Shaminda Eranga
-
షమిందా ఎరంగా డిశ్చార్జ్
డబ్లిన్: గుండె సమస్యతో ఆస్పత్రిలో చేరిన శ్రీలంక పేసర్ షమిందా ఎరంగా డిశ్చార్జయ్యాడు. ఇటీవల గుండె జబ్బు కారణంగా డబ్లిన్ ఆస్పతిలో చికిత్స తీసుకున్న ఎరంగా ఆరోగ్యం సాధారణ స్థితికి రావడంతో అతన్ని డిశ్చార్జి చేసినట్లు జట్టు మేనేజ్మెంట్ సోమవారం తెలిపింది. గత శనివారం ఐర్లాండ్ మ్యాచ్ సందర్భంగా ఎరంగా హృదయ స్పందన తీవ్రంగా ఉండటంతో అతన్ని ఆస్పత్రిలో జాయిన్ చేసి అత్యవసర చికిత్స అందించారు. ఇదిలా ఉండగా, ఎరంగాపై ఐసీసీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేయడంతో శ్రీలంక పేసర్ షమిందా ఎరంగా అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో బౌలింగ్ కు దూరమయ్యాడు. ఇంగ్లండ్ మ్యాచ్ సందర్భంగా అతని బౌలింగ్ శైలిపై ఫీల్డ్ అంపైర్లు అనుమానం వ్యక్తం చేసి ఐసీసీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎరంగా బౌలింగ్ ను తాజాగా పరిశీలించిగా అతని యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని తేలింది. దీంతో అతని బౌలింగ్ పై వేటు వేస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. కాగా, దేశవాళీ క్రికెట్లో పాల్గొని బౌలింగ్ ను సరిచేసుకోవచ్చని ఐసీసీ తెలిపింది. శ్రీలంక జట్టుకు బౌలింగ్ చేయాలంటే ముందుగా దేశవాళీ టోర్నీల్లో బౌలింగ్‌ను మెరుగుపరుచుకోవాల్సి ఉందని అతనికి ఐసీసీ మరో అవకాశం ఇచ్చింది. -
పేసర్ ఎరంగా బౌలింగ్‌పై ఫిర్యాదు
చెస్టర్ లీ స్ట్రీట్: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక పేసర్ షమిందా ఎరంగా బౌలింగ్ అనుమానాస్పదంగా ఉండటంతో అంపైర్లు దృష్టి సారించారు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి ఫిర్యాదు చేశారు. ఆ టెస్టు మ్యాచ్‌లో ఎరంగాకు ఎటువంటి వికెట్లు లభించకపోయినా, అతని బౌలింగ్ శైలిపై అనుమానం వ్యక్తం చేసిన ఫీల్డ్ అంపైర్లు అలీమ్ దార్, ఎస్ రవిలు తొలుత మ్యాచ్ రిఫరీ ఆండీ పాయ్కాట్ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం అతని బౌలింగ్ శైలిని పరీక్షించాలంటూ ఐసీసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఎరంగా 14 రోజుల్లో తన బౌలింగ్ యాక్షన్‌కు సంబంధించి పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం అప్పటివరకూ ఎరంగా బౌలింగ్ చేసే అవకాశం ఉంది. -
కుప్పకూలిన బంగ్లా
ఢాకా: శ్రీలంక పేసర్లు షమింద ఎరంగ (4/49), సురంగ లక్మల్ (3/66) పదునైన బంతులకు బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలింది. పిచ్ నుంచి అందివచ్చిన సహకారంతో చెలరేగిన ఈ జోడి సంయుక్తంగా ఏడు వికెట్లను తీయడంతో బంగ్లా జట్టు కోలుకోలేకపోయింది. ఫలితంగా షేరే బంగ్లా జాతీయ స్టేడియంలో సోమవారం ప్రారంభమైన తొలి టెస్టులో 63.5 ఓవర్లలో 232 పరుగులకే తమ తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. కెప్టెన్ ముష్ఫికర్ రహీం (122 బంతుల్లో 61; 9 ఫోర్లు), షకీబ్ అల్ హసన్ (91 బంతుల్లో 55; 9 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించగా... గజీ (56 బంతుల్లో 42; 6 ఫోర్లు; 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న తమ కెప్టెన్ నిర్ణయాన్ని లంక బౌలర్లు వమ్ము చేయలేదు. వీరి ధాటికి ఏడుగురు బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరును కూడా చేయలేకపోయారు. బంగ్లాదేశ్ 59 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో షకీబ్, ముష్ఫికర్ కలిసి 86 పరుగులు జోడించి ఆదుకున్నారు. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్‌లో లంక 19 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 60 పరుగులు చేసింది. కరుణరత్నే (58 బంతుల్లో 28 బ్యాటింగ్; 4 ఫోర్లు), సిల్వ (57 బంతుల్లో 30 బ్యాటింగ్; 5 ఫోర్లు) నిలకడగా ఆడుతున్నారు.