వెస్టిండీస్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్‌.. ఒకే ఒక విజయం దూరంలో..! | Bangladesh Women Beat West Indies By 60 Runs In 2nd ODI | Sakshi
Sakshi News home page

వెస్టిండీస్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్‌.. ఒకే ఒక విజయం దూరంలో..!

Published Wed, Jan 22 2025 12:39 PM | Last Updated on Wed, Jan 22 2025 12:55 PM

Bangladesh Women Beat West Indies By 60 Runs In 2nd ODI

బంగ్లాదేశ్‌ మహిళల క్రికెట్‌ జట్టు వెస్టిండీస్‌కు షాకిచ్చింది. ఐసీసీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన వన్డే మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఏ ఫార్మాట్‌లో అయినా బంగ్లాదేశ్‌కు విండీస్‌పై ఇదే తొలి గెలుపు. ఈ గెలుపుతో బంగ్లాదేశ్‌ వన్డే ప్రపంచ కప్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ప్రపంచకప్‌కు అర్హత సాధించేందుకు బంగ్లాదేశ్‌ ఒకే ఒక మ్యాచ్‌ దూరంలో ఉంది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య నిన్న (జనవరి 21) రెండో వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌కు ఊహించని పరాభవం ఎదురైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ 48.5 ఓవర్లలో 184 పరుగులకు ఆలౌటైంది. 

కెప్టెన్‌ నిగార్‌ సుల్తానా (68) బాధ్యతాయుతంగా ఆడి తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించింది. శోభన మోస్తరి (23), షోర్నా అక్తెర్‌ (21) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. వీరు మినహా బంగ్లా ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా కనీసం 20 పరుగుల మార్కును దాటలేదు. 

ఫర్జానా హాక్‌ 18, ముర్షిదా ఖాతూన్‌ 12, షిర్మన్‌ అక్తెర్‌ 11, ఫహిమా ఖాతూన్‌ 4, రబేయా ఖాన్‌ 1, నహీదా అక్తెర్‌  పరుగులు చేశారు. విండీస్‌ బౌలర్లలో కరిష్మా రామ్హరాక్‌ 4 వికెట్లు తీయగా.. ఆలియా అలెన్‌ 3, డియాండ్రా డొట్టిన్‌, ఫ్రేసర్‌, అఫీ ఫ్లెచర్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్‌ 35 ఓవర్లలో 124 పరుగులకే చాపచుట్టేసింది. బంగ్లా బౌలర్లు మరుఫా అక్తెర్‌ (8-0-35-2), నహీదా అక్తెర్‌ (10-0-31-3), రబేయా ఖాన్‌ (8-0-19-2), ఫహీమా ఖాతూన్‌ (5-0-17-2) రెచ్చిపోయి బౌలింగ్‌ చేశారు. 

వీరి ధాటికి పటిష్టమైన విండీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌ పేకమేడలా కూలింది. విండీస్‌ ఇన్నింగ్స్‌లో షెర్మైన్‌ క్యాంప్‌బెల్‌ (28) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. కెప్టెన్‌ హేలీ మాథ్యూస్‌ (16), ఆలియా అలెన్‌ (15), చెర్రీ ఫ్రేసర్‌ (18 నాటౌట్‌), కరిష్మ రామ్హరాక్‌ (13) రెండంకెల స్కోర్లు చేశారు. 

ఈ గెలుపుతో బంగ్లాదేశ్‌ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో విండీస్‌ ఆధిక్యాన్ని తగ్గించింది. ప్రస్తుతం ఇరు జట్లు చెరో విజయంతో సమంగా నిలిచాయి. తొలి వన్డేలో వెస్టిండీస్‌ 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. సిరీస్‌లో చివరిదైన, నిర్ణయాత్మకమైన మూడో వన్డే జనవరి 24న జరుగనుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement