2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటిస్తున్న పాకిస్తాన్.. గాలే వేదికగా ఇవాళ (జులై 16) ప్రారంభమైన తొలి టెస్ట్‌లో ఓ మోస్తరు ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. వెటరన్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ (64), ధనంజయ డిసిల్వ (94 నాటౌట్) అర్ధశతకాలతో రాణించారు.
లంక ఇన్నింగ్స్‌లో నిషాన్ మధుష్క (4), కుశాల్ మెండిస్ (12), దినేశ్ చండీమాల్ (1) విఫలం కాగా.. దిముత్ కరుణరత్నే (29), సదీర సమరవిక్రమ (36) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 3 వికెట్లు పడగొట్టగా.. నసీం షా, అబ్రార్ అహ్మద్, అఘా సల్మాన్ తలో వికెట్ దక్కించుకున్నారు. వర్షం కారణంగా తొలి రోజు కేవలం 65.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది.
వంద వికెట్ల క్లబ్‌లో అఫ్రిది..
తొలి రోజు ఆటలో 3 వికెట్లు పడగొట్టిన షాహీన్ అఫ్రిది టెస్ట్‌ల్లో 100 వికెట్ల క్లబ్‌లో చేరాడు. 23 ఏళ్ల అఫ్రిది 26 టెస్ట్‌ల్లో 102 వికెట్లు పడగొట్టాడు.
దిగ్గజాల సరసన ఏంజెలో..
లంక ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ దిగ్గజ క్రికెటర్ల సరసన చేరాడు. పాక్-శ్రీలంక మధ్య టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఐదో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో కుమార సంగక్కర (2911) టాప్‌లో ఉండగా.. యూనిస్ ఖాన్ (2286), జయవర్ధనే (1687), ఇంజమామ్ ఉల్ హాక్ (1559) వరుసగా 2, 3, 4 స్థానాల్లో ఉన్నారు. వీరి తర్వాత మాథ్యూస్ 1522 పరుగులతో ఐదో స్థానంలో నిలిచాడు.
జయవర్ధనే, సంగక్కర తర్వాత..
వెటరన్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ శ్రీలంక తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక బంతులు ఎదుర్కొన్న మూడో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. మాథ్యూస్.. తన 105 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్‌లో 15029 పరుగులు ఎదుర్కొనగా.. లంక తరఫున అత్యధిక బంతులు ఎదుర్కొన్న ఆటగాడిగా మహేళ జయవర్ధనే (22959) ముందువరుసలో ఉన్నాడు. జయవర్ధనే తర్వాత కుమార సంగక్కర (22882) ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment