New Zealand vs Sri Lanka, 1st Test Day 4- WTC Final Scenario: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో అడుగుపెట్టేందుకు శ్రీలంక టీమిండియాతో పోటీ పడుతోంది. తుదిపోరుకు అర్హత సాధించే రేసులో తాము కూడా ఉన్నామంటూ దూసుకొస్తోంది. న్యూజిలాండ్ గడ్డపై చరిత్ర సృష్టించి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకు తగ్గట్లుగానే మెరుగైన ఆట తీరుతో ఆకట్టుకుంటోంది.
అంచనాలు తలకిందులు చేస్తూ కివీస్‌తో తొలి టెస్టులో హోరాహోరీ తలపడుతోంది. కాగా ఓవర్‌నైట్ స్కోరు 162/5తో మూడో రోజు ఆట కొనసాగించిన న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 373 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో లంకపై 18 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది.
డారైల్ మిచెల్ (193 బంతుల్లో 102; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించగా, మాట్ హెన్రీ (75 బంతుల్లో 72; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడటంతో ఈ మేర ఆధిక్యం సాధ్యమైంది. ఆ తర్వాత బ్యాటింగ్ మొదలెట్టిన శ్రీలంక మూడో రోజు ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు నష్టానికి 83 పరుగులు చేసింది. ఈ క్రమంలో నాలుగో రోజు ఆట ఆరంభం నుంచే దూకుడు కనబరిచింది.
ఏంజెలో మాథ్యూస్ సెంచరీ
నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఏంజెలో మాథ్యూస్ పట్టుదలగా నిలబడి సెంచరీ సాధించాడు. 235 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 115 పరుగులు చేశాడు. మిగిలిన వాళ్లలో చండీమాల్ 42, ధనంజయ డి సిల్వ 47(నాటౌట్) రాణించారు. దీంతో లంక తమ రెండో ఇన్నింగ్స్‌ను 302 పరుగుల వద్ద ముగించింది. 279 పరుగుల ఆధిక్యం సాధించింది.
కివీస్ అద్భుతం చేస్తుందా?
ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య న్యూజిలాండ్ నాలుగో రోజు ఆట ముగిసే సరికి వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే(5)ను స్వల్ప స్కోరుకే అవుట్ చేసి కసున్ రజిత దెబ్బకొట్టాడు. టామ్ లాథమ్ 11, వన్‌డౌన్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఇక నాలుగో రోజు ఆట ముగిసే సరికి కివీస్ విజయానికి 257 పరుగుల దూరంలో ఉండగా.. ఆఖరి రోజు లంక తొమ్మిది వికెట్లు తీస్తే గెలుస్తుంది. ఇంకా 90 ఓవర్ల ఆట మిగిలి ఉన్న క్రమంలో ఈ పరిణామాలు కివీస్- లంక మ్యాచ్ టీమిండియా ఫ్యాన్స్‌ను మరింత ఉత్కంఠలోనికి నెట్టాయి.
టీమిండియా, శ్రీలంక డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు ఎలా ఉన్నాయంటే?!
►స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్టును టీమిండియా గెలిస్తే నేరుగా ఫైనల్ చేరుకుంటుంది.
►ఒకవేళ న్యూజిలాండ్ లంకను తొలి టెస్టులో ఓడించినా, కనీసం ఒక్క మ్యాచ్ డ్రా చేసుకున్నా రోహిత్ సేన తుదిపోరుకు అర్హత సాధిస్తుంది.
►ఇక లంక.. ఆస్ట్రేలియాతో ఫైనల్ ఆడాలంటే న్యూజిలాండ్‌ను 2-0తో వైట్‌వాష్ చేయడం సహా టీమిండియాపై ఆఖరి టెస్టులో ఆసీస్ విజయం సాధించాలి.
Comments
Please login to add a commentAdd a comment