సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కాంగ్రెస్ రాజకీయాలు ఆ పార్టీ శ్రేణులకే అంతుచిక్కడం లేదు. రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను మట్టి కరిపించేందుకు కలిసికట్టుగా కృషి చేస్తామని కాంగ్రెస్ పెద్దలు పదే పదే చెబుతున్నా.. ఆచరణలో మాత్రం అది కానరావడం లేదు. అతి కీలకమైన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలు స్పష్టంగా వెలుగుచూశాయి. ఇటీవల ఉమ్మడి జిల్లాలో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో జైపాల్‌రెడ్డి వర్గం పూర్తిగా దూరంగా ఉండడంతో పాటు... ఆయన వర్గీయులుగా పేరు పడిన వారి నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించలేదు. ఇటీవల మూడు రోజుల పాటు ఉమ్మడి జిల్లాలో చేపట్టిన ప్రచారం మాజీ మంత్రి డీకే.అరుణ ఆధ్వర్యాన నడిపించారు. ప్రచార కార్యక్రమంలో జైపాల్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, చిన్నారెడ్డి పాల్గొనకపోవడం కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.
గెలుపే లక్ష్యంగా..
రాష్ట్రంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నట్లు పలు సర్వేల్లో వెల్లడైనట్లు చెబుతారు. పలు నియోజకవర్గాల్లో బలమైన నాయకత్వం, కేడర్ ఉండడంతో పార్టీ పటిష్టంగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. గత ఎన్నికల సందర్భంగా కూడా ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ మంచి ఫలితాలను సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్ హవా వీచినా... పాలమూరులో మాత్రం గట్టి పోటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో మరోసారి గట్టి పోటీ ఇచ్చి మెరుగైన స్థానాలు గెలుపొందాలని భావిస్తోంది. అందులో భాగంగా సీట్ల అంశంకొలిక్కి రాకపోయినా సరే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. అంతేకాదు ఆయా నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహించిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేస్తూ కాంగ్రెస్ కేడర్‌లో జోష్ నింపేందుకు యత్నించారు.
బట్టబయలైన గ్రూపులు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి పాలమూరులోని గ్రూపులు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఇప్పటికే జిల్లాలో సీనియర్ నేతలు డీకే అరుణ, జైపాల్‌రెడ్డి రెండు వర్గాలు విడిపోగా.. మిగిలిన నేతలు కూడా చీలిపోయి వేర్వేరుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయం పలు సందర్భాల్లో బహిర్గతం కాగా.. తాజా ఎన్నికల ప్రచారంలోనూ అదే ఒరవడి కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో సాగిన ప్రచారానికి కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డితో పాటు చిన్నారెడ్డి, రేవంత్‌రెడ్డి పూర్తి దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది.
జైపాల్‌రెడ్డి మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగిన ప్రచారంలో పాల్గొంటారని పలువురు చెప్పినా... ఆయన మాత్రం దూరంగా ఉన్నారు. అంతేకాదు ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న జి.చిన్నారెడ్డి సైతం ప్రచారం విషయంలో తనకేమీ పట్టనట్లు వ్యవహరించారు. ఇక రేవంత్‌రెడ్డి సైతం మూడు రోజుల ప్రచారంలో ఏ ఒక్క రోజు కూడా పాల్గొనలేదు. అంతేకాదు ఒకవైపు సొంత జిల్లాలో ఎన్నికల ప్రచారం జరుగుతుంటే రేవంత్ మాత్రం... నిజామాబాద్, కరీంనగర్ తదితర జిల్లాల్లో చేపట్టిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం గమనార్హం.
ఆ నియోజకవర్గాలకు దూరం..
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన ప్రచారం తీరుపైనా ఉమ్మడి జిల్లాలో చర్చ జరుగుతోంది. మొత్తం 14 నియోజకవర్గాలకు గాను షాద్‌నగర్ పూర్తిగా రంగారెడ్డి జిల్లాలోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో 13 అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించాల్సి ఉండగా... కేవలం 9 నియోజకవర్గాల్లో మాత్రమే సాగింది. ఇందులో నాగర్‌కర్నూల్‌లో మాత్రం నాగం జనార్ధన్‌రెడ్డి పెద్ద కుమారుడు మృతి కారణంగా వాయిదా వేశారు. ఇక మిగిలిన మూడింట్లో ప్రచార రథం అడుగుపెట్టకపోవడం కాంగ్రెస్ శ్రేణుల్లో నిరాశకు గురి చేసింది. ముఖ్యంగా ఏఐసీసీ కార్యదర్శి జి.చిన్నారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వనపర్తి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్, మరో ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డి నియోజకవర్గమైన కల్వకుర్తిలో ఎన్నికల ప్రచారం నిర్వహించలేదు.
వనపర్తి నియోజకవర్గానికి పక్కనే ఉండే దేవరకద్ర, కొల్లాపూర్‌లో ఎన్నికల ప్రచారం జరిగినా.. చిన్నారెడ్డి నియోజకవర్గంలో మాత్రం అడుగుపెట్టలేదు. అలాగే రేవంత్ విషయంలో అలాగే జరిగింది. ఇక కల్వకుర్తి ఎన్నికల ప్రచారంలో అనేక ట్విస్ట్‌లు నెలకొన్నాయి. మొదట్లో కల్వకుర్తిలో రోడ్డుషోలు ఉండేలా ప్రణాళిక రూపొందించారు. కానీ ఆఖరి క్షణంలో వంశీచంద్‌రెడ్డి రద్దు చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పార్టీ సీనియర్ నేత ఎస్.జైపాల్‌రెడ్డి అందుబాటులో లేరన్న ఒకే కారణంతో కల్వకుర్తిలో ప్రచారాన్ని నిలిపేయడాన్ని బట్టి చూస్తే పార్టీలో గ్రూపు తగాదాలు ఏ మేరకు కొనసాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment