వైద్య చరిత్రలో అరుదైన కేసు
న్యూఢిల్లీ: కేరళ రాజధాని తిరువనంతపురంలోని మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఓ మనిషి శరీరంలో గుచ్చుకుపోయిన సూదిని 22 ఏళ్ల తర్వాత వైద్యులు ఆపరేషన్ చేసి తొలగించారు.
కిరణ్ కుమార్ (34) అనే వ్యక్తి 12 ఏళ్ల వయసులో ఉన్నపుడు ప్రమాదవశాత్తూ సూది అతని శరీరంలోకి దూరింది. అప్పట్లో కుటుంబ సభ్యులు కిరణ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే కిరణ్ బాడీలో ఉన్న సూదిని వైద్యులు గుర్తించలేకపోయారు. సాధారణ చికిత్స చేసి పంపించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు కూడా ఈ విషయాన్ని మరచిపోయారు.
రెండు వారాల క్రితం వీపు భాగంలో నొప్పిగా ఉండటంతో కిరణ్ వైద్యులను సంప్రదించాడు. స్కాన్ చేయించగా కిరణ్ ఎడమ పిరుదులో సూది ఉన్నట్టు గుర్తించారు. తిరువనంతపురం మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు వెళ‍్లాల్సిందిగా వైద్యులు సూచించారు. శనివారం వైద్యులు రెండున్నర గంటల సమయం శ్రమించి సర్జరీ చేసి సూదిని తొలగించారు. ఆర్థోపెడిక్, అనస్థేసియా నిపుణుల బృందం సర్జరీ చేసింది. కిరణ్ ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు.