
మహిళల వన్డే ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో వెస్టిండీస్‌కు గుండె కోత మిగిలింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గెలిచినా కరీబియన్ జట్టు వరల్డ్‌కప్‌కు అర్హత సాధించలేకపోయింది. థాయ్‌లాండ్‌తో ఇవాళ (ఏప్రిల్ 19) జరిగిన డు ఆర్ డై మ్యాచ్‌లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన థాయ్‌లాండ్ 46.1 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌట్ కాగా.. వెస్టిండీస్ కేవలం 10.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అయినా 0.013 రన్‌రేట్ తేడాతో వరల్డ్‌కప్ బెర్త్‌ను కోల్పోయింది.
పాయింట్ల పరంగా విండీస్‌తో సమానంగా ఉన్నప్పటికీ.. రన్‌రేట్ కాస్త ఎక్కువగా ఉండటంతో బంగ్లాదేశ్ ప్రపంచకప్ బెర్త్‌ను దక్కించుకుంది. ఈ టోర్నీలో పాక్ ఆడిన 5 మ్యాచ్‌ల్లో గెలిచి తొలి ప్రపంచకప్ బెర్త్‌ను ఖరారు చేసుకోగా.. రెండో బెర్త్ కోసం వెస్టిండీస్, బంగ్లాదేశ్ పోటీపడ్డాయి. ఇరు జట్లు చెరో 5 మ్యాచ్‌ల్లో తలో మూడు గెలువగా, రన్‌రేట్ కాస్త ఎక్కువగా ఉండటం చేత బంగ్లాదేశ్ వరల్డ్‌కప్‌కు అర్హత సాధించింది.
కాగా, పాక్ వేదికగా జరిగిన మహిళల వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్-2025లో మొత్తం ఆరు జట్లు (పాకిస్తాన్, బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఐర్లాండ్, స్కాట్లాండ్, థాయ్‌లాండ్) పాల్గొన్నాయి. ఇందులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన పాక్, బంగ్లాదేశ్ వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్ వేదికగా మహిళల వన్డే వరల్డ్‌కప్ జరుగనుంది. ఈ టోర్నీకి భారత్ సహా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్ నేరుగా అర్హత సాధించగా.. పాక్, బంగ్లాదేశ్ క్వాలిఫయర్స్ ద్వారా క్వాలిఫై అయ్యాయి.