శ్రీలంక, బంగ్లాదేశ్‌ ఆటగాళ్ల మధ్య  కొనసాగుతున్న "రివెంజ్‌ వార్‌" | BAN VS SL 3rd ODI: Lanka, Bangla Encounter Continues With Mushfiqur Rahim Broken Helmet Celebrations | Sakshi
Sakshi News home page

టైమ్ అవుట్‌కు హెల్మెట్‌ కౌంటర్‌.. బంగ్లా, లంక ఆటగాళ్ల మధ్య  కొనసాగుతున్న "రివెంజ్‌ వార్‌"

Published Mon, Mar 18 2024 7:59 PM | Last Updated on Mon, Mar 18 2024 8:15 PM

BAN VS SL 3rd ODI: Lanka, Bangla Encounter Continues With Mushfiqur Rahim Broken Helmet Celebrations - Sakshi

ఇటీవలికాలంలో శ్రీలంక, బంగ్లాదేశ్‌ క్రికెటర్ల మధ్య ప్రతీకార చర్యలు ఎక్కువై పోయాయి. ఈ ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలో ఎప్పుడు ఎదురుపడ్డా కొట్టుకున్నంత పని చేస్తున్నారు. వన్డే వరల్డ్‌కప్‌ 2023 సందర్భంగా మొదలైన ఈ రివెంజ్‌ వార్‌.. తాజాగా జరిగిన ఓ మ్యాచ్‌ అనంతరం పతాక స్థాయి చేరింది. 

వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ సందర్భంగా హెల్మెట్‌ సమస్య కారణంగా లంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్‌ను టైమ్డ్‌ అవుట్‌గా ప్రకటించారు. బంగ్లా ఆటగాళ్ల అనైతిక అప్పీల్‌ కారణంగా ఆ మ్యాచ్‌లో మాథ్యూస్‌ అరుదైన రీతిలో ఔటయ్యాడు. 

అప్పట్లో బంగ్లా ఆటగాళ్ల అనైతికతను బహిరంగంగా ఎండగట్టిన లంక ఆటగాళ్లు తాజాగా జరిగిన ఓ సిరీస్‌ సందర్భంగా వారిపై ప్రతీకారం​ తీర్చుకున్నారు. ఇటీవల బంగ్లాదేశ్‌పై టీ20 సిరీస్‌ నెగ్గిన లంకేయులు.. అనంతరం జరిగిన గెలుపు సంబురాల్లో "టైమ్డ్‌ అవుట్‌" అంశాన్ని సూచిస్తూ ఓవరాక్షన్‌ చేశారు.

ఆ చర్యకు ప్రతీకారం​ తీర్చుకునే అవకాశం బంగ్లాదేశ్‌కు ఇవాళ (మార్చి 18) వచ్చింది. వన్డే సిరీస్‌లో శ్రీలంకను 2-1 తేడాతో చిత్తు చేసిన అనంతరం బంగ్లాదేశ్‌ వెటరన్‌ ముష్ఫికర్‌ రహీం హెల్మట్‌ను పట్టుకుని శ్రీలంక టైమ్డ్‌ అవుట్‌ యాక్షన్‌కు రీకౌంటర్‌ ఇచ్చాడు. 

శ్రీలంక, బంగ్లాదేశ్‌ క్రికెటర్ల మధ్య జరుగుతున్న ఈ ప్రతీకార చర్యల యుద్దానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ అంశానికి నెటిజన్లు "నాగిన్‌ రైవల్రీ" అని నామకరణం చేశారు. 

కాగా, శ్రీలంకతో ఇవాళ జరిగిన సిరీస్‌ డిసైడర్‌ మ్యాచ్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను బంగ్లాదేశ్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌట్‌ కాగా.. బంగ్లాదేశ్‌ 40.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను చేతిక్కించుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement