Downs Syndrome
-
35 ఏళ్ల తర్వాతా... ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టాలంటే?
గత కొన్నేళ్ల కిందటి వరకు గర్భధారణకు పెరిగే వయసు లేదా పెద్దవయసు కాస్త ప్రతికూల ఫలితాలు ఇవ్వవచ్చనీ, సాధారణంగా 28 లేదా 30 ఏళ్లలోపే గర్భధారణ జరగడంతో ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టే ఆస్కారం ఎక్కువనే మాటలు వినిపించేవి. అంతేకాదు... 35 ఏళ్లు పైబడ్డ తర్వాత గర్భధారణ జరిగితే పిల్లల్లో డౌన్స్ సిండ్రోమ్ వంటి కొన్ని అనర్థాలు కనిపించే అవకాశాలూ ఎక్కువేనంటూ ఆందోళన నిండిన సలహాలూ వచ్చేవి. అయితే ఆ మాటల్లో కొద్దిపాటి నిజాలున్నప్పటికీ అంత కంగారు పడాల్సిన అవసరం లేదంటున్నారు వైద్యులు. మెడికల్ పుస్తకాల్లో చెప్పినట్లుగా 35 వయసు దాటాక పుట్టిన పిల్లల్లో జన్యుపరమైన సమస్యలు తలెత్తే అవకాశాలు అరుదుగా ఉంటాయి. వాటి గురించి అంతగా ఆందోళన అవసరం లేదంటూ డాక్టర్లు చెబుతున్న సంగతులివి.... ఇటీవల కాలం అనేక మార్పులను తెస్తోంది. యువతులు సైతం బాగా చదువుకుంటూ, కెరియర్లో స్థిరపడిన తర్వాతే పిల్లలను కోరుకుంటున్నారు. దాంతో గర్భధారణ, పిల్లలు కలగడంలో ఆలస్యం సాధారణమవుతోంది. వయసు 35 ఏళ్లు దాటాక గర్భధారణ జరిగిన కేసుల్లో గర్భస్రావాలు జరిగే రేటు ఎక్కువనీ, ఆలస్యంగా గర్భధారణ జరిగినప్పుడు పుట్టే పిల్లలకు పుట్టుకతో వచ్చే జన్యుసమస్యలు వస్తాయనే అభిప్రాయాలు ఎక్కువగా ఉండేవి. అందులో కొద్దిపాటి సత్యం ఉంటే ఉండవచ్చేమోగానీ... అదే అక్షరసత్యమనీ, ఆ మాటలే శిలాక్షరాలని అనుకోడానికి వీల్లేదని వైద్యపరిశోధనలు వెల్లడిస్తున్నాయంటున్నారు డాక్టర్లు. అందుకే ‘అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్’, ‘జీరియాట్రిక్ ప్రెగ్నెన్సీ’ అనే పదాలను విని, చదివి కంగారు పడవద్దని చెబుతున్నారు. ఆలస్యపు గర్భధారణలో అనర్థాలు ఎందుకంటే..? ముప్ఫై ఐదేళ్ల తర్వాత జరిగే గర్భధారణల వల్ల పుట్టబోయే పిల్లల్లో అనేక ఆరోగ్యపరమైన రిస్క్‌లతో పాటు అబార్షన్స్‌కు అవకాశం ఎక్కువ. దానికి కొన్ని కారణాలు ఉంటాయి. అవి... ► అండాశయం వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యకరమైన అండం విడుదల సక్రమంగా జరగడానికి అవకాశం తక్కువ. అండం నాణ్యతా తగ్గుతుంది. అంటే గర్భధారణకు అవకాశాలు పూర్తిగా తగ్గుతాయని కాదు. కానీ ఆలస్యపు గర్భధారణ విషయంలో క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదిస్తూ జాగ్రత్తగా ఉండాలి. ► అబార్షన్స్ రిస్క్ ఎక్కువ. ∙వయసు పెరుగుతున్న కొద్దీ అండంలో జరిగే కణవిభజన అంత సక్రమంగా ఉంకపోవచ్చు. దాంతో క్రోమోజోముల సంఖ్యలో విభజన సక్రమంగా జరకపోవచ్చు. ఇతర సమస్యల విషయానికి వస్తే... ► మహిళల్లో 30 ఏళ్లు దాటాక అధిక రక్తపోటు, డయాబెటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది గర్భధారణపై ప్రభావం చూపవచ్చు. ► పీసీఓడీ, ఫైబ్రాయిడ్స్ సమస్యలూ, ఫెలోపియన్ ట్యూబులు మూసుకుపోవడం జరగవచ్చు. ► పెద్ద వయసు మహిళలకు పుట్టే పిల్లలు తక్కువ బరువుతో పుట్టే అవకాశముంది. ► 35 ఏళ్లు దాటిన మహిళల్లో సహజ ప్రసవపు అవకాశాలు తగ్గి, సిజేరియన్‌కే అవకాశాలు ఎక్కువ. ఇటీవల ఆలస్యంగా కెరియర్లో స్థిరపడ్డ తర్వాత, అప్పటికీ స్వాభావికంగా గర్భధారణ జరగకపోతే 35 దాటిన తర్వాతే కృత్రిమ గర్భధారణకు వెళ్తున్నారు. అయినప్పటికీ ఆరోగ్యకరమైన గర్భధారణ, పండంటిబిడ్డ పుట్టే కేసులే చాలా ఎక్కువ. ఇందుకు కొన్ని సూచనలు, జాగ్రత్తలు పాటించాలి. కొంత రిస్క్ ఉన్నా... ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీ కోసం... ఒకవేళ మహిళకు 35 ఏళ్లు దాటాక గర్భధారణ జరిగే అవకాశం ఉన్నప్పుడు కొన్ని స్క్రీనింగ్ పరీక్షలు చేయించాలి. అవి... ► సెల్–ఫ్రీ డీఎన్ఏ స్కీనింగ్ పరీక్ష ∙మెటర్నల్ బ్లడ్ స్క్రీనింగ్ (అయితే ఇలాంటి స్క్రీనింగ్ పరీక్షల వల్ల పుట్టబోయే చిన్నారిలోని లోపాలన్నీ నూరు శాతం తెలియకపోవచ్చు. కానీ రాబోయే ముప్పులు కొంత సూచనాత్మకంగా తెలిసే అవకాశాలు మాత్రం ఉంటాయి). ► న్యూకల్ ట్రాన్స్‌లుయెన్సీ (ఎన్టీ) స్కాన్ టెస్ట్ అనే పరీక్షను గర్భధారణ తర్వాత 14వ వారాల లోపు చేయించాలి. ► గర్భధారణ తర్వాత 20 వారాలప్పుడు అనామలీ స్కాన్ వంటి పరీక్షల్ని చేయించాలి. భవిష్యత్తుకోసం అండాల సంరక్షణ... రోజులు గడుస్తున్న కొద్దీ విడుదలయ్యే అండాల నాణ్యత, అందులో లోపాలు వస్తాయి. అందుకే జీవితంలో ఇంకా స్థిరపడని వారు తగిన సమయంలో ఆరోగ్యంగా ఉన్న అండాలను సేకరించి పెట్టుకోవడానికీ ఇప్పడు అవకాశం ఉంది. అన్నీ అనువుగా ఉన్న సమయంలో ఆ అండాలను గర్భధారణకు ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు... దురదృష్టవశాత్తూ చిన్నవయసులోనే మెనోపాజ్ రావడం లేదా ఏవైనా క్యాన్సర్లకు గురై అండాశయాలను తొలగించాల్సిన పరిస్థితులు రావడం వంటివి జరిగితే... ముందుగా సేకరించి పెట్టుకున్న ఆరోగ్యకరమైన అండాల సహాయంతో అటు తర్వాత కూడా ఆరోగ్యకరమైన రీతిలో గర్భధారణకు ఇప్పుడు అవకాశాలున్నాయి. చివరగా... 35 ఏళ్ల తర్వాత కూడా సురక్షితమైన గర్భధారణ కోసం ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే ముందుగానే సరైనరీతిలో డాక్టర్ సలహాలు పాటించడం, సమతులాహారం తీసుకోవడం, తగినంత బరువు ఉండేలా చూసుకోవడం, ఆరోగ్యకరమైన జీవనవైలి వంటివి పండంటి బిడ్డ పుట్టేందుకు ఎంతగానో ఉపకరిస్తాయి. గర్భధారణకు ముందునుంచే గైనకాలజిస్ట్ çసూచనలు అనుసరిస్తూ, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తే ఆరోగ్యకరమైన గర్భధారణకు వయసు ఒక అంకె మాత్రమే. గర్భధారణ కంటే ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గర్భం ధరించాలనుకున్న కాస్త పెద్ద వయసు మహిళ గర్భధారణ కంటే ముందునుంచే కొన్ని సూచనలు, జాగ్రత్తలు పాటించాలి. ► తమ సాధారణ ఆరోగ్యం, జీవనశైలి, ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే వాటి గురించి, కుటుంబ ఆరోగ్య చరిత్ర గురించి డాక్టర్‌కు విపులంగా వివరించాలి. ► అప్పటికే తీసుకున్న వ్యాక్సిన్ల వివరాలు తెలపాలి. తీసుకోవాల్సిన వ్యాక్సిన్లు ఇంకేమైనా ఉన్నాయా అని వాకబు చేయాలి. జీవిత భాగస్వామి (భర్త) వారి వైపు ఆరోగ్య వివరాలు, కుటుంబ ఆరోగ్య చరిత్ర గురించి కూడా చెప్పాలి. (వయసు ఎక్కువైనా, తక్కువైనా గర్భధారణ కోరుకున్న మహిళలందరూ ఈ సూచనలు పాటించాలి.) ► డిప్రెషన్, హైబీపీ, మధుమేహం (డయాబెటిస్) లాంటి ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్‌కు వివరించాలి. ► ప్రతిరోజూ 400 మైక్రోగ్రాములకు తగ్గకుండా ఫోలిక్ యాసిడ్‌తో పాటు మల్టీవిటమిన్ టాబ్లెట్లు వాడాలి. (పిండం పెరుగుదల సమయంలో ఈ పోషకాలన్నీ ప్రతి కణానికీ కావాలి. ఈ సప్లిమెంట్స్ వాడటం వల్ల పుట్టబోయే చిన్నారికి గ్రహణం మొర్రి వంటి సమస్యలతో పాటు వెన్నుపాము లోపాలు (న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్) నివారితమవుతాయి. ► గర్భధారణ సమయంలో ఉండాల్సిన బరువు కంటే... మరీ ఎక్కువ బరువు ఉండటం, అలాగని బరువు తక్కువగా ఉండటం ఈ రెండూ కొన్ని ముప్పులను ఆహ్వానిస్తాయి. అందుకే ఆరోగ్యకరమైన రీతిలో ఆహారం తీసుకుంటూ, తగిన వ్యాయామం చేస్తూ ఉండాల్సినంత బరువు మాత్రమే ఉండేలా జాగ్రత్త పడాలి. ► గర్భధారణ సమయంలో ఆల్కహాల్, పొగతాగడం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. ► పనిచేసే చోట లేదా ఇతరత్రా ప్రదేశాలలో హానికారకమైన రసాయనాలకు దూరంగా ఉండాలి. ఇలా హానికర రసాయనాలకు ఎక్స్పోజ్ కావడం బిడ్డలో పుట్టుకతో వచ్చే లోపాలకు దారితీయవచ్చు. (ఉదాహరణకు కెమికల్ లేదా పెయింట్స్ వంటి పరిశ్రమల్లో పనిచేసేవారి కోసం ఈ జాగ్రత్తలు). ► ఒత్తిడికి పూర్తిగా దూరంగా ఉండాలి. హాయిగా, ఆహ్లాదంగా ఉండటానికి ప్రయత్నించాలి. గర్భధారణ సమయమప్పుడు ఈ సూచనలు... ► అన్ని విధాలా ఆరోగ్యకరంగా ఉన్నామని ఫీలవుతున్నప్పటికీ... డాక్టర్లు నిర్దేశించిన ప్రకారం క్రమం తప్పకుండా వారి ఫాలో అప్‌లో ఉండాలి. ► గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన వ్యాక్సిన్ల వివరాలు (ఫ్లూ షాట్ వంటివి) తెలుసుకుని, వాటిని తప్పక తీసుకోవాలి. ► ఆ సమయంలో డాక్టర్లు సూచించిన చికిత్స ప్రణాళికను పూర్తిగా అనుసరించాలి. ఇది తల్లి, కడుపులోని బిడ్డ... ఈ ఇరువురూ పూర్తిగా సురక్షితంగా ఉండేలా చేస్తాయి. ► సమతులాహారం తీసుకుంటూ శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అంటే... క్యాల్షియమ్, ఫోలిక్ యాసిడ్, ఐరన్, విటమిన్–డి వంటి అన్ని పోషకాలందేలా చూడాలి. శరీరానికి శ్రమ కలగని రీతిలోనే వ్యాయామం చేస్తూ, రోజంతా చురుగ్గా ఉండాలి. డాక్టర్ వరలక్ష్మి కె.ఎస్. సీనియర్ గైనకాలజిస్ట్ -
సర్ప్రైజ్: ప్రతి ఒక్కరిని ఏడిపిస్తున్న వీడియో
న్యూఢిల్లీ: పెళ్లిలో వధువుకు వరుడు ఇచ్చిన సర్ప్రైజ్ ప్రతి ఒక్కరిని హృదయాలను హత్తుకుంటుంటోంది. డౌన్స్ సిండ్రోమ్(జన్యు సంబంధిత వ్యాధితో బాధపుడుతున్న) చిన్నారులను పెళ్లిలో రింగ్ బేరర్లుగా ఉంచిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో పెళ్లి కూతురితో పాటు నెటిజన్లను సైతం కంటితడి పెట్టిస్తోంది. జానా హిషమ్ అనే ట్విటర్ యూజర్ సోమవారం ఈ వీడియోను షేర్ చేసింది. దీనికి ఆమె ‘పెళ్లి కూతురిని ఆశ్చర్యపరచడానికి పెళ్లి కుమారుడు డౌన్స్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న విద్యార్దులను రింగ్ బేరర్లుగా ఉంచాడు. ఇది చూడగానే ఒక్కసారిగా వధువు నా కళ్లలో నీళ్లు తిరగాయి’ అంటూ ఆమె షేర్ చేసింది. ఈ వీడియోకు ఇప్పటి వరకు లక్షల్లో వ్యూస్ వందల్లో కామెంట్స్ వచ్చాయి. జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె విద్యార్థులను రింగ్ బేరర్లు నియమించిన ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. (చదవండి: మిమ్మల్ని చూసి ఎంతో గర్వపడుతున్నాం) పెళ్లి కూతురికి ఇలా సర్ప్రైజ్ ఇచ్చిన పెళ్లి కొడుకుపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘ఈ జంట ఎప్పటికి ఆశ్వీర్వదించబడాలి’, ‘కన్నీళ్లు ఆగడం లేదు’, ‘ఇంతకంటే మంచి వీడియోను ఈ మధ్య కాలంలో చూడలేదు’ అంటూ నెటిజన్లు భావోద్యేగానికి లోనవుతున్నారు. రెండు నిమిషాలకు పైగా నిడివి గల ఈ వీడియోలో నూతన వధువరుల వైపు కొంతమంది చిన్నారులు తోడిపెళ్లి కూతురు, పెళ్లి కొడుకు దుస్తులు ధరించి ఉన్నారు. వారు జంటలుగా వారి వైపు నుడుచుకుంటు రింగ్‌ను తీసుకురావడం చూసి పెళ్లి కూతురు ఒక్కసారిగా భావోద్వేగానికి గురైంది. ఆమె కన్నీరు పెట్టుకుంటూ పెళ్లి కొడుకును హత్తుకుంది. ఎందుకంటే ఆ పిల్లలు అంతా డౌన్ సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతున్న వారే. ఈ చిన్నారులంతా సదరు వధువు విద్యార్థులు. పెళ్లి కూతురిని సర్ప్రైజ్ చేసేందుకు పెళ్లి కొడుకు వారిని రింగ్బేరర్లుగా నియమించాడు. అయితే ఇది ఏప్రిల్ నాటి వీడియో అని తెలుస్తోంది. ఈ పెళ్లి ఎక్కడ జరిగింది, వధూవరులు ఎవరు అనే వివరాలు లేనప్పటికీ.. ఈ వీడియోలోని భావోద్వేగానికి వీక్షకులు కనెక్ట్ అవుతున్నారు. (చదవండి: సింగపూర్ సూపర్ పెంటహౌజ్ అమ్మకం) This groom surprised his bride by having her students with Down’s syndrome be the ring bearers and I’m a puddle of tears on the floor 😄 pic.twitter.com/PKv1SduZv4 — Jana Hisham (@JanaHisham) October 17, 2020 -
వయసుకు తగినట్లుగా ఎత్తు పెరగకపోతే...
తమ వయసుకు తగినట్లుగా ఎత్తు పెరగకపోవడం అన్నది చాలామందికి మనస్తాపం కలిగించే అంశమే. అది వాళ్లలో అత్మన్యూనతను పెంచుతుంది కూడా. మన జనాభాలో 3-5 శాతం మంది ఈ ఎత్తు పెరగకపోవడం అనే సమస్యతో బాధపడుతుంటారు. ముఖ్యంగా ఎదిగే వయసులోని పిల్లలు, యుక్తవయస్కులను ఈ సమస్య ఎక్కువగా బాధపెడుతుంటుంది. నిజానికి ఎత్తు తక్కువగా ఉండటం ఒక వ్యాధి కాదు. సాధారణంగా తల్లిదండ్రులు తక్కువ ఎత్తు ఉంటే, జన్యుపరమైన కారణాలతో వాళ్ల పిల్లలూ తక్కువ ఎత్తే పెరుగుతారు. అయితే ఒక్కోసారి ఏదైనా వ్యాధి కారణంగా కూడా ఎత్తు పెరగకపోవడం జరగవచ్చు. అలాంటప్పుడు దానికి చికిత్స చేయవచ్చు. తద్వారా ఎత్తు పెరిగేలా చూడవచ్చు. ఎత్తు పెరగకపోవడానికి కారణాలు... 1. ఎకాండ్రోప్లేసియా (జన్యుపరంగా వచ్చే సమస్యతో ఎత్తుపెరగకపోవడం) 2. దీర్ఘకాలిక వ్యాధులు, పుట్టుకతో వచ్చే గుండె సమస్యలు, మూత్రసంబంధ వ్యాధులు, సికిల్ సెల్ అనీమియా, థలసీమియా, యుక్తవయసులో వచ్చే కీళ్లనొప్పులు (జువెనైల్ డయాబెటిక్ ఆర్థరైటిస్), మధుమేహం (డయాబెటిస్) వంటి వ్యాధుల వల్ల 3. పెరుగుదల నెమ్మదిగా ఉండటం (కాన్స్టిట్యూషనల్ గ్రోత్ డిలే) 4. కుషింగ్స్ డిసీజ్ 5. యుక్తవయసు ఆలస్యంగా రావడం 6. డౌన్స్ సిండ్రోమ్ 7. హైపోథైరాయిడిజం పుట్టుకతోనే ఉండటం 8. పేగులో వాపు 9. పేగులో పుండు 10. పౌష్టికాహారలోపం 11. నూనాన్ సిండ్రోమ్ 12. పాన్హైపోపిట్యుటరిజమ్ 13. పెరుగుదల హర్మోన్ తగ్గుదల 14. యుక్తవయసు ముందుగానే రావడం 15. రికెట్స్ 16. రసెల్ సిల్వర్ సిండ్రోమ్ 17. టర్నర్ సిండ్రోమ్ 18. విలియమ్స్ సిండ్రోమ్. ఎత్తు అన్నది తల్లిదండ్రుల నుంచి వంశపారంపర్యంగా పిల్లలకు సంక్రమించే అంశం. కాబట్టి దీని గురించి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఏదైనా వ్యాధి కారణంగా ఎత్తుపెరగకపోవడం జరిగితే, దాని కోసం చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పిల్లలు తమ వయసువారితో పోల్చినప్పుడు మరీ తక్కువ ఎత్తుగా ఉన్నా లేదా పెరుగుదల ఆగిపోయినట్లు అనిపించినా వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. అప్పుడు వైద్యులు తగిన పరీక్షలు (రక్తపరీక్ష, ఎలక్ట్రొలైట్ లెవెల్స్, ఎక్స్‌రే వంటివి) చేస్తారు. జన్యుపరమైన లోపాలు (ఉదాహరణకు టర్నర్స్ సిండ్రోమ్) వంటివి ఏవైనా ఉన్నాయేమోనని పరీక్షిస్తారు. తల్లిదండ్రుల ఎత్తును, కుటుంబ వైద్య చరిత్ర వంటివి పరిశీలిస్తారు. పుట్టిన తేదీ, ఆహారనియమావళి, యుక్తవయసు ఎప్పుడు మొదలైంది, ఇతరత్రా వ్యాధులు ఏమైనా ఉన్నాయా అనే అంశాలను తెలుసుకుంటారు. తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు పిల్లల బరువును, ఎత్తును రికార్డు చేస్తూ ఉంటే వారి పెరుగుదల క్రమంలో ఏవైనా మార్పులు ఉన్నాయేమో తెలుసుకోవడం సాధ్యమవుతుంది. ఎత్తు అనేది వంశపారంపర్యంగా వచ్చేదే అయినా, ఏదైనా వ్యాధి లేదా వైద్యసమస్య వల్ల ఎత్తు పెరగకపోవడం జరుగుతుంటే... హోమియో విధానంలోని బెరైట్ గ్రూపు మందులు, కాల్కేరియా ఫాస్, కాల్కేరియా కార్బ్, బెరైటా కార్బ్, మెడొరినం, తూజా వంటి మందుల ద్వారా ప్రయోజనం ఉంటుంది. డాక్టర్ ఎం. శ్రీకాంత్, సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ -
ఆరోగ్యకరమైన బిడ్డ కోసం తొందరపడండి
ఏ వయసుకు ఆ ముచ్చట అన్నారు పెద్దలు. మహిళల్లో గర్భధారణ ఆలస్యమవుతున్నకొద్దీ... పుట్టబోయే బిడ్డలో కొన్ని మానసిక, శారీరక సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతుంటాయి. అందుకే బిడ్డను ప్లాన్ చేసుకోవాలనుకునేవారు... మరీ ముఖ్యంగా లేటు వయసులో గర్భధారణ కోరుకునేవారు ఆ సమయంలో పుట్టబోయే బిడ్డకు వచ్చే అవకాశం ఉన్న ‘డౌన్స్ సిండ్రోమ్’ గురించి అవగాహన తప్పక పెంచుకోవాలి. అందుకు ఉపయోగపడేదే ఈ కథనం. ఒక్కోజీవికి నిర్దిష్టమైన క్రోమోజోముల సంఖ్య ఉంటుంది. వాటినిబట్టే ఆ జీవి ఏమిటన్నది నిర్ణయమవుతుంది. మనిషిలోని క్రోమోజోముల సంఖ్య 46. అందుకే ప్రత్యుత్పత్తి జరిగేటప్పుడు పురుషుడి వీర్యకణం... అండంతో కలిసినప్పుడు ఈ 23 జతలు కలుసుకుని 46 క్రోమోజోములతో కొత్తజీవి ఆవిర్భవించేలా చేస్తుంది ప్రకృతి. ఇదే ప్రక్రియ అన్ని జీవుల్లోనూ జరుగుతుంది. మరి ఏదైనా కారణాల వల్ల ఈ క్రోమోజోముల సంఖ్యలో మార్పు వస్తే...? అది స్వాభావికం కాదు. అలాంటి పరిస్థితుల్లో సాధారణ మనిషిలో కొన్ని అసాధారణమైన రుగ్మతలు కనిపిస్తాయి. డౌన్స్ సిండ్రోమ్‌లో జరిగేదేమిటి...? ముందుగా చెప్పుకున్నట్లు మనిషిలో 46 (అంటే ఇరవైమూడు జతల) క్రోమోజోములు ఉంటాయి కదా. ఏదైనా కారణాల వల్ల ఈ సంఖ్య కాస్తా 47 కు చేరిందనుకోండి. అప్పుడు సంభవించేదే ‘డౌన్స్ సిండ్రోమ్’ అనే అసాధారణస్థితి. అంటే ఇందులో 21వ క్రోమోజోము కాపీ మరొకటి అదనంగా ఏర్పడుతుంది. ఫలితంగా 46 క్రోమోజోములు కాస్తా 47గా మారిపోతాయి. ఇలా జరిగితే ఈ కండిషన్లో పిల్లలకు కొన్ని మానసికమైన లోపాలు కనిపిస్తుంటాయి. ఇంగ్లాండుకు చెందిన జె.ఎల్. డౌన్ అనే ఫిజీషియన్ ఈ పరిస్థితికి కారణాన్ని కనుగొనడంతో ఆయన పేరిట దీనికి ‘డౌన్స్’ సిండ్రోమ్ అని పెట్టారు. డౌన్స్ సిండ్రోమ్ పిల్లల్లో కనిపించే లోపాలు సాధారణంగా డౌన్స్ సిండ్రోమ్‌తో పుట్టిన పిల్లల్లో కొన్ని శారీరక, మానసిక లోపాలు కనిపిస్తాయి. వాటిలో ముఖ్యమైనవి... త కండరాల పటుత్వం తగ్గి ఉండటం మెడ వెనక భాగంలో చర్మం దళసరిగా ఉండటం ముక్కు చప్పిడిగా ఉండటం (ఫాటెన్డ్ నోస్) పుర్రెలోని ఎముకలమధ్య ఖాళీలు ఎక్కువగా ఉండటం సాధారణంగా మన అరచేతిలో పైన రెండు గీతలు ఉంటాయి. కానీ డౌన్స్ సిండ్రోమ్ ఉన్నవారి అరచేతిలో ఒకటే గీత ఉంటుంది (సిమియన్ ట్రీస్) చెవులు చిన్నవిగా ఉండటం నోరు చిన్నదిగా ఉండటం కళ్లు పైవైపునకు వాలినట్లుగా ఉండటం చేయి వెడల్పుగా, చేతివేళ్లు పొట్టిగా ఉండటం కంట్లోని నల్లగుడ్డులో తెల్లమచ్చలు ఉండటం. వీటిని బ్రష్ఫీల్డ్ స్పాట్స్ అంటారు మిగతావారితో పోలిస్తే తల కాస్త తక్కువ సైజులో ఉండటం. చూడగానే దాని ఆకృతిలో ఏదో మార్పు ఉన్నట్లు కనిపించడం పెద్దగా ఎత్తు పెరగకపోవడం మానసికవికాసం ఆలస్యంగా జరుగుతుండటం. మరికొన్ని అదనపు సమస్యలు ... గుండెకు సంబంధించిన లోపాలు కనిపించవచ్చు. అంటే గుండె గదుల్లో పై గదుల మధ్య గోడలో లోపం (ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్) గాని, కింది గదుల మధ్య గోడలో లోపం (వెంట్రిక్యులార్ సెప్టల్ డిఫెక్ట్) గాని ఉండవచ్చు మతిమరపు కాటరాక్ట్ వంటి కంటి సమస్యలు జీర్ణకోశ వ్యవస్థలో సమస్యలు (డియొడినల్ అస్ట్రీషియా) తుంటి ఎముక తన స్థానం నుంచి తొలగిపోవడం (హిప్ డిస్లొకేషన్) మలబద్దకం హైపోథైరాయిడిజమ్ వంటి శారీరక సమస్యలు రావచ్చు. నిర్ధారణ: డౌన్స్ సిండ్రోమ్ ఉందని నిర్ధారణ చేయడానికి క్రోమోజోముల పరీక్షను నిర్వహించాలి. దీనికోసం చిన్నారి నుంచి సేకరించిన రక్తంతో కారియోటైపిక్ క్రోమోజోమల్ స్టడీ అనే రక్తపరీక్ష చేయాలి. ఈ ప్రధాన పరీక్షతోపాటు గుండెలో ఏవైనా లోపాలున్నాయేమో తెలుసుకోవడానికి ఈసీజీ, ఛాతీ, జీర్ణకోశవ్యవస్థ తాలూకు పరిస్థితిని తెలుసుకోడానికి ఎక్స్-రే పరీక్షలు చేయాలి. క్రమం తప్పకుండా చేయించాలి ఈ పరీక్షలు డౌన్స్ సిండ్రోమ్ ఉన్న పిల్లలకు క్రమం తప్పకుండా కొన్ని వైద్యపరీక్షలు చేయిస్తూ ఉండాలి. అవి... చిన్నతనంలో ప్రతి ఏడాదీ కంటిపరీక్షలు చేయించాలి ప్రతి 6 నుంచి 12 నెలలకు ఒకసారి చెవిపరీక్షలు, దంతపరీక్షలు చేయించాలి. (ఇది ఆరు నెలలకోమారా లేదా సంవత్సరానికి ఒకసారా అన్నది డాక్టర్లు నిర్ణయిస్తారు) ప్రతి 3 నుంచి 5 ఏళ్లకు ఒకసారి ఛాతీ, మెడ ఎక్స్-రే పరీక్ష అమ్మాయిల్లో యుక్తవయసు రాగానే లేదా 21 ఏళ్ల వయసులో పాప్‌స్మియర్ పరీక్ష చేయించాలి ప్రతి యేటా థైరాయిడ్ పరీక్ష చేయిస్తూ ఉండాలి. బిడ్డ పుట్టకముందే నిర్ధారణ ఎలా...? వివాహం ఆలస్యంగా చేసుకోవడమో లేదా ఏదైనా కారణాల వల్ల ఆలస్యంగా పిల్లలను ప్లాన్ చేసుకోవడమో చేస్తే... పుట్టబోయే చిన్నారిలో డౌన్స్ సిండ్రోమ్ కండిషన్ వచ్చేందుకు అవకాశం ఉందా అన్న విషయాన్ని కొన్ని పరీక్షల ద్వారా ముందే తెలుసుకోవచ్చు. ఇందుకు రెండు రకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. (అయితే ఈ పరీక్షలు చాలావరకు మంచి సమాచారాన్నే అందిస్తాయి. కానీ పూర్తిగా కచ్చితమైన సమాచారం బిడ్డ పుట్టిన తర్వాతే లభ్యమవుతుందని గుర్తించాలి). స్క్రీనింగ్ పరీక్షలు: ఈ పరీక్షల్లో బాగా ప్రాచుర్యం ఉన్నది ‘ట్రిపుల్ స్క్రీన్’ అని పిలిచే పద్ధతి. ఇది మూడు రకాల పరీక్షల తాలూకు సంయుక్తరూపం. ఈ పరీక్షల్లో రక్తంలోని కొన్ని అంశాల విలువలను మూడుసార్లు పరీక్షించి... సరిపోల్చి డౌన్స్ సిండ్రోమ్‌ను నిర్ధారణ చేస్తారు. ఈ పరీక్ష గర్భధారణ జరిగిన 15వ వారం నుంచి 20వ వారం మధ్యలో నిర్వహిస్తారు. అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు మిగతా పరీక్షలతో పాటు నిర్వహిస్తూ కడుపులోని బిడ్డ ఎదుగుదలలో మార్పులను పరిశీలిస్తూ చేస్తారు. వీటివల్ల బిడ్డ భౌతికమైన (ఫిజికల్) అంశాలు ఎలా ఉన్నాయో తెలుస్తాయి. వాటిని డౌన్స్ సిండ్రోమ్ లక్షణాలతో సరిపోలుస్తూ అధ్యయనం చేస్తారు. డయాగ్నస్టిక్ పరీక్షలు (నిర్ధారణ కోసం): గర్భధారణ జరిగాక 12 నుంచి 20 వారాల మధ్య సమయంలో గర్భసంచి నుంచి ఉమ్మనీరు తీసి అమ్నియోసెంటైసిస్ అనే పరీక్ష చేస్తారు. గర్భధారణ సమయంలోని 8వ వారం నుంచి 12వ వారం వరకు కోరియానిక్ విల్లస్ శాంప్లింగ్ అనే పరీక్ష చేస్తారు. గర్భధారణ సమయంలోని 20వ వారంలో పర్క్యుటేనియస్ అంబిలికల్ బ్లడ్ శాంప్లింగ్ పరీక్షను నిర్వహిస్తారు. సంయుక్త పరీక్షలు: డౌన్స్‌సిండ్రోమ్ నిర్ధారణ కోసం పైన పేర్కొన్న రక్తపరీక్షలు, అల్ట్రా సౌండ్ పరీక్షలను సంయుక్తంగా చేస్తుంటారు. రక్తపరీక్షల్లో రక్తనమూనాలను సేకరించి వాటిలో కొన్ని నిర్దిష్టమైన ప్రొటీన్లను, హార్మోన్లను పరిశీలిస్తారు. ఇలా కొన్ని నిర్దిష్టమైన ప్రోటీన్లు, హార్మోన్ల మోతాదులు సాధారణ విలువల కంటే ఎక్కువగా ఉంటే అది డౌన్స్ సిండ్రోమ్స్‌కు సూచిక అన్నమాట. అలాగే అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లోనూ ఒక ప్రత్యేకమైన స్కానింగ్ పరీక్షను చేస్తారు. దీన్ని ‘న్యూకల్ ట్రాన్స్‌లుయెన్సీ’ పరీక్షగా చెబుతారు. ఇందులో బిడ్డ మెడ వెనక చర్మం వెనక ఉన్న ఉమ్మనీటిని పరీక్షిస్తారు. ఎందుకంటే... సాధారణ బిడ్డలతో పోలిస్తే డౌన్స్ సిండ్రోమ్ ఉన్న బిడ్డలకు ఈ నీటి మందం ఎక్కువగా ఉంటుందన్నమాట. దీన్నిబట్టి పుట్టబోయే బిడ్డకు డౌన్స్ సిండ్రోమ్ వచ్చే అవకాశాలను బేరీజు వేస్తారు. ఇక కోరియానిక్ విల్లస్ శాంప్లింగ్ (సీవీఎస్) పరీక్ష లేదా ఉమ్మనీటిని తీసి చేసే పరీక్షల ద్వారా గర్భస్థ శిశువు దశలోనే పుట్టబోయే బిడ్డకు ఏవైనా ఆరోగ్యసమస్యలున్నాయా అన్న విషయం తెలుస్తుంది. కోరియానిక్ విల్లస్ శాంప్లింగ్ (సీవీఎస్): గర్భధారణ జరిగాక 10వ వారంలో బిడ్డ తాలూకు బొడ్డు తాడు నుంచి చిన్న ముక్కను సేకరించి చేసే అల్ట్రా సౌండ్ పరీక్ష ఇది. ఆమ్నియోసెంటైసిస్: సాధారణంగా గర్భధారణ తర్వాత 15వ వారం నుంచి 22 వ వారం వరకు ఈ పరీక్ష చేయవచ్చు. ఇందులో తల్లి గర్భంలోంచి ఇంజక్షన్ నీడిల్ ద్వారా కొంత ఉమ్మనీటిని సేకరిస్తారు. ఇలా సేకరించడానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ సహాయం తీసుకుంటారు. స్కానింగ్‌లో తల్లి గర్భాన్ని పరిశీలిస్తే సిరంజ్ పంపడం ద్వారా సరిగ్గా ఉమ్మనీటినే స్వీకరిస్తున్నామా అన్న విషయాన్ని పరిశీలిస్తూ ఈ నీటిని సేకరిస్తారన్నమాట. చికిత్స: ఇది క్రోమోజోముల తేడా వల్ల వచ్చిన కండిషన్ కావడంతో దీనికి చికిత్స లేదు. అయితే ఇలా పుట్టిన పిల్లలను మామూలు పిల్లల్లా పెంచడానికి... వ్యాయామాల సూచనకు ఫిజియోథెరపిస్ట్; భాషను చక్కదిద్దడం, చక్కగా వచ్చేలా చేయడానికి సహాయపడే లాంగ్వేజ్/స్పీచ్ థెరపిస్ట్, పెద్దయ్యాక వారు స్వతంత్రంగా బతికేలా తోడ్పడేందుకు ఆక్యుపేషనల్ థెరపిస్ట్, మంచి ఆహారాన్ని అందించే క్రమంలో డైటీషియన్, వినికిడి సమస్యల పరిష్కారానికి ఆడియాలజిస్ట్, కంటి సమస్యలను చక్కదిద్దడానికి ఆఫ్తాల్మాలజిస్ట్.. ఇంకా పిల్లల వైద్యనిపుణుడు, గుండె వైద్యనిపుణుల సహాయం అవసరం. నివారణ: కొద్దిపాటి జాగ్రత్తలతో దీన్ని నివారించుకోవచ్చు. మహిళలో గర్భధారణ 35 ఏళ్ల కంటే ముందుగానే జరిగేలా ప్లాన్ చేసుకోవడం, కుటుంబంలో ఎవరికైనా డౌన్స్ సిండ్రోమ్ ఉంటే ఆ విషయాన్ని గర్భధారణకు ముందుగానే డాక్టర్లకు చెప్పి తగిన కౌన్సెలింగ్ తీసుకోవడం అవసరం. - నిర్వహణ: యాసీన్ -
సరైన విధంగా ఎత్తు పెరగకపోతే..?
మన సమాజంలో ఎత్తు పెరగడం లేదనే ఆందోళన చాలామందిలో ఉంటుంది. ముఖ్యంగా ఎదిగే వయసులోని టీనేజీ పిల్లల్లో, యుక్తవయస్కులలో ఈ ఆవేదన ఎక్కువ. అయితే ఎత్తు తక్కువగా ఉండటం వ్యాధి కాదు. సాధారణంగా తల్లిదండ్రులు తక్కువ ఎత్తు ఉంటే పిల్లలూ తక్కువగా ఎత్తుపెరుగుతారు. అయితే ఒక్కోసారి మాత్రం తగినంతగా ఎత్తు పెరగకపోవడం అన్నది ఏదో వ్యాధి కారణంగా కూడా జరగవచ్చు. అప్పుడా సమస్యకు చికిత్స చేయవచ్చు. ఎత్తు పెరగకపోవడానికి కారణాలు... 1. ఎఖాండ్రోప్లేసియా (జన్యుపరంగా వచ్చే సమస్యతో ఎత్తుపెరగకపోవడం); 2. దీర్ఘకాలిక వ్యాధులు, పుట్టుకతో వచ్చే గుండె సమస్యలు, మూత్రసంబంధ వ్యాధులు, సికిల్‌సెల్ అనీమియా, థలసీమియా, యుక్తవయసులో వచ్చే కీళ్లనొప్పులు (జువెనైల్ డయాబెటిక్ ఆర్థరైటిస్), మధుమేహం (డయాబెటిస్) వంటి వ్యాధుల వల్ల 3. పెరుగుదల నెమ్మదిగా ఉండటం (కాన్స్టిట్యూషనల్ గ్రోత్ డిలే), 4. కుషింగ్స్ డిసీజ్, 5. యుక్తవయసు నెమ్మదిగా రావడం, 6.డౌన్స్ సిండ్రోమ్, 7. హైపోథైరాయిడిజం పుట్టుకతోనే ఉండటం, 8. పేగులో వాపు, 9. పేగులో పుండు, 10. పౌష్టికాహారలోపం, 11.నూనాన్ సిండ్రోమ్, 12. పాన్హైపోపిట్యుటరిజమ్, 13. పెరుగుదల హర్మోన్ తగ్గుదల, 14. ప్రికాషియస్ ప్యూబర్టీ యుక్తవయసు ముందుగానే రావడం, 15. రికెట్స్, 16. రసెల్ సిల్వర్ సిండ్రోమ్, 17. టర్నర్ సిండ్రోమ్, 18.విలియమ్స్ సిండ్రోమ్. ఎత్తు అన్నది తల్లిదండ్రుల నుంచి జన్య్యుపరంగా సంక్రమిస్తుంది. అయితే ఒకవేళ ఏదైనా వ్యాధి కారణంగా ఎత్తుపెరగకపోవడం జరిగితే, దానికి సంబంధించిన చికిత్స అవసరమవుతుంది. అప్పుడు వైద్యులు తగిన పరీక్షలు చేస్తారు. జన్యుపరమైన లోపాలు ఏవైనా ఉన్నాయేమోనని చూస్తారు. ఎత్తు అనేది వంశపారంపర్యంగా వచ్చేదే అయినా ఏదైనా వ్యాధి లేదా వైద్యసమస్య వల్ల పెరుగుదలలో లోపాలు ఉంటే హోమియో విధానంలో బెరైట్ గ్రూపు మందులు, కాల్కేరియా ఫాస్, కాల్కేరియా కార్బ్, బెరైటా కార్బ్, మెడొరినం, తూజా వంటి మందులు హోమియో నిపుణుల ఆధ్వర్యంలో వారు సూచించిన మోతాదుల్లో వాడాల్సి ఉంటుంది. డాక్టర్ ఎం. శ్రీకాంత్, సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్