రక్తసంబంధీకులతోనే వివాహాలెందుకు? | Wedding awake menarikaచ | Sakshi
Sakshi News home page

రక్తసంబంధీకులతోనే వివాహాలెందుకు?

Published Mon, Feb 23 2015 11:44 PM | Last Updated on Sat, Sep 2 2017 9:47 PM

రక్తసంబంధీకులతోనే వివాహాలెందుకు?

రక్తసంబంధీకులతోనే వివాహాలెందుకు?

మేలుకాని  మేనరికం!

మేనరికాల జోడీ... భావితరాలకు కీడు
 

ఓ చిన్నారి పుట్టగానే ప్రసూతి అయిన తల్లి దగ్గరే ఉన్న పెద్దవాళ్లు చేసే మొదటి పని... చేతులకు ఐదైదు వేళ్లు ఉన్నాయా,
 అదనంగా ఏమైనా ఉన్నాయా అని చూడటం. ఆ తర్వాతి పని బుజ్జాయికి శారీరక అవకరాలేమీ లేవని నిర్ధారణ చేసుకోవడం.
 ఆ తర్వాతే పండంటి బిడ్డ పుట్టిందంటూ ప్రకటిస్తారు. ఆ బిడ్డ పెరుగుతూ తల్లిదండ్రులూ, సమాజంలోని ఇతరుల పలకరింపులకు చక్కగా స్పందిస్తుంటే బిడ్డ మానసిక పరిస్థితీ బాగుందంటూ ఆనందిస్తారు. కానీ... తొలిదశలోనే బిడ్డలో ఏవైనా  అవయవలోపాలు కనిపిస్తే...? ఎదిగే క్రమంలో చిన్నారిలో ఏవైనా మానసిక సమస్యలు ఎదురైతే...? ఇక ఆ తల్లిదండ్రుల  వేదనను మాటల్లో వర్ణించలేం. సాధారణంగా ఇలా శారీరక లోపాలు ఉండే బిడ్డలు పుట్టేందుకు మేనరికపు వివాహాల్లోనే అవకాశాలు ఎక్కువ. అందుకే... మారుతున్న సమాజంలో ఆరోగ్యకరమైన బిడ్డల కోసం మేనరికపు వివాహాలను పరిహరించడమే మంచిదని ఆధునిక వైద్యశాస్త్రం చెబుతోంది. మేనరికపు వివాహాల్లో ఇలా ఎందుకు జరుగుతోంది,  ఒకవేళ మేనరికపు వివాహమే తప్పనప్పుడు బిడ్డ పుట్టకముందూ, కడుపున పడ్డ తర్వాత దంపతులు
 చేయించుకోవాల్సిన పరీక్షలూ, తీసుకోవాల్సిన జాగ్రత్తల వంటి అనేక అంశాలపై  అవగాహన కోసమే ఈ ప్రత్యేక కథనం.
 
1   జన్యుపరమైన సమస్యలూ - రకాలు
 
సాధారణంగా జన్యుపరమైన సమస్యలను మూడు రకాలుగా విభజించవచ్చు. అవి..  ఆటోజోమల్ డామినెంట్ ఇలాంటి జీన్స్ వచ్చిన పిల్లల్లో సమస్య  బయటకు కనిపిస్తూ ఉంటుంది. పైగా లోపంతో ఉన్న జీన్ డామినెంట్‌గా ఉంటుంది.  దాంతో ఒక్క జీన్ సంక్రమించినా పిల్లల్లో సమస్య బయటపడుతుంది.
 
 2  ఆటోజోమల్ రెసెసివ్


వీటిలో సమస్య బయటపడదు. కానీ తల్లిదండ్రులిద్దరిలోనూ సమస్య కలగజేసే జన్యువులు నిశ్శబ్దంగా లోపలే ఉంటాయి.  వీళ్లు తర్వాత తరానికి సమస్యను మోసుకెళ్తారు. కాబట్టి వీరిని  ‘క్యారియర్స్’ అంటారు. ఇద్దరు ‘క్యారియర్స్’ పెళ్లాడితే... రెండు రెసెసివ్ జీన్స్ కలిసి... పుట్టబోయే బిడ్డలో సమస్య  తప్పక బయటపడుతుంది.
 
 
 3 ఎక్స్ లింక్‌డ్ సమస్యలు

ఇలాంటి సమస్యలు ‘ఎక్స్’ క్రోమోజోమ్‌పై నిక్షిప్తమై ఉంటాయి. దాంతో ఈ జీన్ కలిగిన ఆడపిల్లలు సమస్యకు ‘క్యారియర్స్’గా ఉంటారు. సమస్య మగపిల్లల్లో బయటపడుతుంది.
 
ఒక ఆరోగ్యకరమైన అమ్మాయి, ఒక ఆరోగ్యకరమైన అబ్బాయి కలిసి ఒక ఆరోగ్యకరమైన చిన్నారికి జన్మనిచ్చే అంశంలో... ప్రతి విషయంలోనూ, ప్రతి అంశంలోనూ సగం పాళ్లు అమ్మాయి నుంచి, మరో సగం అబ్బాయి నుంచి వస్తాయి. ఆ అంశాలనే వైద్యపరిభాషలో జన్యువులంటారు. తల్లిదండ్రులకు చెందిన ఆ జన్యువుల్లో ఏ లోపాలూ లేకపోతే ఆరోగ్యకరమైన అవయవం రూపుదిద్దుకుంటుంది. తల్లిదో, తండ్రిదో చెప్పలేకపోయినా... ఒకవేళ ఒక జన్యువులో ఏదైనా లోపం ఉంటే... మరో జన్యువు ఆ లోపాన్ని పూరిస్తుంది. మరి రెండు జన్యువులూ లోపంతోనే ఉంటే...? అప్పుడు అవకరం లేదా లోపం తప్పదు. మరి ఇలా రెండు జన్యువులూ లోపంతోనే ఉండే పరిస్థితి ఎప్పుడు తటస్థిస్తుంది? ఎప్పుడంటే... వాళ్లిద్దరూ ఒకే సంతతికి చెందినవారైనప్పుడు... ఆయా జన్యువులూ ఒకేలా ఉంటాయి. ఒకే సంతతికి చెందిన వారంటే... చాలా దగ్గరి సంబంధం కలిగినవారని అర్థం. అందుకే ఆరోగ్యకరమైన బిడ్డ కావాలనుకున్నప్పుడు ఆ పెళ్లిళ్లను ఆధునిక వైద్యశాస్త్రం అంతగా ప్రోత్సహించదు. మరి ఎలాంటి దగ్గరి సంబంధాలు లేనప్పుడు ఇలాంటి అవకరాలకు అవకాశం లేదా? ఉంటుంది. కానీ... దూరపు సంబంధాల్లో 400 జంటల్లో ఒకదానికి అవకరమైన బిడ్డ పుట్టే అవకాశం ఉంటే... దగ్గరి సంబంధాల విషయంలో కేవలం 200కు పైగా జంటల్లోనే ఒక బిడ్డ ఇలా లోపాలతో పుట్టే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకే ఆరోగ్యకరమైన బిడ్డ కోసం దూరపు సంబంధాలనూ, వీలైతే అసలేవిధమైన రక్తసంబంధం లేని ఇతర
 కుటుంబాల వారితో వివాహాలను ప్రోత్సహిస్తోంది ఆధునిక వైద్యశాస్త్రం.
 
రక్తసంబంధీకులతోనే వివాహాలెందుకు?

