
ఐసీసీ ఛాంపియన్షిప్ 2025లో భాగంగా బంగ్లాదేశ్ మహిళల క్రికెట్ జట్టు వెస్టిండీస్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో ఇరు జట్లు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్నాయి. వన్డే సిరీస్‌లో భాగంగా నిన్న (జనవరి 19) సెయింట్ కిట్స్‌లో తొలి మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్ పర్యాటక బంగ్లాదేశ్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. విండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి తమ విజయంలో ప్రధాన పాత్ర పోషించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో షర్మిన్ అక్తర్ (42), ముర్షిదా ఖాతూన్ (40), శోభన మోస్తరీ (35), షోమా అక్తర్ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఫర్జానా హక్ (10), కెప్టెన్ నిగర్ సుల్తానా (14), రబెయా ఖాన్ (1), నహిదా అక్తర్ (9), సుల్తానా ఖాతూన్ (2) విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో డియాండ్రా డొట్టిన్ మూడు వికెట్లతో చెలరేగగా.. ఆలియా అలెన్, హేలీ మాథ్యూస్ తలో రెండు, అఫీ ఫ్లెచర్ ఓ వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం బరిలోకి దిగిన వెస్టిండీస్ 31.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ హేలీ మాథ్యూస్ అజేయ సెంచరీతో (93 బంతుల్లో 104 నాటౌట్; 16 ఫోర్లు) విండీస్‌ను విజయతీరాలకు చేర్చింది. క్యియానా జోసఫ్ (79 బంతుల్లో 70; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించింది.
మాథ్యూస్, జోసఫ్ తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 163 పరుగులు జోడించారు. వన్‌డౌన్‌లో వచ్చిన షెర్మైన్ క్యాంప్‌బెల్ 14 పరుగులతో అజేయంగా నిలిచింది. క్వియానా జోసఫ్ వికెట్ రిబేయా ఖాన్‌కు దక్కింది. ఈ గెలుపుతో విండీస్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరు జట్ల మథ్య రెండో వన్డే జనవరి 21న జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment