WC 2023- Eng Vs SL: వన్డే వరల్డ్‌కప్-2023లో ఇంగ్లండ్ బ్యాటర్ల వైఫల్యం కొనసాగుతోంది. గత మ్యాచ్‌లో సౌతాఫ్రికాలో బౌలర్ల ధాటికి చేతులెత్తేసిన ఇంగ్లండ్ ఆటగాళ్లు.. తాజాగా శ్రీలంక పేసర్ల దెబ్బకు పెవిలియన్‌కు క్యూ కట్టారు. 33.2 ఓవర్లకే ఆలౌట్ అయి విమర్శలు మూటగట్టుకుంటున్నారు.
భారత్ వేదికగా ప్రపంచకప్ టోర్నీలో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శ్రీలంకతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు జానీ బెయిర్ స్టో 30, డేవిడ్ మలన్ 28 పరుగులతో ఫర్వాలేదనిపించారు.
స్టోక్స్ 43 పరుగులతో
వన్‌డౌన్ బ్యాటర్ జో రూట్(3) పూర్తిగా విఫలం కాగా.. బెన్ స్టోక్స్ 43 పరుగులతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా వాళ్లలో మొయిన్ అలీ(15), డేవిడ్ విల్లే(14- నాటౌట్) మినహా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.
లంక పేసర్ల దెబ్బకు తోకముడిచిన ఇంగ్లండ్
ఈ మ్యాచ్‌తో తుది జట్టులోకి వచ్చిన పేసర్లు లాహిరు కుమార, ఏంజెలో మాథ్యూస్ దెబ్బకు ఇంగ్లండ్ బ్యాటర్లంతా తోకముడిచారు. వీరిద్దరితో పాటు మరో ఫాస్ట్ బౌలర్ కసున్ రజిత కూడా చెలరేగడంతో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ 156 పరుగులకే కుప్పకూలింది.
లంక బౌలర్లలో కుమార.. స్టోక్స్, బట్లర్, లివింగ్‌స్టోన్ రూపలో మూడు కీలక వికెట్లు పడగొట్టగా.. మాథ్యూస్, రజిత రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. స్పిన్నర్ మహీశ్ తీక్షణ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
కాగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌లోనూ బ్యాటర్ల వైఫల్యం కారణంగా 170 పరుగులకే ఆలౌట్ అయిన ఇంగ్లండ్ 229 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడు ఓడిన బట్లర్ బృందం.. లంకతో మ్యాచ్‌లోనూ ఓడిపోతే సెమీస్ అవకాశాలు సంక్లిష్టమవుతాయి.
పేరుకు డిఫెండింగ్ చాంపియన్..
వన్డే వరల్డ్‌కప్-2023లో ఇంగ్లండ్ అత్యల్ప స్కోరు నమోదు చేయడం ఇది రెండోసారి. గత మ్యాచ్‌లో వాంఖడేలో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో 170 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. తాజా ఎడిషన్‌లో అఫ్గనిస్తాన్(139, 156)తో పాటు రెండుసార్లు అత్యల్ప స్కోర్లు నమోదు చేసిన జట్టుగా నిలిచింది.
నెదర్లాండ్స్ కంటే ఘోరంగా
ఈ రెండు జట్ల కంటే నెదర్లాండ్స్ మెరుగ్గా ఉంది. ఆస్ట్రేలియాతో బుధవారం నాటి మ్యాచ్‌లో 90 పరుగులకు డచ్ జట్టు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్, అఫ్గన్‌లతో పోలిస్తే ఇంతవరకు ఒకే ఒక్కసారి లోయస్ట్ స్కోరు నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment