హైదరాబాద్: రాష్ట్రంలో కొద్దిరోజుల తేడాతో మూడు ఎన్నికలు నిర్వహించడం వల్ల గందరళగోళ పరిస్థితి ఏర్పడుతుందని, వీటన్నింటికీ మాజీముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డియే కారణమని 1969 ఉద్యమకారుల సమాఖ్య విమర్శించింది. విద్యార్థుల పరీక్షలు, సార్వత్రిక ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలకు తోడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకోవడం దారుణమని వాపోయింది. పార్టీలు ఈ విషయంపై స్పందించకపోవడం బాధాకరమని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలను వాయిదా వేసుకోవడమే ఉత్తమమని విజ్ఞప్తి చేసింది. నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌రోడ్డులోని మదీనా ఎడ్యుకేషన్ సెంటర్‌లో శనివారం ‘1969 ఉద్యమకారుల సమాఖ్య’ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది.
సమాఖ్య కోకన్వీనర్ కొల్లూరి చిరంజీవి సదస్సుకు అధ్యక్షత వహించి మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని ఎన్నికలు ఒకేసారి రావడానికి కిరణ్‌కుమార్‌రెడ్డే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తరచూ ఎన్నికలను వాయిదా వేస్తూ అధికారుల పాలనలో ఉంచారని మండిపడ్డారు. ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రజలందర్నీ చైతన్యం చేసేందుకు ప్రత్యేకంగా‘కామన్ పొలిటికల్ ఫ్రంట్’ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లకతీతంగా తాము నిర్మాణం చేయబోయే ఫ్రంట్ పనిచేస్తుందన్నారు. 1969 ఉద్యమకారుల సమాఖ్య త్వరలో ఉద్యమపార్టీగా ఆవిర్భావం చెందనుందని ఆయన ప్రకటించారు. కేసీఆర్ చెప్పే మాటలకు..చేసేవాటికి పొంతన ఉండదని కొల్లూరి విమర్శించారు.
తెలంగాణ ఏర్పాటులో రచయితలు,కళాకారులది కీలకపాత్ర : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో రచయితలు,కళాకారుల పాత్ర మరిచిపోలేనిదని పలువురు వక్తలు అన్నారు. దోమలగూడ ఏవీ కళాశాలలో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో శనివారం కవులు,రచయితల మహాసమ్మేళనం జరిగింది.
‘కొత్త రాష్ర్ట సాహిత్యలోకం-తెలంగాణ పునర్నిర్మాణం’ పేరుతో జరిగిన కార్యక్రమానికి తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పునర్‌నిర్మించుకోవాలని, తెలంగాణ పోరాటాన్ని, అమరుల చరిత్రను పాఠ్యాంశాలుగా చేర్చాలని డిమాండ్ చేశారు.
పునర్నిర్మాణంలో కవులు,రచయితలు ప్రణాళికతో ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. ప్రజాగాయకుడు గద్దర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజల హక్కుల సాధనకు పోరాటాలు తప్పవని స్పష్టంచేశారు. తెలంగాణలో అప్పుడే రాజకీయక్రీ డ ప్రారంభమయ్యిందని ఆవేదనవ్యక్తం చేశారు. అసమానతలు, ఆత్మహత్యల్లేని సమాజం కోసమే తెలంగాణ ప్రజలు పోరాడారని దర్శకుడు శంకర్ గుర్తుచేశారు. కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు కె.శ్రీనివాస్‌రెడ్డి, టంకశాల అశోక్, కె.శ్రీనివాస్, అల్లం నారాయణ, కవులు ప్రొ.జయధీర్ తిరుమలరావు, నందిని సిద్ధారెడ్డి, జూకంటి జగ న్నాథం, పి.శ్రీనివాస్‌రావు, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు..