
నాకు ఇప్పుడు ఐదవ నెల. ఇంజెక్షన్స్ అంటే చాలా భయం. ఇప్పటి వరకు ఏ ఇంజెక్షన్ తీసుకోలేదు. ప్రెగ్నెన్సీ, కాన్పు సమయంలో తీసుకోవాలి కాబట్టి చాలా భయంగా ఉంది ఏదైనా సలహా చెప్పండి?
– ప్రణతి, గుంటూరు.
నీడిల్ ఫోబియా లేదా ఇంజెక్షన్ ఫోబియా అనేది మామూలే! ఇది ప్రతి పదిమందిలో ఒకరికి ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ఐదవ నెల, ఏడవ నెలలలో టీటీ ఇంజెక్షన్స్ తీసుకోవాలి. కాన్పు సమయంలో ఇన్‌ఫెక్షన్స్ రాకుండా, బ్లీడింగ్ కంట్రోల్‌కి ఇవి ఇవ్వవలసి వస్తుంది. కాబట్టి మీరు కొన్ని చిట్కాలు పాటిస్తే, భయం లేకుండా ఇంజెక్షన్స్ తీసుకోవచ్చు. ఇంతకు ముందు, సూది గుచ్చినప్పుడు, రక్తాన్ని చూసిన అనుభవం ఉంటే, ఆ భయం అలాగే ఉండిపోతుంది.
ఆ భయంతో కళ్లు తిరగటం, బీపీ, పల్స్ పెరగటం లేదా కళ్లుతిరిగి పడిపోవటం వంటివి జరగవచ్చు. ఇలా ఉన్నవారు ముందుగా నర్సింగ్ ష్టాఫ్, డాక్టర్‌కు తెలియజేయాలి. అప్పుడు కౌన్సెలింగ్ చేయటం, మీకు ఉన్న ఆప్షన్స్ చెప్పటం ద్వారా మీ భయాలను తీర్చడానికి ప్రయత్నిస్తారు.
అనస్థీషియా డాక్టర్‌ని పిలిపించి, శరీరంలో ఏ ప్రాంతంలో నుంచి రక్తం తియ్యాలో ఆ ప్రాంతానికి స్పర్శ తెలియకుండా చేయడానికి అరగంట ముందుగా క్రీమ్స్ పూస్తారు. అప్పుడు నొప్పి తెలియకుండా సూది గుచ్చుతారు. అలానే బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్, మాటల్లో పెట్టి రక్త నమూనాలు తీయటం లాంటివి నర్స్ కూడా చేస్తారు. బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ ప్రాక్టీస్‌తో స్లో బ్రీతింగ్ అలవాటు అవుతుంది.
ఇది రోజుకు మూడుసార్లు ఒక వారం చేయాలి. ఇదే విధంగా రక్త నమూనాలు తీసే సమయంలో కూడా పాటిస్తే భయం ఉండదు. ప్రెగ్నెన్సీలో నెలలు నిండే కొద్దీ కొన్ని పరీక్షలు చాలా అవసరం. మీకు పుట్టబోయే బిడ్డకు ఏ ఇన్‌ఫెక్షన్స్, సమస్యలు రాకుండా ఈ పరీక్షలు ఉపయోగపడతాయి.
అందుకే, ముందు నుంచి కౌన్సెలింగ్ సెషన్స్ తీసుకోవటం, డాక్టరును సంప్రదించటం, మీ భయాలను డాక్టర్‌కు ముందుగానే చెప్పటం చేయాలి. సీనియర్ నర్స్ లేదా అనస్థిటిస్ట్‌తో రక్త నమూనాలను తీయించుకోవటం లేదా ఐవీ లైన్ పెట్టించుకోవటం మంచిది. వీటితోపాటు బ్రీతింగ్ రిలాక్సేషన్ టెక్నిక్స్‌ను పాటిస్తే, మీ భయం కొద్దికొద్దిగా తగ్గుతుంది.
-డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్ హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment