సాక్షి, బోయినపల్లి(చొప్పదండి) : సినీనటుడు సోనూసూద్ మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 4 నెలల పసిబిడ్డ వైద్యచికిత్సలకు అయ్యే ఖర్చు భరిస్తానని ట్విట్టర్ ద్వారా భరోసా ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం జగ్గారావుపల్లి గ్రామానికి చెందిన పందిపెల్లి బాబు, రజిత దంపతుల కుమారుడు అద్విత్ శౌర్య (4నెలలు) గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. బాబు సిరిసిల్లలో ఓ కొరియర్ సంస్థలో బాయ్‌గా పనిచేస్తున్నాడు. బాబు తన కుమారుడిని ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు.
శౌర్యను పరీక్షించిన వైద్యులు.. చికిత్స కోసం రూ.7 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. దీనస్థితిలో ఉన్న బాబు తన కుమారుడి వైద్యానికి సాయం అందించాలని సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. అతడి స్నేహి తులు ట్విట్టర్‌లో ఆ సమాచారాన్ని పోస్టు చేశారు. దీనిపై సోనూసూద్ స్పందించి అద్విత్ శౌర్య ఆపరేషన్‌కు అవసరమయ్యే డబ్బులో వీలైనంత మొత్తం భరించేందకు సిద్ధంగా ఉన్నట్లు ట్టిట్టర్ ద్వారా భరోసా ఇచ్చారని బాలుడి తండ్రి తెలిపాడు. ఇన్నోవా ఆస్పత్రిలో చిన్నారికి వైద్యచికిత్స చేయించాలని పేర్కొన్నట్లు తెలిపాడు. ఆపరేషన్‌ను డాక్టర్ కోన సాంబమూర్తి చేస్తారని సోనూసూద్ తెలిపినట్టు బాబు చెప్పారు.
రూ.లక్షన్నర కోసం తిప్పలు
చిన్నారి అద్విత్ చికిత్సకు అవసరమయ్యే రూ.7 లక్షల్లో అధికభాగం సోనూసూద్ ఇవ్వనుండగా ఇంకా రూ.1.5 లక్షలు కావాలని, అంత డబ్బు తమ వద్ద లేదని.. దాతలు ఆదుకుని తన కుమారునికి ప్రాణం పోయాలని బాబు వేడుకుంటున్నాడు. దాతలు 80964 24621 మొబైల్ నంబరును సంప్రదించాలని ఆయన కోరాడు.
Comments
Please login to add a commentAdd a comment