'దిల్‌రువాన్ సైలెంట్ హీరో'
గాలె: ఆఫ్ స్పిన్నర్ దిల్‌రువాన్ పెరీరాను శ్రీలంక కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ 'సైలెంట్ హీరో'గా వర్ణించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో పెరీరా పది వికెట్లు తీయడంతో పాటు అర్ధసెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. టెస్టుల్లో వేగంగా 50 వికెట్లు పడగొట్టిన శ్రీలంక బౌలర్ గా నిలిచాడు. 11 టెస్టుల్లోనే అతడు ఈ ఫీట్ సాధించాడు. అజంతా మెండిస్ పేరిట ఉన్న రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. మెండిస్ 12 టెస్టుల్లో 50 వికెట్లు తీశాడు.
'రంగనా హిరాత్ గురించి మేమంతా ఎక్కువగా మాట్లాడుతున్నాం. దిల్‌రువాన్ గురించి పెద్దగా మాట్లాడలేదు. కానీ అతడు వేగంగా 50 టెస్టు వికెట్లు సాధించాడు. అతడు నినాదంగా తన పని తాను చేశాడు. దిల్‌రువాన్ సైలెంట్ హీరో. గత మ్యాచ్ లో బౌలింగ్ చేసే అవకాశం అతడికి ఇవ్వలేదు. అతడు చురుకైన బౌలర్. గాలె మైదానంలో ఎలా బౌలింగ్ చేయాలో దిల్‌రువాన్ కు తెలుసు. శిక్షణా శిబిరంలో చాలా కష్టపడతాడు. రాబోయే రోజుల్లో అతడి బౌలింగ్ ను సమర్థవంతంగా వినియోగించుకుంటామ'ని మ్యాచ్ ముగిసిన తర్వాత మాథ్యూస్ అన్నాడు.
కాగా, ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌ను శ్రీలంక మరో టెస్టు మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. మూడో టెస్టు 13 నుంచి జరుగుతుంది.