అరుదైన ఘనత సాధించిన ‘గాంధీ’ వైద్యులు
హైదరాబాద్: అంతర్జాతీయ వైద్య రంగంలో అత్యంత అరుదైన ఘటనకు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వేదికైంది. శరీరంలోకి చేరిన విరిగిన సిరంజీ నీడిల్ రక్తంతోపాటు ప్రయాణించి గుండెను చుట్టివచ్చి ఊపిరితిత్తుల్లోని రక్తనాళంలో ఆగిపోయింది. పలు కార్పొరేట్ ఆస్పత్రులు తమ వల్ల కాదని చేతులు ఎత్తేయడంతో బాధితుడు గాంధీ ఆస్పత్రిలో చేరాడు. ఇటువంటి ఘటనను మొదటిసారి చూసిన గాంధీ వైద్యులు దీన్ని చాలెంజ్‌గా తీసుకున్నారు. ఈ విషయమై దేశ విదేశాలకు చెందిన వైద్య నిపుణులను సంప్రదించారు.
ఎట్టకేలకు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి సిరంజీ నీడిల్‌ను బయటకు తీసి రోగికి పునర్జన్మ ప్రసాదించారు. గాంధీ ఆస్పత్రి సెమినార్ హాలులో శుక్రవారం మీడియా సమావేశంలో సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్, కార్డియో«థొరాసిక్ హెచ్‌వోడీ రవీంద్ర, అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ కాన ఇతర వైద్య సిబ్బందితో కలసి వివరాలు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలానికి చెందిన కొవ్వాడయ్య (32) నగరంలో నివసిస్తున్నాడు. 3 నెలల క్రితం ఓ మధ్యవర్తి ద్వారా కొంపల్లి సమీపంలోని దూలపల్లిలోగల ఐజెంట్ క్లినికల్ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన డ్రగ్ టెస్టింగ్‌కు వెళ్లాడు. డ్రగ్ ఎక్కించే క్రమంలో చేతి రక్తనాళంలోకి ఐవీ క్యాన్‌ను అమర్చారు.
ఒత్తిడితో డ్రగ్‌ను పంపింగ్ చేయడంతో అనుసంధానంగా ఉన్న సింథటిక్ సిరంజీ 4 సెంటీమీటర్ల వరకు విరిగి లోపలే ఉండిపోయింది. రక్తనాళంలోని సిరంజీ నీడిల్ ముక్క రక్తప్రవాహం ద్వారా గుండెకు చేరింది. అక్కడి నుంచి ప్రయాణించి కుడివైపు ఊపిరితిత్తిలోని రక్తనాళంలో ఆగిపోయింది. రక్తనాళంలో నీడిల్ ప్రయాణిస్తున్న కొద్దీ కొవ్వాడయ్యకు చాతిలో నొప్పి, ఆయాసం, దగ్గు విపరీతంగా రావడంతో స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చూపించుకున్నాడు. రక్తనాళంలో ఏదో అడ్డుగా ఉన్నట్లు గుర్తించిన వైద్యులు పలు ప్రయోగాలు చేసినా ఫలించకపోవడంతో తమ వల్ల కాదన్నారు.
పలు కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో చూపించగా రూ.10 లక్షలకు పైగా ఖర్చవుతుందని, ప్రాణాలకు భరోసా ఇవ్వలేమన్నారు. స్థానికుల సూచన మేరకు ఈ నెల 18న బా«ధితుడు కొవ్వాడయ్య గాంధీ ఆస్పత్రిలో చేరాడు. ఈ నెల 24న సుమారు రెండున్నర గంటలు శ్రమించి శస్త్రచికిత్స నిర్వహించి ఊపిరితిత్తుల్లో చిక్కుకున్న నీడిల్‌ను బయటకు తీశారు. తనకు పునర్జన్మ ప్రసాదించిన గాంధీ వైద్యులకు కొవ్వాడయ్య కృతజ్ఞతలు తెలిపారు.
అంతర్జాతీయ వైద్య నిపుణుల ఆసక్తి..
ప్రపంచంలోనే తొలిసారి నమోదైన ఇలాంటి కేసుతోపాటు, శస్త్రచికిత్సపై అంతర్జాతీయ వైద్యనిపుణులు ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. రక్తనాళంలోకి చేరిన సిరంజీ నీడిల్ రక్తంతోపాటే ప్రయాణించి ఊపిరితిత్తిలో చిక్కుకోవడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, శస్త్రచికిత్స వీడియో దృశ్యాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దుబాయ్‌కు చెందిన కొంతమంది వైద్య నిపుణులు ఫోన్ ద్వారా సంప్రదించి రోగితోపాటు శస్త్రచికిత్స చేసిన వైద్యులకు విమాన టికెట్లు పంపిస్తామని, దుబాయ్ వచ్చి నేరుగా వివరాలు వెల్లడించాలని కోరుతున్నట్లు గాంధీ ఆస్పత్రి వైద్యులు రవీంద్ర, అరుణ తెలిపారు.