
తుమ్మలకు ‘నామా’లు!
ఎంపీ ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఎమ్మెల్యే వర్గం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లా తెలుగుదేశం పార్టీలో ముఠా తగాదాలు మరోసారి బట్టబయలయ్యాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అవుతున్న తరుణంలో తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం అధినేత చంద్రబాబు నాయకుడు సమక్షంలో శనివారం హైదరాబాద్‌లో జరిగిన పార్టీ పదిజిల్లాల స్థాయి సమావేశానికి, అనంతరం జరిగిన జిల్లా పార్టీ సమీక్షా సమావేశానికి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గం డుమ్మా కొట్టింది. స్వయంగా తుమ్మలతో పాటు ఆయన ప్రధాన అనుచరుడు సండ్ర వెంకటవీరయ్య, ఇతర నాయకులు ఈ సమావేశాలకు హాజరుకాలేదు. జ్వరం వచ్చిందని తుమ్మల, తోడల్లుడి కర్మ పేరుతో వెంకటవీరయ్యలు వెళ్లలేదు. తుమ్మల వర్గం నుంచి ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మాత్రమే హాజరయ్యారు.
మరోవైపు ఎంపీ నామా నాగేశ్వరరావు వర్గం ఈ సమావేశాల్లో హవా నడిపించింది. ఆయన వర్గానికి చెందిన పార్టీ జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావుతో పాటు ముఖ్య నేతలంతా సమావేశాలకు వెళ్లారు. ఇల్లెందు ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య మాత్రం ఇలా వచ్చి అలా వెళ్లిపోయారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కీలక సమావేశానికి తుమ్మల వర్గం డుమ్మా కొట్టడం వెనుక కారణాలు లేకపోలేదని పార్టీ వర్గాలంటున్నాయి. ఒకప్పుడు జిల్లా పార్టీలో వెలుగొందిన తుమ్మలను అన్ని రకాలుగా అణగదొక్కేందుకు ఎంపీ నామా ప్రయత్నాలు చేయడం.. ఇందుకు స్వయంగా పార్టీ అధినేత సహకారం అందిస్తున్న కారణంగా తాము పార్టీలో సరిగా ఇమడలేకపోతున్నామని తుమ్మల వర్గీయులంటున్నారు.
పట్టుకోసం ఎత్తులు....
పార్టీలో ఆధిపత్యం కోసం, తుమ్మల నాగేశ్వరరావుపై పట్టు సాధించేందుకు పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా పనిచేస్తున్న నామా నాగేశ్వరరావు ఇటీవలి కాలంలో తన దూకుడును మరింత పెంచారు. పార్టీ అధినేతతో ఉన్న ‘సంబంధాల’తో వీలుంటే ప్రత్యక్షంగా, లేదంటే పరోక్షంగా తుమ్మల వర్గంతో సై అంటే సై అన్నారు. ఒక దశలో తుమ్మల ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం నియోజకవర్గం నుంచి కూడా తన మార్కు నిరూపించుకునేందుకు నామా పెద్ద ప్రణాళికనే రూపొందించారు. అవసరమైతే తుమ్మలకు పోటీగా ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థిగా తన వర్గీయుడి పేరును కూడా ఆయన పార్టీల పెద్దల వద్ద ప్రస్తావనకు తెచ్చినట్లు తెలిసింది. ఇక, తుమ్మల వర్గం బలంగా ఉన్న పాలేరు నియోజకవర్గంలో కూడా ఆయన చేయని ప్రయత్నం లేదు. తన వర్గానికి చెందిన మద్దినేని బేబీ స్వర్ణకుమారిని ఏకంగా పార్టీ అభ్యర్థిగానే ప్రకటించేసి పెద్ద దుమారమే సృష్టించారు. దీనికి తోడు పుండు మీద కారం చల్లినట్లు తుమ్మల వర్గానికి చెందిన ముగ్గురు నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు. దీంతో తుమ్మల వర్గం నామా ఆధిపత్యంపై ప్రత్యక్ష పోరాటానికే దిగింది. పాలేరుకు చెందిన దాదాపు 200 మంది కార్యకర్తలు పార్టీ జిల్లా కార్యాలయానికి వచ్చి పార్టీ అధ్యక్షుడు కొండబాలతో వాదనకు దిగారు. నామా ఇంటి ముందు టెంట్ వేస్తామని హెచ్చరించడంతో సస్పెన్షన్‌లను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.
ఇక తుమ్మల సొంత నియోజకవర్గంలో కూడా నామా తనదే పైచేయి అని చూపించుకునే ప్రయత్నం చేశారు. తుమ్మల సొంత మండలానికే చెందిన నాగప్రసాద్ అనే వ్యాపారవేత్తను తెరపైకి తెచ్చారు. హంగూ, ఆర్భాటాలతో పార్టీలో చేర్చించి పాలేరు తుమ్మల వర్గం అభ్యర్థి అయిన బాలసానికి పోటీగా నిలిపారు. అదే విధంగా సత్తుపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సండ్ర వెంకటవీరయ్య అనుచరులను కూడా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారు. మొత్తం మీద తుమ్మలతో పాటు ఆయన ప్రధాన అనుచరులుగా ఉన్న ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణలను కూడా బలహీనపరచడం ద్వారా పూర్తిగా జిల్లాలో తన హవా మాత్రమే ఉండాలనే రీతిలో నామా వేసిన ఎత్తులు ఇరు వర్గాల మధ్య తీవ్ర విభేదాలను రగిలించాయి.
పూలమ్మిన చోటే.....
ఇక ఒకప్పుడు జిల్లాలో టీడీపీ అంటేనే తుమ్మల... తుమ్మల అంటేనే టీడీపీ అనే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం ఆ చిత్రం మారిపోయింది. నామా నాగేశ్వరరావు రూపంలో తుమ్మలకు జిల్లాలో గట్టి పోటీ ఎదురవుతోంది. ఆర్థికంగా, సామాజికంగా, ఇతర కోణాల్లో కూడా నామా తనదైన శైలిలో ముందుకెళుతూ తుమ్మలను వెనక్కు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ వర్గాల నుంచి కూడా నామాకు పెద్ద ఎత్తున సహకారం అందుతున్నట్లు ప్రచారం. జిల్లాలో పార్టీ అభివృద్ధి కోసం శ్రమించిన తుమ్మలను వీలున్నంత వరకు వాడుకుని ఆ తర్వాత తనకు ‘అన్ని రకాలుగా’ ఉపయోగపడే నామా దొరకడంతో ఇప్పుడు ఆయనను చంద్రబాబు పక్కనపెడుతున్నారని, నామాపై తుమ్మల వర్గం చేస్తున్న ఫిర్యాదులను అసలు పట్టించుకునే పరిస్థితి కూడా లేదని తుమ్మల వర్గీయులు వాపోతున్నారు. రానురాను తుమ్మల పేరే పార్టీలో కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందని, ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే తమ దారి తాము చూసుకోవాల్సి వస్తుందని, అంతా నామా నాగేశ్వరరావు పెత్తనమే ఉంటే ఇక పార్టీలో తామెందుకు ఉండాలని వారంటున్నారు. ఈ పరిస్థితుల్లో రానున్న ఎన్నికలను పార్టీ ఎలా ఎదుర్కొంటుందో, గ్రూపు గొడవలతో ఎలా గట్టెక్కుతుందోనన్న ఆవేదన సగటు తెలుగు తమ్ముళ్లలో వ్యక్తమవుతోంది.