ఇంగ్లాండ్ రాజకుటుంబాల్లోని వారికి ఒక అపోహ ఉండేది. తమలో ప్రవహించేది పవిత్రమైన రాజరికపు నెత్తురనీ... ఆ రక్తం కలుషితం కాకూడదనీ వాళ్లు భావించేవారు. బయటి సంబంధాల వల్ల రాజరికపు నెత్తురు సంకరమవుతుందనే ఉద్దేశంతో రాజవంశీయుల్లోనే చాలా దగ్గరి సంబంధాలను చేసుకునేవారు. దాంతో బ్రిటిష్ రాజవంశీయుల జన్యువుల్లోని ఒక జన్యులోపం కారణంగా మగపిల్లల్లో ఒక లోపం ఏర్పడింది. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల రాకుమారుడికి చిన్నపాటి గాయం తగిలినా... రక్తం ఎంతకూ గడ్డకట్టేది కాదు. ఇలా ఎంతసేపటికీ రక్తం గడ్డకట్టకపోవడం వల్ల తీవ్రరక్తస్రావంతో రాకుమారుడు చనిపోయే అవకాశాలుండేవి. అందుకే బ్రిటన్ రాజవంశీయుల పూర్వికులైన రాజులందరూ బ్లేడు గాటు కూడా తగలకుండా జాగ్రత్త పడేందుకు బవిరి గడ్డాలతో, గుబురు మీసాలతో కనిపిస్తుండేవారు. ఇది అలనాటి బ్రిటన్ రాజవంశీయుల చిత్తరువుల్లో చూడవచ్చు. ఆధునిక కాంలో ఈ లక్షణంపై పరిశోధనలు జరిగాయి. ఇలా రక్తం గడ్డకట్టనివ్వని లక్షణమున్న జబ్బును హీమోఫీలియా అంటారనీ, ఎన్నో తరాలుగా దగ్గరి సంబంధీకులతోనే వివాహాలు జరగబట్టి ఈ లోపం ఏర్పడిందని పరిశోధనల ద్వారా తెలిసింది. అయితే రాజకుటుంబాల్లోని వారి సంతానాలకే ఈ జబ్బు ఉండటం వల్ల అప్పట్లో ప్రజానీకం దీన్ని ‘రాయల్ డిసీజ్’ అనేవారు. (కానీ సామాన్యుల్లోనూ ఈ జబ్బు కనిపిస్తుంది).

ఇక సామాన్య ప్రజానీకం విషయాలకు వస్తే... ప్రధానంగా ఆర్థిక అంశాలే దగ్గరి సంబంధీకులతో వివాహాలను ప్రోత్సహిస్తాయి. ప్రధానంగా మేనత్త మేనమామ పిల్లలను చేసుకుంటే ఆస్తిలో ఆస్తి కలుస్తుంది... ఆ ఆస్తి ఇతరుల పాలయ్యే బాధ తప్పుతుందనే అంశమే ఇలాంటి పెళ్లిళ్లను ఎక్కువగా ప్రోత్సహిస్తుంది. ఇక రెండో ప్రధాన అంశం... ఉద్వేగపూరిత బంధం. అంటే ఎమోషనల్ రిలేషన్‌షిప్. మనం ప్రాణప్రదంగా పెంచుకున్న మన బిడ్డను ఎక్కడో దూరంగా ఉన్నవారికి ఇచ్చి పెళ్లి చేస్తే... వారెలా చూసుకుంటారో, పువ్వులో పెట్టుకుంటారో లేక ఆరళ్లు పెడుతూ ఉంటారో? అదే... మన కళ్లెదురుగా ఉండేలా చేస్తే... బిడ్డ బాగోగులు చూస్తూ ఉండవచ్చు కదా! ఈ అంశాలతో కులాలు, మతాలు, ప్రాంతాలు, దేశాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా 20 శాతం పెళ్ళిళ్లు దగ్గరి బంధువుల్లోనే జరుగుతుంటాయి. తమ జీవనశైలిలో, తమ సాంస్కృతిక విధానంలో తేలిగ్గా ఇమిడిపోవడం వల్ల పెళ్లి తర్వాత దంపతులకు ఇబ్బందులు రావనే భావనే ఇలాంటి వివాహాలను ప్రోత్సహిస్తుంది. అంటే సాంస్కతిక సమానత మూడో ప్రధానమైన అంశం అన్నమాట.
 
బిడ్డలకు లక్షణాలెలా వస్తాయంటే...


ప్రతి మానవుడి దేహం కోటానుకోట్ల కణాలతో నిర్మితమవుతుంది. ఇది తొలుత ఒకే ఒక కణంతో మొదలవుతుంది. ప్రతి మానవ కణంలో 46 క్రోమోజోములుంటాయి. అంటే 23 జతలన్నమాట. వీటిలో మొదటి జత 23 మహిళ నుంచి, మరో 23 పురుషుడి నుంచి ఏకీకృతమై మొదటి కణం ఏర్పడుతుంది. దీన్నే పిండం అని అభివర్ణిస్తాం. ఈ పిండంలో ఉంటే 23 జతల క్రోమోజోములపై అనేక జన్యువులు ఉంటాయి. జన్యువు అంటే ఏమిటో కాస్త తేలిక భాషలో చెప్పుకుందాం. బిడ్డ పుట్టగానే బంధువులందరూ చుట్టూ చేరి మురిపెంగా చూసుకుంటూ ‘‘అరె... వీడి ముక్కు చూడండి. అచ్చం వాళ్ల తాతయ్యదే. వాడి కళ్లు చూడండి. అచ్చం వాళ్ల అమ్మవే’’ అంటూ పోలికలు చెబుతుంటారు. బిడ్డలో ఈ పోలికలు ఎలా వస్తాయి? ఎలాగంటే... ప్రతి అవయవానికీ, దాని ఆకృతికీ, సైజ్‌కూ, ఒడ్డూపొడవునకు సంబంధించిన ప్రతి అంశమూ జన్యువులో ముందే నిక్షిప్తమై ఉంటుంది. ఈ జన్యువులన్నీ క్రోమోజోములపై ఉంటాయి. ఈ క్రోమోజోముల 23 జతలు ఒకదానితో మరొకటి కలిసి ఒక కణంగా రూపొందే సమయంలో తల్లిదండ్రుల నుంచి బిడ్డలకు పోలికలు వస్తాయి. అంతేకాదు... తల్లిదండ్రుల లక్షణాలూ, ఒంటి రంగు వంటి అనేక అంశాలూ తల్లిదండ్రుల నుంచే సంక్రమిస్తాయి. ఇలా ఈ లక్షణాలన్నీ ఒక తరం నుంచి మరో తరానికి బదిలీ అవుతుంటాయి.
 
మేనరికపు దంపతులు  చేయించుకోవాల్సిన  పరీక్షలు

 
గర్భందాల్చిన మూడో నెలలో (12 వారాల్లో) డబుల్ మార్కర్ టెస్ట్ అనే రక్తపరీక్ష చేయించుకుంటే బిడ్డలో డౌన్స్ సిండ్రోమ్, ట్రైజోమ్ 18, 13 వంటి కొన్ని రకాల జన్యుపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా లేక తక్కువగా ఉన్నాయా అని తెలుస్తుంది. ఈ పరీక్షల ఫలితాలను బట్టి వేరే పరీక్షలు అవసరమా కాదా అని తెలుస్తుంది.మూడో నెలలో (12 వారాలప్పుడు) న్యూకల్ ట్రాన్స్‌లుయెన్సీ స్కాన్ (ఎన్టీ స్కాన్) చేయించుకుంటే, ఆ సమయానికి బయటపడే సమస్యలు ఏమైనా ఉంటే తెలుస్తాయి.   పై పరీక్షల్లో కొన్ని జన్యుపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందనే సందేహం కలిగినప్పుడు దాన్ని నిర్ధారణ చేయడానికి బిడ్డ చుట్టూ ఉండే మాయ నుంచి కొంత ముక్క సేకరించి కోరియా విల్లస్ బయాప్సీ చేస్తారు. ఐదో నెలలో ట్రిపుల్ మార్కర్ లేదా క్వాడ్రపుల్ మార్కర్ వంటి రక్తపరీక్షలు చేయించుకుంటే పుట్టబోయే బిడ్డలో కొన్ని రకాల జన్యుపరమైన సమస్యలు ఎక్కువా లేదా తక్కువా అన్నది తెలుస్తుంది.
 
