బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఆతిథ్య ఆస్ట్రేలియా ఓటమితో ఆరంభించింది. పెర్త్ వేదికగా టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో 295 పరుగుల తేడాతో ఆసీస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. 534 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారు జట్టు భారత బౌలర్ల దాటికి 238 పరుగులకు ఆలౌటైంది.
భారత బౌలర్లలో కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ తలా మూడు వికెట్లతో ఆసీస్‌ను దెబ్బతీశారు. వీరిద్దరితో పాటు నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ తలా ఒక వికెట్ పడగొట్టాడు. ఆసీస్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్(89) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం తమ ఓటమికి కారణమని తెలిపాడు.
అదే మా కొంపముంచింది
"ఈ ఓటమి మమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ మ్యాచ్ కోసం మేము బాగానే సన్నద్దమయ్యాము. జట్టులోని ప్రతీ ఒక్కరూ పూర్తి విశ్వాసంతో బరిలోకి దిగారు. కానీ మా ప్రణాళికలు సరిగ్గా అమలు చేయలేకపోయాము. కొన్ని మ్యాచ్‌ల్లో మనం ప్లాన్ చేసింది జరగదు.
అటువంటి మ్యాచ్‌ల్లో ఇదొకటి. ఇక ఈ ఓటమి నుంచి మేము పాఠాలు నేర్చుకుంటాము. తర్వాతి మ్యాచ్‌లో మేము తిరిగిపుంజుకుంటామన్న నమ్మకం ఉంది. ఈ ఓటమి గురించి ఎక్కువగా ఆలోచించకూడదని నిర్ణయించుకున్నాము.
ఒకట్రెండు రోజులు విశ్రాంతి తీసుకుని తిరిగి మళ్లీ మైదానంలో అడుగుపెడతాము. ఈ మ్యాచ్‌లో మాకు ఏదీ కలిసిరాలేదు. తొలి రోజు బౌలర్లు ఇచ్చిన ఆరంభాన్ని మేము అందిపుచ్చుకోలేకపోయాం. మొదటి రోజు బ్యాటింగ్ పరంగా మేము రాణించి ఉంటే పరిస్థితి మరోవిధంగా ఉండేది. రెండో రోజు నుంచి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
ఈ మ్యాచ్‌లో తప్పు ఎక్కడ జరిగిందో చర్చించుకుంటాము. అయితే మా జట్టులో చాలా మంది అనుభవం ఉ న్న ఆటగాళ్లు ఉన్నారు. వారికి బలంగా ఎలా తిరిగి రావాలో బాగా తెలుసు. ఆడిలైడ్ టెస్టు కోసం నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తాము. రెండో టెస్టులో మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేస్తాం" అని పోస్ట్‌మ్యాచ్ ప్రజేంటేషన్‌లో కమిన్స్ ధీమా వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment