మాథ్యూస్ చేసింది సరైంది కాదు..
కొలంబో:గత నెలలో శ్రీలంక క్రికెట్ జట్టు కెప్టెన్సీ కి గుడ్ బై చెబుతూ ఏంజెలో మాథ్యూస్ తీసుకున్న నిర్ణయం ఎంతమాత్రం సరైంది కాదని ఆ దేశ దిగ్గజ కెప్టెన్ అర్జున రణతుంగ అభిప్రాయపడ్డాడు. ఇక్కడ అతను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని చెబితే శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్ఎల్సీ) ఎలా అనుమతి ఇచ్చిందని రణతుంగ ప్రశ్నించాడు. అతను కెప్టెన్సీ నుంచి వైదొలగడానికి అనుమతి ఇవ్వకుండా ఉండాల్సిందన్నాడు. జట్టు అవసరాల దృష్ట్యా అతన్ని మరికొంత కాలం కెప్టెన్ గా కొనసాగమని ఎస్ఎల్సీ పెద్దలు కోరి ఉండాల్సిందన్నాడు. ఒకవేళ కెప్టెన్సీ విషయంలో తనను మాథ్యూస్ అడిగితే అనుమతి ఇచ్చేవాడిని కాదన్నాడు. అందుకు ఇది తగిన సమయం కాదని చెప్పేవాడినని రణతుంగ పేర్కొన్నాడు.
'నేను చూసిన లంక కెప్టెన్లలో మాథ్యూస్ ఒక అత్యుత్తమ కెప్టెన్. రంజన్ మదుగలే తరువాత ఆ స్థాయి ఉన్న కెప్టెన్ మాథ్యూస్. కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని బోర్డుకు చెప్పినప్పుడు అందుకు అనుమతి ఇచ్చి ఉండాల్సింది కాదు. నీ నిర్ణయాన్ని కొన్నాళ్లు అలా ఉంచుకోమని బోర్డు చెప్పి ఉండాల్సింది. అది చేయకపోవడంతో లంక జట్టు పరిస్థితి పూర్తిగా గాడి తప్పింది. గతేడాది ఆసీస్ వంటి నంబర్ వన్ జట్టును మాథ్యూస్ నేతృత్వంలోని శ్రీలంక వైట్ వాష్ చేసింది. ఆ క్రెడిట్ మాథ్యూస్ తో పాటు యావత్ జట్టుకు దక్కింది. అయితే జట్టు ఓటములకే మాథ్యూస్ ను బలి పశువును చేస్తున్నారు. ఇది నిజంగా బాధాకరం. ఈ కారణం చేత మాథ్యూస్ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్ బె చెప్పాడు. మాథ్యూస్ సానుకూల ధోరణి గల కెప్టెన్. అతను ఆత్మవిశ్వాసం సడలడానికి మా క్రికెట్ బోర్డే కారణం'అని రణతుంగా తెలిపాడు.