 ఇందులో రిస్క్ ఎక్కువగా ఉన్నట్లు ఫలితాలు వస్తే ఆమ్నియోసెంటైసిస్ అనే పరీక్ష చేయించాల్సి ఉంటుంది. ఇందులో గర్భంలోని బిడ్డ చుట్టూ ఉండే ఉమ్మనీరు లోంచి 10 - 20 ఎమ్‌ఎల్. తీసి జన్యువుల పరీక్షకు (క్యారియోటైపింగ్‌కు) పంపించి సమస్యను నిర్ధారణ చేస్తారు. ఈ పరీక్ష వల్ల ఒక శాతం మందిలో గర్భస్రావమయ్యే అవకాశం ఉంటుంది.
 
ఐదో నెల చివరిలో 18-22 వారాలప్పుడు ‘టిఫ్ఫా’ అనే స్కానింగ్ చేయడం వల్ల బిడ్డలో వచ్చే అవయవలోపాలను ముందుగానే గుర్తించవచ్చు. దీనితో పాటు జెనెటిక్ సోనోగ్రామ్ చేయించుకుంటే కొన్ని జన్యుసంబంధిత వ్యాధులను సూచించే సాఫ్ట్ మార్కర్‌లను గుర్తించి, దానికి తగినట్లుగా తదుపరి నిర్ణయం తీసుకోవచ్చు.
 
ఆరో నెలలో 22-24 వారాల్లో 2డీ ఫీటల్ ఎకో కూడా చేయించుకుంటే బిడ్డలో గుండెకు సంబంధించిన లోపాలను గుర్తించవచ్చు.  స్కానింగ్‌లో నూటికి నూరు పాళ్లూ లోపాలను కనుక్కోలేకపోవచ్చు. కొందరిలో బిడ్డ పొజిషన్, ఉమ్మనీటి శాతం, తల్లి పొట్ట మీద అధికకొవ్వు వంటి అంశాలను బట్టి కూడా కొన్ని లోపాలను కనుగొనడంలో విఫలమయ్యే అవకాశం ఉంది.
 
బిడ్డ పుట్టాక
 
బిడ్డపుట్టిన తర్వాత మొదటి వారంలోనే నియోనేటల్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించడం వల్ల త్వరగా చికిత్స చేయదగిన వ్యాధులు ఏవైనా ఉంటే తెలుస్తుంది. అంటే ఎర్రర్స్ ఆఫ్ మెటబాలిజమ్ వంటివి గుర్తించవచ్చు. బిడ్డ మూడో నెలలో వినికిడి లోపాలను గుర్తించే పరీక్షలు చేయించి, ఒకవేళ ఉంటే వాటిని చాలావరకు సరిదిద్దవచ్చు.
 
దగ్గరి సంబంధాల్లో లోపాలు ఎందుకంటే...

క్రోమోజోములపై లక్షణాలను సంక్రమింపజేసే జన్యువులు తండ్రి నుంచి ఒకటీ, తల్లి నుంచి మరొకటి కలిసి సంపూర్ణమవుతాయి. ఉదాహరణకు... ఒక మహిళలో (కాబోయే తల్లిలోని) ఒక జన్యువు కాస్త చెడిపోయి... బిడ్డలో అది ఆస్తమా వ్యాధిని కలగజేసేందుకు అవకాశం ఉందనుకుందాం. ఆ మహిళ తన కుటుంబంలోని దగ్గరి వారిని కాకుండా సంబంధాలు లేని మరొకరిని ఎవరినో పెళ్లి చేసుకుందని అనుకుందాం. అప్పుడు ఆ పురుషుడిలోని అదే రకమైన జన్యువు ఆరోగ్యంగా ఉందనుకుందాం. ఈ ఆరోగ్యకరమైన పురుషుడి జన్యువు, అనారోగ్యకరమైన ఆ స్త్రీ జన్యువును అధిగమిస్తుంది. అంటే ఇంగ్లిష్‌లో చెప్పాలంటే  డామినేట్ చేస్తుంది. ఇలా డామినేట్ చేసే జన్యువును ‘డామినెంట్’ జీన్ అంటారు. అలాగే లొంగి ఉండే అనారోగ్యకరమైన జన్యువును ‘రెసెసివ్’ జీన్ అంటారు. అలాగే ఒకవేళ కుటుంబ సభ్యుల్లోని దగ్గరి సంబంధంలోనే పెళ్లి జరిగిందనుకోండి. అప్పుడు తల్లిదండ్రులిద్దరూ ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చినవారు కాబట్టి వారిద్దరిలోనూ సదరు జన్యువుల తీరు ఒకేలా ఉంటాయి. దాంతో ఇద్దరి జన్యువుల్లోనూ ఏదీ మరొకదాన్ని డామినేట్ చేయకపోవడం, రెండూ లోపంతోనే ఉండటంతో పుట్టబోయే బిడ్డలో ఆస్తమా వ్యక్తమవుతుందన్నమాట. ఇది ఒక జన్యువు ఉదాహరణ మాత్రమే. ఇలా తల్లిదండ్రుల లక్షణాలను మోసుకెళ్లే జన్యువులు ఒక్క క్రోమోజోమ్‌పై దాదాపు 20,000 వరకూ ఉంటాయి. అంటే భవిష్యత్తులో ఆ పుట్టబోయే బిడ్డ ప్రతి లక్షణమూ ముందే ప్రోగ్రామ్ అయిపోయి జన్యువుల్లో నిక్షిప్తమై ఉంటుందన్నమాట. అందుకే దంపతులిద్దరూ దగ్గరి బంధువులైతే ఇద్దరిలోనూ ఉన్నది  ఒకేలాంటి లోపం ఉన్న (ఫాల్టీ) జీన్ అయితే పుట్టే బిడ్డలో అవకరం /లోపం కనిపిస్తుందన్నమాట.
 
ఎలాంటి జబ్బులు?

మేనరికపు వివాహాలు చేసుకున్న వారిలో అవయవలోపాలు, పుట్టుకతో వచ్చే జబ్బులు లేదా లోపాలు (కంజెనిటల్ డిసీజెస్), రక్తసంబంధిత వ్యాధులైన హీమోఫీలియా, థలసీమియా వంటివి, సిస్టిక్ ఫైబ్రోసిస్, మూత్రపిండాల వ్యాధులు (కంజెనిటల్ యురెట్రోపెల్విక్ అబ్‌స్ట్రక్షన్), కండరాల, నరాలకు సంబంధించిన వ్యాధులు, కొన్ని రకాల సిండ్రోములు, బుద్ధిమాంద్యత, వికినిడి సమస్యలు, కళ్లసమస్యలు, గుండెకు సంబంధించిన సమస్యలు (గుండెలో రంధ్రాలు, వాటి ధమనుల్లో లోపాలు), చిన్నప్పుడే వచ్చే మధుమేహం, జన్యుపరమైన సమస్యలు, తల్లిలో మాటిమాటికీ జరిగే గర్భస్రావాలు, పుట్టగానే బిడ్డ చనిపోవడం, శ్వాససంబంధిత సమస్యలు, జీవక్రియలకు సంబంధించిన (మెటబాలిక్) సమస్యలు ఇలా అనేక వైద్యపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి.
 
 
చేసుకున్న   ప్రతివారికీ ఇదే సమస్యా?


మేనరికపు వివాహం చేసుకున్న ప్రతి దంపతులకూ ఇలాంటి సమస్యలే వస్తాయని నమ్మకంగా చెప్పవచ్చా అని అడిగితే... అలాగే జరిగి తీరుతుందని చెప్పలేం. కానీ సాధారణంగా మిగతావారిలో 2-3 శాతం మందికి ఇలా పుట్టుకతో వచ్చే వైద్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటే... మేనరికం చేసుకున్నవారిలో ఈ ప్రమాదం (రిస్క్) రెట్టింపు ఉంటుంది. అంటే మేనరికపు వివాహాలు చేసుకున్నవారిలో 4 - 6 శాతం మంది పిల్లలకు ఇలా వైద్యసమస్యలున్న పిల్లలు పుట్టవచ్చు. లేదా మొదటి సంతానం బాగానే పుట్టి రెండో సంతానానికి సమస్య రావచ్చు. లేదా దీనికి విరుద్ధంగా కూడా కావచ్చు. ఒక వ్యాధిని ఒక తరం నుంచి మరో తరానికి మోసుకెళ్లే ఒక రిసెసివ్ జీన్ తల్లిదండ్రులిద్దరిలోనూ ఉన్నప్పుడు వారి బిడ్డకు ఈ వ్యాధి వచ్చే అవకాశాలు 25 శాతం అన్నమాట. అంటే వారికి నలుగురు సంతానం కలిగితే ఒక్కరికి తప్పక ఈ వ్యాధి రావచ్చు. అలాగే ఆరోగ్యకరంగా ఉన్న ఆ పిల్లల్లో సగం మందికి తమ కణాల్లో అదే చెడిపోయిన జీన్ (రిసెసివ్ జీన్) ఉండవచ్చు. అది తర్వాతి తరంలో ప్రయుక్తం కానూ వచ్చు. కాకపోనూ వచ్చు.
 
 కానీ... ప్రమాదం పొంచి ఉందిలా...

దగ్గరి వివాహాలను వైద్య పరిభాషలో కన్‌సాంగ్వినియస్ మ్యారేజెస్ అంటారు. అంటే కోడలు వరసయ్యే అమ్మాయి మేనమామను చేసుకోవడం, లేదా మేనమామ, మేనత్త పిల్లలను పెళ్లి చేసుకోవడం. ఇలాంటి దగ్గరి సంబంధాల వల్ల పుట్టబోయే బిడ్డల్లో అవయవలోపం నుంచి బుద్ధిమాంద్యం వరకు ఎన్నో రకాల రుగ్మతలు, సిండ్రోమ్స్ వచ్చే అవకాశం ఉంది.  ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని మేనరికపు వివాహాలకు దూరంగా ఉండటమే మేలు. ఒకవేళ ఈ అంశాలన్నీ తెలియక నిశ్చితార్థమో, వివాహమో చేసుకుంటే... అప్పుడు ఆ జంట చేయాల్సిన పనులివి...
 
పెళ్లికి ముందు: వివాహానికి ముందే అమ్మాయీ, అబ్బాయి... ఈ ఇద్దరినీ ప్రీ-మేరిటల్ అండ్ జెనెటిక్ కౌన్సెలింగ్ కోసం నిపుణులను కలవాలి. అప్పుడా నిపుణులు కుటుంబ ఆరోగ్య చరిత్రను పరిగణనలో తీసుకుంటారు. అంటే వీరి తల్లిదండ్రులు, మేనత్త, మేనమామ, తాతలు, ముత్తాతల్లో ఏవైనా దగ్గరి సంబంధం చేసుకోవడం వల్ల వచ్చిన సమస్యలు ఉన్నాయా అని తెలుసుకుంటారు. ఉంటే... వీరికి  పుట్టే పిల్లలకు ఆ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో విశ్లేషణాత్మకంగా అంచనా వేస్తారు. వాటి ఆధారంగా రిస్క్ తీసుకోవచ్చా లేదా అనేది ఆ జంట నిర్ణయించుకోవచ్చు. అవసరమైతే ఆ జంట కొన్ని రక్తపరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇద్దరి సాధారణంగా వచ్చే జన్యుపరమైన సమస్యలను తెచ్చే జీన్స్ ఏమైనా ఉన్నాయా అనేది తెలుసుకోడానికి జెనెటిక్ టెస్టింగ్ చేస్తారు. అయితే ఎన్ని పరీక్షలు చేసినా వారికి ఏ సమస్యా రాదనో, వస్తుందనో నిర్ధారణగా చెప్పడం కష్టం. ఒకవేళ పెళ్లి తప్పనిసరిగా చేసుకోవాలని నిర్ణయించుకుంటే పైకి కనిపించే (ఆటోజోమల్ డామినెంట్) సమస్యలు వస్తాయని తెలిసినప్పుడు ఆ పెళ్లిని తప్పించడమే మేలు.
 
 పెళ్లి తర్వాత: పెళ్లి తర్వాత కూడా జెనెటిక్ కౌన్సెలింగ్‌కు వెళ్లి పైన చెప్పినవి పాటించవచ్చు. గర్భందాల్చడానికి మూడు నెలల ముందునుంచే ఫోలిక్‌యాసిడ్ మాత్రలు రోజుకు ఒకటి చొప్పున తీసుకోవడం మంచిది.
 
గర్భం వచ్చిన తర్వాత: పిల్లల్లో ఏ సమస్యా రాకుండా ఉండేందుకు ఏమీ చేయలేం. ఎందుకంటే అవి జన్యుపరంగా సంక్రమించేవి కాబట్టి. కాకపోతే కొన్ని గుర్తించదగిన సమస్యలను ముందుగానే పసిగట్టడం వల్ల, పుట్టిన తర్వాత చెయ్యగలిగిన చికిత్సలు ఏవైనా ఉంటే వాటికి తక్షణమే సన్నద్ధమయ్యేలా జాగ్రత్త తీసుకోవచ్చు. లేదా లోపల ఉన్న సమస్య మెదడుకు సంబంధించినదీ లేదా ఎప్పటికీ సరిచేయలేనిదని తెలిస్తే గర్భస్రావం (ఐదు నెలల లోపల) చేయించుకోవడం వంటి అంశాలను ఆలోచించవచ్చు. లేదంటే పుట్టిన తర్వాత ఆ పిల్లలతో జీవితాంతం బాధపడాల్సిన అవసరం ఉంటుంది. మేనరికం పెళ్లిళ్ల వల్ల తప్పనిసరిగా ఆరోగ్య సమస్యలు వచ్చి తీరతాయని నిర్ధారణగా చెప్పలేకపోయినా... వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ అని మాత్రం నిర్ధారణగా చెప్పవచ్చు.
 
గుర్తుంచుకోండి

మేనరికపు పెళ్లిళ్ల వల్ల పుట్టే పిల్లలకు వచ్చే అవయవలోపాలను రాకుండా చేసేందుకు గర్భంతో ఉన్నప్పుడే ఇచ్చే మందులు, చేసే ఇంజెక్షన్లు ఉన్నాయని చాలామంది అనుకుంటారు. కానీ అది కేవలం అపోహ మాత్రమే. ఇక మేనరికపు వివాహాల వల్ల పిల్లలకు అవకరాలు వచ్చే అవకాశాలు ఎక్కువ కాబట్టి ఆస్తి కోసం అలాంటి వాటిని చేసుకుని... సంక్రమించిన ఆస్తిని పిల్లలను బాగు చేయడానికంటూ వ్యయం చేసుకోవడం కంటే... ఆరోగ్యకరమైన బిడ్డలు పుట్టడమే అన్నిటికంటే ఉత్తమమైన ఆస్తి అని గుర్తుంచుకోండి. బయటి సంబంధాలను చేసుకోవడమే అన్నివిధాలా ఉత్తమం. కాకపోతే సంబంధం మంచిదా, కాదా అని నిర్ధారణ చేసుకోవడం ఒక్కటే ఈ విషయంలో పాటించాల్సిన జాగ్రత్త. మేనరికపు వివాహం తర్వాతి పరీక్షలతో పోలిస్తే అది సులభం కూడా.
 - నిర్వహణ: యాసీన్
 
సంబంధాల దగ్గరితనం... వాటి వర్గీకరణ ఇలా
 

తల్లిదండ్రులు - వారి పిల్లలు    మొదటి డిగ్రీ సంబంధం
తోబుట్టువులు - మేనమామ, మేనత్త    రెండో డిగ్రీ సంబంధం
మేనమామ పిల్లలు, మేనత్త పిల్లలు     మూడో డిగ్రీ సంబంధం
తాత అన్నదమ్ముల పిల్లల పిల్లలు (మనవలు)    నాలుగో డిగ్రీ సంబంధం
 
డాక్టర్ వి. శోభ సీనియర్ గైనకాలజిస్ట్,  లీలా హాస్పిటల్స్, మోతీనగర్, హైదరాబాద్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement