ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో భారత ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో మెరిశాడు. బ్రిస్బేన్‌లో పేస్ దళాన్ని ముందుకు నడిపించిన ఈ స్పీడ్‌స్టర్.. ఆదివారం నాటి ఆటలో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(21)ను అవుట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ నాథన్ మెక్‌స్వీనీ(9)ని కూడా తానే పెవిలియన్‌కు పంపాడు.
ఆ ఇద్దరి సెంచరీలు
ఈ క్రమంలో బుమ్రా స్ఫూర్తితో యువ పేస్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మార్నస్ లబుషేన్(12) ఆట కట్టించాడు. ఫలితంగా 75 పరుగుల వద్ద ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. దీంతో భారత శిబిరంలో ఉత్సాహం నెలకొంది. అయితే, ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు.
నాలుగో నంబర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌కు తోడైన ట్రవిస్ హెడ్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 115 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. టెస్టుల్లో తన తొమ్మిదవ సెంచరీ నమోదు చేసిన అనంతరం హెడ్.. కొరకరాని కొయ్యగా మారాడు. ఈ క్రమంలో.. ఫామ్‌లోలేని స్మిత్ సైతం హెడ్ ఇచ్చిన జోష్‌లో శతక్కొట్టేశాడు.
బుమ్రా విడగొట్టేశాడు
ఈ మిడిలార్డర్ బ్యాటర్లను విడదీసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. అయితే, మరోసారి బుమ్రానే తన అనుభవాన్ని ఉపయోగించి స్మిత్(101)ను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత కాసేపటికే ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్(5) వికెట్‌ను కూడా బుమ్రా తన ఖాతాలో వేసుకున్నాడు.
అనంతరం.. శతకవీరుడు ట్రవిస్ హెడ్(152)ను కూడా అవుట్ చేశాడు బుమ్రా. దీంతో టీమిండియాలో తిరిగి ఉత్సాహం నిండింది. ఇక హెడ్ రూపంలో ఈ ఇన్నింగ్స్‌లో ఐదో వికెట్ దక్కించుకున్న బుమ్రా. తన కెరీర్‌లో ఓవరాల్‌గా పన్నెండోసారి(Five Wicket Haul) ఈ ఘనత సాధించాడు.
Jasprit Bumrah gets Travis Head to bring up his fifth wicket! #AUSvIND | #MilestoneMoment | @nrmainsurance pic.twitter.com/2QGUazarZP
— cricket.com.au (@cricketcomau) December 15, 2024
అదే విధంగా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ)లో అతడికి ఇది తొమ్మిదో ఫైవ్ వికెట్ హాల్. అంతేకాదు.. ఆస్ట్రేలియా గడ్డ మీద నాలుగోసారి బుమ్రా ఈ ఫీట్ నమోదు చేశాడు. ఈ క్రమంలో బుమ్రా రెండు అరుదైన రికార్డులు సొంతం చేసుకున్నాడు.
కమిన్స్ సరసన.. భారత తొలి బౌలర్‌గా రికార్డు
డబ్ల్యూటీసీలో అత్యధికసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన క్రికెటర్‌గా ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ కొనసాగుతున్నాడు. అతడు ఇప్పటికి తొమ్మిదిసార్లు ఈ ఘనత సాధించాడు. తాజా టెస్టుతో బుమ్రా కూడా కమిన్స్ సరసన చేరాడు. ఈ జాబితాలో సౌతాఫ్రికా పేసర్ కగిసో రబడ(7), ఆసీస్ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్(6), న్యూజిలాండ్ ఫాస్ట్‌బౌలర్ టిమ్ సౌథీ(6) వీరి తర్వాతి స్థానాలో ఉన్నారు.
కుంబ్లే రికార్డును సమం చేసిన బుమ్రా
ఇక ఆస్ట్రేలియా గడ్డపై నాలుగుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన భారత బౌలర్‌గా అనిల్ కుంబ్లే కొనసాగుతున్నాడు. బ్రిస్బేన్ టెస్టుతో బుమ్రా కూడా కుంబ్లే రికార్డును సమం చేశాడు. ఇదిలా ఉంటే.. ఓవరాల్‌గా 23సార్లు కపిల్ దేవ్ ఫైవ్ వికెట్ల హాల్ సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
ఆసీస్‌దే పైచేయి
బ్రిస్బేన్‌లో గబ్బా మైదానంలో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా టీమిండియాపై పైచేయి సాధించింది. ఆదివారం నాటి రెండో రోజు ఆట పూర్తయ్యే సరికి ఏడు వికెట్ల నష్టానికి 405 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. హెడ్, స్మిత్ సెంచరీలకు తోడు వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ(45 నాటౌట్) రాణించడం వల్ల ఇది సాధ్యమైంది. ఇక భారత బౌలర్లలో బుమ్రా ఐదు, నితీశ్ రెడ్డి, మహ్మద్ సిరాజ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
ఇదిలా ఉంటే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఈ క్రమంలో పెర్త్ టెస్టులో భారత్, అడిలైడ్ పింక్‌బాల్ టెస్టులో ఆసీస్ విజయం సాధించాయి. దీంతో ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది.
చదవండి: భారత్‌తో మూడో టెస్టు: ట్రవిస్ హెడ్ వరల్డ్ రికార్డు.. సరికొత్త చరిత్ర
Comments
Please login to add a commentAdd a comment