శ్రీలంకతో తొలి టెస్టులో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. డర్బన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 233 పరుగుల తేడాతో శనివారం జయభేరి మోగించింది. కాగా రెండు టెస్టులు ఆడే క్రమంలో శ్రీలంక సౌతాఫ్రికాలో పర్యటిస్తోంది.
ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య బుధవారం తొలి టెస్టు మొదలుకాగా.. నాలుగో రోజుల్లోనే ముగిసిపోయింది. కింగ్స్‌మేడ్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా.. తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ తెంబా బవుమా 70 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
స్టబ్స్, బవుమా శతకాలు
అనంతరం సౌతాఫ్రికా పేసర్లు విజృంభించడంతో శ్రీలంక 42 పరుగులకే కుప్పకూలింది. మార్కో జాన్సెన్ ఏడు వికెట్లతో చెలరేగగా.. గెరాల్డ్ కోయెట్జి రెండు, కగిసో రబడ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో 149 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా దుమ్ములేపింది.
ట్రిస్టన్ స్టబ్స్(122), కెప్టెన్ బవుమా(113) శతకాలతో విరుచుకుపడటంతో భారీ ఆధిక్యం సంపాదించింది. ఐదు వికెట్ల నష్టానికి 366 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని 515 పరుగులు స్కోరు బోర్డు మీద ఉంచింది.
‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అతడే
ఈ క్రమంలో 516 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక 282 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా సౌతాఫ్రికా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మార్కో జాన్సెన్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. రబడ, కోయెట్జి, కేశవ్ మహరాజ్ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో పదకొండు వికెట్లు పడగొట్టి ప్రొటిస్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన మార్కో జాన్సెన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఆస్ట్రేలియాకు భారీ షాక్
ఇదిలా ఉంటే.. లంకపై భారీ గెలుపుతో సౌతాఫ్రికా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25(డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో ముందుకు దూసుకువచ్చింది. ఐదో స్థానం నుంచి ఏకంగా రెండోస్థానానికి ఎగబాకి.. ఆస్ట్రేలియాను వెనక్కినెట్టింది. మరోవైపు.. ఆస్ట్రేలియాను పెర్త్ టెస్టులో ఓడించిన టీమిండియా మాత్రం అగ్రస్థానం నిలబెట్టుకుంది.
PC: ICC
ఇక డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్‌లో సౌతాఫ్రికాకు ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. శ్రీలంకతో ఒకటి, పాకిస్తాన్‌తో రెండు టెస్టులు ఆడనుంది. ఈ మూడూ సొంతగడ్డపైనే జరుగనుండటం సౌతాఫ్రికాకు సానుకూలాంశం. వీటన్నింటిలోనూ ప్రొటిస్ జట్టు గెలిచిందంటే.. ఫైనల్ రేసులో తానూ ముందు వరుసలో ఉంటుంది.
టీమిండియా పరిస్థితి ఏంటి?
ఎటువంటి సమీకరణలతో పనిలేకుండా టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే.. ఆసీస్ గడ్డపై ఐదింటిలో కనీసం నాలుగు కచ్చితంగా గెలవాల్సిందే. ఇప్పటికే ఒక విజయం సాధించింది కాబట్టి.. ఇంకో మూడు గెలిస్తే చాలు నేరుగా తుదిపోరుకు అర్హత సాధిస్తుంది. లేదంటే.. మిగతా జట్ల మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే.. రోహిత్ సేన తదుపరి ఆసీస్‌తో అడిలైడ్‌లో పింక్ బాల్ టెస్టులో తలపడనుంది.
చదవండి: టీమిండియాతో రెండో టెస్టు.. అతడిపై వేటు వేయండి: ఆసీస్ మాజీ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment