మాజీ సీఎం కిరణ్ బంధువునంటూ టోకరా | Man posing as ex cm kiran kumar reddy relative for cheating | Sakshi
Sakshi News home page

మాజీ సీఎం కిరణ్ బంధువునంటూ టోకరా

Published Tue, Sep 2 2014 3:11 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

మాజీ సీఎం కిరణ్ బంధువునంటూ టోకరా - Sakshi

మాజీ సీఎం కిరణ్ బంధువునంటూ టోకరా

  •      ఎస్‌ఐ, వీఆర్‌వో అభ్యర్థుల వద్ద రూ.55 లక్షల వసూలు
  •      సీఎం పేషీ ఇచ్చినట్టుగా నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్స్
  •      కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు
  • సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి బంధువునని నమ్మించి.. ఉద్యోగాల పేరిట పలువురు ఎస్‌ఐ, వీఆర్‌వో అభ్యర్థులను నిలువునా ముంచాడో కేటుగాడు. ఎస్‌ఐగా ఎంపికైనట్లు సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయం పేరుతో అతడు అభ్యర్థులకు నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం గమనార్హం. నిందితుడు నిరుద్యోగుల నుంచి ఉద్యోగాల పేరుతో సుమారు రూ.55 లక్షలు దండుకుని పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నగర సీసీఎస్ పోలీసులు సోమవారం చీటింగ్ కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం..  

    పీలేరు మండలం గ్యారంపల్లికస్ప గ్రామానికి చెందిన జగన్మోహన్‌రెడ్డి హైదరాబాద్‌లోని లక్డీకాపూల్‌లో రెండేళ్ల క్రితం ప్రైవేట్ కార్యాలయం తెరిచాడు. కడప జిల్లా బద్వేల్‌కు చెందిన విజయనర్సింహా రెడ్డి, రైల్వే కోడూరుకు చెందిన నరేష్,  చంద్రగిరికి చెందిన సుమతి ఎస్‌ఐ ఉద్యోగ పరీక్ష రాశారు. నల్లకుంటలో ఉండే రఘు తన స్నేహితుడు జగన్మోహన్‌రెడ్డి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి బంధువని, అతను ఎస్‌ఐ పోస్టులు ఇప్పిస్తాడని పై ముగ్గురితో నమ్మబలికాడు.

    2013లో జగన్మోహన్‌రెడ్డిని కలుసుకున్నారు. ఒక్కో పోస్టుకు రూ.10 లక్షలకు బేరం కుదుర్చుకుని అడ్వాన్స్‌గా ముగ్గురి నుంచి రూ.15 లక్షలు తీసుకున్నాడు. అలాగే వీఆర్‌వో, పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి నుంచి రూ.33 లక్షలు తీసుకున్నాడు. ఎస్‌ఐ అభ్యర్థులుగా సెలక్ట్ అయినట్లు సీఎం కార్యాలయం పేరుపై ఎస్‌ఐ అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ లెటర్స్ కూడా ఇచ్చాడు. తీరా అవి నకిలీవని తెలుసుకున్న అభ్యర్థులు డబ్బులకోసం నిలదీయగా.. జగన్మోహన్‌రెడ్డి తన కార్యాలయం ఖాళీ చేసి పరారయ్యాడు.

    బాధితులు నగర సీసీఎస్ డీసీపీ పాలరాజుకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చీటింగ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా... కారు విక్రయిస్తానని  జగన్మోహన్‌రెడ్డి రూ.2 లక్షలు తీసుకుని ఉడాయించాడని చిత్తూరుకు చెందిన మురళి, డాక్టర్ పోస్టు ఇప్పిస్తానని తమ వద్ద నుంచి రూ.5 లక్షలు తీసుకున్నాడని రైల్వే కోడూరుకు చెందిన హెడ్‌మాస్టర్ సుబ్బారాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement