'కంగారు'లకు హెరాత్ గండం!
గాలే(శ్రీలంక): ఆస్ట్రేలియాపై 17 ఏళ్ల తర్వాత విజయం సాధించిన శ్రీలంక జట్టు మూడు టెస్టుల సిరీస్ ను నెగ్గేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా పల్లెకెలెలో జరిగిన తొలి టెస్టులో ఆసీస్ పై విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలిసారి లంక గెలిచినప్పుడు తాను చిన్న పిల్లాడినని కెప్టెన్ మాథ్యూస్ పేర్కొన్నాడు. గాలేలో చివరి టెస్టులో హెరాత్ 10 వికెట్లతో చెలరేగిన విషయాన్ని గుర్తుచేశాడు. బ్యాటింగ్ లో చాలా లోపాలున్నా, గత మ్యాచ్ విజయంతో అదే జట్టుతో బరిలోకి దిగనున్నట్లు తెలిపాడు. స్పిన్నర్ రంగన హెరాత్ (9/103) అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో పాటు యువ సంచలనం కుశాల్ మెండిస్ తొలి టెస్టు భారీ సెంచరీ(176 పరుగులు) లంకకు విజయాన్ని అందించాయి. ఆడుతున్నటి తొలి టెస్టు అయినా లక్షణ్ సందకన్ 7 వికెట్లు తీసి ఆసీస్ పై ఒత్తిడి పెంచాడు.
గత మ్యాచులో ఆసీస్ భరతం పట్టిన హెరాత్.. 1999లో ఆసీస్ పై శ్రీలంక గెలిచిన తొలి మ్యాచ్ లోనే టెస్టు అరంగేట్రం చేయడం గమనార్హం. ఆ లెక్కన చూస్తే ఆసీస్ పై నెగ్గిన రెండు పర్యాయాలు జట్టులో ఉన్న ఏకైక ఆటగాడు హెరాత్. గాలేలో తొలి రెండు రోజులు స్పిన్ కు అనుకూలిస్తుందని, ఉపఖండంలో ఎలాగూ స్పిన్నర్లదే హవా అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరోవైపు ఆసీస్ కూడా బ్యాటింగ్ లో చాలా బలహీనంగా ఉంది. తొలి టెస్టులో కేవలం స్టీవెన్ స్మిత్ ఒక్కడు మాత్రమే హాప్ సెంచరీ చేశాడు.