగణనలోకి తీసుకున్న అంపైర్లు చర్చించి నిబంధనల ప్రకారం మాథ్యూస్‌ను ‘అవుట్’గా ప్రకటించారు. ఈ క్రమంలో తన హెల్మెట్ సమస్యను మాథ్యూస్ అంపైర్లకు వివరించినా వారు స్పందించలేదు.
బతిమిలాడినా మనసు కరగలేదు
ఆ తర్వాత అప్పీల్ వెనక్కి తీసుకోమని షకీబ్‌ను కూడా కోరినా అతను ససేమిరా అనడంతో మాథ్యూస్ వెనుదిరగక తప్పలేదు. దీంతో.. 146 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌లో ‘టైమ్డ్ అవుట్’ ద్వారా అవుట్ అయిన తొలి క్రికెటర్‌గా మాథ్యూస్ నిలిచాడు.
ఈ నేపథ్యంలో జెంటిల్మన్ గేమ్‌లో షకీబ్ క్రీడాస్ఫూర్తిని విస్మరించాడంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై స్పందించిన ఏంజెలో మాథ్యూస్ సోదరుడు ట్రెవిన్ మాథ్యూస్ షకీబ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
రాళ్లు విసరడం ఖాయం
దక్కన్ క్రానికల్‌తో మాట్లాడుతూ.. ‘‘మేము నిరాశకు గురయ్యాం. బంగ్లాదేశీ కెప్టెన్‌కు క్రీడాస్ఫూర్తి అంటే ఏమిటో తెలిసినట్లు లేదు. జెంటిల్మన్ గేమ్‌లో అతడు మానవతా దృక్పథం కనబరచకలేకపోయాడు.
ఇకపై అతడికి శ్రీలంకలో ఎవరూ స్వాగతం పలకరు. ఏదైనా అంతర్జాతీయ మ్యాచ్ లేదంటే లంక ప్రీమియర్ లీగ్ ఆడేందుకు ఇక్కడికి వస్తే.. అతడిపై రాళ్లు విసురుతారు. అభిమానుల నుంచి అతడు ఛీత్కారాలు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని ట్రెవిన్ మాథ్యూస్ షకీబ్‌కు హెచ్చరికలు జారీ చేశాడు.
కాగా ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా బంగ్లాదేశ్ 2025లో శ్రీలంకలో పర్యటించాల్సి ఉంది. అప్పటికి షకీబ్- మాథ్యూస్ టైమ్డ్ అవుట్ వివాదం సమసిపోతుందో లేదో చూడాలి!!
ఫోర్త్ అంపైర్ చెప్పిందిదే
లంక ఇన్నింగ్స్ అనంతరం.. మాథ్యూస్ టైమ్డ్ అవుట్‌పై ఫోర్త్ అంపైర్ ఏడ్రియన్ హోల్డ్‌స్టాక్ దీనిపై మరింత స్పష్టతనిచ్చారు. ‘మాథ్యూస్‌కు హెల్మెట్ సమస్య కూడా రెండు నిమిషాల తర్వాత వచ్చింది.
అప్పటికీ అతను బంతిని ఎదుర్కోకుండా ఆలస్యం చేశాడు. క్రీజ్‌లోకి వచ్చే ముందు ఎక్విప్‌మెంట్‌లో అన్నింటినీ సరిగ్గా చూసుకోవడం కూడా బ్యాటర్‌దే బాధ్యత’ అని ఆయన చెప్పారు.
దాంతో షకీబ్ క్రీడా స్ఫూర్తి అంశాన్ని పక్కన పెడితే నిబంధనల ప్రకారం మాథ్యూస్‌ను అవుట్‌గా ప్రకటించడం సరైందే కదా అని క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కాగా షకీబ్‌ను అవుట్ చేసిన తర్వాత మాథ్యూస్ కూడా వాచీ చూసుకుంటున్నట్లుగా అభినయిస్తూ నీ టైమ్ అయిపోయిందిక అన్నట్లు సైగ చేయడం గమనార్హం.
ఇక ఈ మ్యాచ్‌లో లంకపై బంగ్లాదేశ్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. తద్వారా ప్రపంచకప్ టోర్నీలో శ్రీలంకపై తొలి విజయం నమోదు చేసింది.
చదవండి: ఆస్ట్రేలియాతో టీమిండియా సిరీస్... అభిమానులకు బ్యాడ్‌న్యూస్!
ఎక్కడ తగ్గాలో.. ఎలా నెగ్గాలో తెలిసిన వాళ్లు! ఇలాంటి ఆటగాళ్లు ఉంటే..
Comments
Please login to add a commentAdd a comment