గత కొన్నేళ్ల కిందటి వరకు గర్భధారణకు పెరిగే వయసు లేదా పెద్దవయసు కాస్త ప్రతికూల ఫలితాలు ఇవ్వవచ్చనీ, సాధారణంగా 28 లేదా 30 ఏళ్లలోపే గర్భధారణ జరగడంతో ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టే ఆస్కారం ఎక్కువనే మాటలు వినిపించేవి. అంతేకాదు... 35 ఏళ్లు పైబడ్డ తర్వాత గర్భధారణ జరిగితే పిల్లల్లో డౌన్స్ సిండ్రోమ్ వంటి కొన్ని అనర్థాలు కనిపించే అవకాశాలూ ఎక్కువేనంటూ ఆందోళన నిండిన సలహాలూ వచ్చేవి. అయితే ఆ మాటల్లో కొద్దిపాటి నిజాలున్నప్పటికీ అంత కంగారు పడాల్సిన అవసరం లేదంటున్నారు వైద్యులు. మెడికల్ పుస్తకాల్లో చెప్పినట్లుగా 35 వయసు దాటాక పుట్టిన పిల్లల్లో జన్యుపరమైన సమస్యలు తలెత్తే అవకాశాలు అరుదుగా ఉంటాయి. వాటి గురించి అంతగా ఆందోళన అవసరం లేదంటూ డాక్టర్లు చెబుతున్న సంగతులివి....
ఇటీవల కాలం అనేక మార్పులను తెస్తోంది. యువతులు సైతం బాగా చదువుకుంటూ, కెరియర్‌లో స్థిరపడిన తర్వాతే పిల్లలను కోరుకుంటున్నారు. దాంతో గర్భధారణ, పిల్లలు కలగడంలో ఆలస్యం సాధారణమవుతోంది. వయసు 35 ఏళ్లు దాటాక గర్భధారణ జరిగిన కేసుల్లో గర్భస్రావాలు జరిగే రేటు ఎక్కువనీ, ఆలస్యంగా గర్భధారణ జరిగినప్పుడు పుట్టే పిల్లలకు పుట్టుకతో వచ్చే జన్యుసమస్యలు వస్తాయనే అభిప్రాయాలు ఎక్కువగా ఉండేవి. అందులో కొద్దిపాటి సత్యం ఉంటే ఉండవచ్చేమోగానీ... అదే అక్షరసత్యమనీ, ఆ మాటలే శిలాక్షరాలని అనుకోడానికి వీల్లేదని వైద్యపరిశోధనలు వెల్లడిస్తున్నాయంటున్నారు డాక్టర్లు. అందుకే ‘అడ్వాన్స్‌డ్ మెటర్నల్ ఏజ్’, ‘జీరియాట్రిక్ ప్రెగ్నెన్సీ’ అనే పదాలను విని, చదివి కంగారు పడవద్దని చెబుతున్నారు.
ఆలస్యపు గర్భధారణలో అనర్థాలు ఎందుకంటే..?
ముప్ఫై ఐదేళ్ల తర్వాత జరిగే గర్భధారణల వల్ల పుట్టబోయే పిల్లల్లో అనేక ఆరోగ్యపరమైన రిస్క్‌లతో పాటు అబార్షన్స్‌కు అవకాశం ఎక్కువ. దానికి కొన్ని కారణాలు ఉంటాయి. అవి...
► అండాశయం వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యకరమైన అండం విడుదల సక్రమంగా జరగడానికి అవకాశం తక్కువ. అండం నాణ్యతా తగ్గుతుంది. అంటే గర్భధారణకు అవకాశాలు పూర్తిగా తగ్గుతాయని కాదు. కానీ ఆలస్యపు గర్భధారణ విషయంలో క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదిస్తూ జాగ్రత్తగా ఉండాలి.
► అబార్షన్స్ రిస్క్ ఎక్కువ. ∙వయసు పెరుగుతున్న కొద్దీ అండంలో జరిగే కణవిభజన అంత సక్రమంగా ఉంకపోవచ్చు. దాంతో క్రోమోజోముల సంఖ్యలో విభజన సక్రమంగా జరకపోవచ్చు.
ఇతర సమస్యల విషయానికి వస్తే...
► మహిళల్లో 30 ఏళ్లు దాటాక అధిక రక్తపోటు, డయాబెటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది గర్భధారణపై ప్రభావం చూపవచ్చు.
► పీసీఓడీ, ఫైబ్రాయిడ్స్ సమస్యలూ, ఫెలోపియన్ ట్యూబులు మూసుకుపోవడం జరగవచ్చు.
► పెద్ద వయసు మహిళలకు పుట్టే పిల్లలు తక్కువ బరువుతో పుట్టే అవకాశముంది.
► 35 ఏళ్లు దాటిన మహిళల్లో సహజ ప్రసవపు అవకాశాలు తగ్గి, సిజేరియన్‌కే అవకాశాలు ఎక్కువ.
ఇటీవల ఆలస్యంగా కెరియర్‌లో స్థిరపడ్డ తర్వాత, అప్పటికీ స్వాభావికంగా గర్భధారణ జరగకపోతే 35 దాటిన తర్వాతే కృత్రిమ గర్భధారణకు వెళ్తున్నారు. అయినప్పటికీ ఆరోగ్యకరమైన గర్భధారణ, పండంటిబిడ్డ పుట్టే కేసులే చాలా ఎక్కువ. ఇందుకు కొన్ని సూచనలు, జాగ్రత్తలు పాటించాలి.
కొంత రిస్క్ ఉన్నా...
ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీ కోసం...
ఒకవేళ మహిళకు 35 ఏళ్లు దాటాక గర్భధారణ జరిగే అవకాశం ఉన్నప్పుడు కొన్ని స్క్రీనింగ్ పరీక్షలు చేయించాలి. అవి...
► సెల్–ఫ్రీ డీఎన్‌ఏ స్కీనింగ్ పరీక్ష ∙మెటర్నల్ బ్లడ్ స్క్రీనింగ్ (అయితే ఇలాంటి స్క్రీనింగ్ పరీక్షల వల్ల పుట్టబోయే చిన్నారిలోని లోపాలన్నీ నూరు శాతం తెలియకపోవచ్చు. కానీ రాబోయే ముప్పులు కొంత సూచనాత్మకంగా తెలిసే అవకాశాలు మాత్రం ఉంటాయి).
► న్యూకల్ ట్రాన్స్‌లుయెన్సీ (ఎన్‌టీ) స్కాన్ టెస్ట్ అనే పరీక్షను గర్భధారణ తర్వాత 14వ వారాల లోపు చేయించాలి.
► గర్భధారణ తర్వాత 20 వారాలప్పుడు అనామలీ స్కాన్ వంటి పరీక్షల్ని చేయించాలి.
భవిష్యత్తుకోసం అండాల సంరక్షణ...
రోజులు గడుస్తున్న కొద్దీ విడుదలయ్యే అండాల నాణ్యత, అందులో లోపాలు వస్తాయి. అందుకే జీవితంలో ఇంకా స్థిరపడని వారు తగిన సమయంలో ఆరోగ్యంగా ఉన్న అండాలను సేకరించి పెట్టుకోవడానికీ ఇప్పడు అవకాశం ఉంది. అన్నీ అనువుగా ఉన్న సమయంలో ఆ అండాలను గర్భధారణకు ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు... దురదృష్టవశాత్తూ చిన్నవయసులోనే మెనోపాజ్ రావడం లేదా ఏవైనా క్యాన్సర్లకు గురై అండాశయాలను తొలగించాల్సిన పరిస్థితులు రావడం వంటివి జరిగితే... ముందుగా సేకరించి పెట్టుకున్న ఆరోగ్యకరమైన అండాల సహాయంతో అటు తర్వాత కూడా ఆరోగ్యకరమైన రీతిలో గర్భధారణకు ఇప్పుడు అవకాశాలున్నాయి.
చివరగా... 35 ఏళ్ల తర్వాత కూడా సురక్షితమైన గర్భధారణ కోసం ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే ముందుగానే సరైనరీతిలో డాక్టర్ సలహాలు పాటించడం, సమతులాహారం తీసుకోవడం, తగినంత బరువు ఉండేలా చూసుకోవడం, ఆరోగ్యకరమైన జీవనవైలి వంటివి పండంటి బిడ్డ పుట్టేందుకు ఎంతగానో ఉపకరిస్తాయి. గర్భధారణకు ముందునుంచే గైనకాలజిస్ట్ çసూచనలు అనుసరిస్తూ, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తే ఆరోగ్యకరమైన గర్భధారణకు వయసు ఒక అంకె మాత్రమే.
గర్భధారణ కంటే
ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
గర్భం ధరించాలనుకున్న కాస్త పెద్ద వయసు మహిళ గర్భధారణ కంటే ముందునుంచే కొన్ని సూచనలు, జాగ్రత్తలు పాటించాలి.
► తమ సాధారణ ఆరోగ్యం, జీవనశైలి, ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే వాటి గురించి, కుటుంబ ఆరోగ్య చరిత్ర గురించి డాక్టర్‌కు విపులంగా వివరించాలి.
► అప్పటికే తీసుకున్న వ్యాక్సిన్‌ల వివరాలు తెలపాలి. తీసుకోవాల్సిన వ్యాక్సిన్లు ఇంకేమైనా ఉన్నాయా అని వాకబు చేయాలి.
జీవిత భాగస్వామి (భర్త) వారి వైపు ఆరోగ్య వివరాలు, కుటుంబ ఆరోగ్య చరిత్ర గురించి కూడా చెప్పాలి. (వయసు ఎక్కువైనా, తక్కువైనా గర్భధారణ కోరుకున్న మహిళలందరూ ఈ సూచనలు పాటించాలి.)
► డిప్రెషన్, హైబీపీ, మధుమేహం (డయాబెటిస్) లాంటి ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్‌కు వివరించాలి.
► ప్రతిరోజూ 400 మైక్రోగ్రాములకు తగ్గకుండా ఫోలిక్ యాసిడ్‌తో పాటు మల్టీవిటమిన్ టాబ్లెట్లు వాడాలి. (పిండం పెరుగుదల సమయంలో ఈ పోషకాలన్నీ ప్రతి కణానికీ కావాలి. ఈ సప్లిమెంట్స్ వాడటం వల్ల పుట్టబోయే చిన్నారికి గ్రహణం మొర్రి వంటి సమస్యలతో పాటు వెన్నుపాము లోపాలు (న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్) నివారితమవుతాయి.
► గర్భధారణ సమయంలో ఉండాల్సిన బరువు కంటే... మరీ ఎక్కువ బరువు ఉండటం, అలాగని బరువు తక్కువగా ఉండటం ఈ రెండూ కొన్ని ముప్పులను ఆహ్వానిస్తాయి. అందుకే ఆరోగ్యకరమైన రీతిలో ఆహారం తీసుకుంటూ, తగిన వ్యాయామం చేస్తూ ఉండాల్సినంత బరువు మాత్రమే ఉండేలా జాగ్రత్త పడాలి.
► గర్భధారణ సమయంలో ఆల్కహాల్, పొగతాగడం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి.
► పనిచేసే చోట లేదా ఇతరత్రా ప్రదేశాలలో హానికారకమైన రసాయనాలకు దూరంగా ఉండాలి. ఇలా హానికర రసాయనాలకు ఎక్స్‌పోజ్ కావడం బిడ్డలో పుట్టుకతో వచ్చే లోపాలకు దారితీయవచ్చు. (ఉదాహరణకు కెమికల్ లేదా పెయింట్స్ వంటి పరిశ్రమల్లో పనిచేసేవారి కోసం ఈ జాగ్రత్తలు).
► ఒత్తిడికి పూర్తిగా దూరంగా ఉండాలి. హాయిగా, ఆహ్లాదంగా ఉండటానికి ప్రయత్నించాలి.
గర్భధారణ సమయమప్పుడు ఈ సూచనలు...
► అన్ని విధాలా ఆరోగ్యకరంగా ఉన్నామని ఫీలవుతున్నప్పటికీ... డాక్టర్లు నిర్దేశించిన ప్రకారం క్రమం తప్పకుండా వారి ఫాలో అప్‌లో ఉండాలి.
► గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన వ్యాక్సిన్‌ల వివరాలు (ఫ్లూ షాట్ వంటివి) తెలుసుకుని, వాటిని తప్పక తీసుకోవాలి.
► ఆ సమయంలో డాక్టర్లు సూచించిన చికిత్స ప్రణాళికను పూర్తిగా అనుసరించాలి. ఇది తల్లి, కడుపులోని బిడ్డ... ఈ ఇరువురూ పూర్తిగా సురక్షితంగా ఉండేలా చేస్తాయి.
► సమతులాహారం తీసుకుంటూ శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అంటే... క్యాల్షియమ్, ఫోలిక్ యాసిడ్, ఐరన్, విటమిన్–డి వంటి అన్ని పోషకాలందేలా చూడాలి. శరీరానికి శ్రమ కలగని రీతిలోనే వ్యాయామం చేస్తూ, రోజంతా చురుగ్గా ఉండాలి.
డాక్టర్ వరలక్ష్మి కె.ఎస్. సీనియర్ గైనకాలజిస్ట్
Comments
Please login to add a commentAdd a comment