సీఎం కిరణ్‌కు షోకాజ్?
అధిష్టానం ఆడిస్తున్న కొత్త పార్టీ నాటకంలో భాగమే
ఒకట్రెండు రోజుల్లో అందే అవకాశం
ధిక్కార ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా
తద్వారా వారిని సమైక్య చాంపియన్లుగా చూపే వ్యూహం
‘పార్టీ’ ఏర్పాటుకు వీలు కల్పించడమే లక్ష్యమంటూ ప్రచారం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లును సజావుగా గట్టెక్కించేందుకు ఇప్పుటిదాకా అనేక కపట నాటకాలకు తెర తీస్తూ వచ్చిన కాంగ్రెస్ అధిష్టానం, ఇక సమైక్య ముసుగులో తనకు పూర్తిగా సహకరిస్తున్న నేతలతో రక్తికట్టిస్తున్న ‘కొత్త పార్టీ’ నాటకానికి తుది మెరుగులు దిద్దుతోంది. తనకు వీర విధేయులుగా ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ‘సమైక్య చాంపియన్లు’ అనే ముసుగులు తొడిగి ప్రజల్లోకి పంపే ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది.
అందులో భాగంగా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా మొదటినుంచీ నాటకాలాడుతున్న నేతలకు ‘షోకాజ్’ నోటీసులివ్వడం, లేదా ‘సస్పెన్షన్ వేటు వేయడం’ వంటి చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అలా చేస్తే సీమాంధ్ర ప్రజల్లో వారికి ఆదరణ పెరుగుతుందని హస్తిన పెద్దలు అంచనా వేస్తున్నట్టు సమాచారం. అంతా అనుకున్నట్టుగా జరిగితే, ముసుగు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సహా ఇతర నేతలకు ‘పార్టీ విధానలను ధిక్కరిస్తున్నార’నే అభియోగాలతో ఒకట్రెండు రోజుల్లో అధిష్టానం షోకాజ్ నోటీసులు పంపవచ్చన్నది ఏఐసీసీ వర్గాల సమాచారం.
సభలో మాట్లాడగానే...!
రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో సీమాంధ్రలో చతికిలపడ్డ పార్టీని ఎలాగైనా గట్టెక్కించాలని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం, ఆ దిశగా తన కనుసన్నల్లో మెలిగే విధేయ వర్గంతో కొత్త పార్టీ ఏర్పాటుకు అవసరమైన సరంజామాను సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఆ ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లడంలో భాగంగానే కిరణ్ సహా కొందరు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలపై ‘క్రమశిక్షణ చర్యలు’ తీసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలిసింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీలో కిరణ్ మాట్లాడేందుకు కొద్ది గంటల ముందు గానీ, మాట్లాడాక గానీ ఆయనకు షోకాజ్ పంపే అవకాశమున్నట్టు తెలుస్తోంది. సభలో సమైక్యానికి మద్దతుగా మాట్లాడిన సందర్భంలోనే షోకాజ్‌లు పంపడం ద్వారా కిరణ్‌ను సీమాంధ్రలో చాంపియన్‌ను చేయాలని అధిష్టానం భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.