ఈ రక్తపాతానికి బాధ్యులెవరు? | why violence in kerala | Sakshi
Sakshi News home page

ఈ రక్తపాతానికి బాధ్యులెవరు?

Published Fri, Aug 4 2017 3:11 PM | Last Updated on Mon, Aug 13 2018 8:12 PM

why violence in kerala



తిరువనంతపురం:
ఇక్కడికి సరిగ్గా 20 కిలోమీటర్ల దూరంలో ఉంది కల్లమ్‌పల్లి. ఊర్లోకి అడుగుపెట్టగానే ఎవరికో నివాళిగా విద్యుత్‌ స్తంభాలకు నల్ల జెండాలు కనిపిస్తాయి. పక్కనే గోడల మీద 34 ఏళ్ల ఎస్‌ఎల్‌ రాజేష్‌కు నివాళి అర్పిస్తూ పోస్టర్లు అతికించి ఉన్నాయి. కల్లమ్‌పల్లి ఆరెస్సెస్‌ వార్డు శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న రాజేష్‌ను జూలై 29వ తేదీన 12 మంది సభ్యుల బృందం నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపింది. ఆయన ఒంటిపై 83 గాయాలను పోలీసులు గుర్తించారు. అలా నల్లజెండా, ఓ పోస్టర్‌ అతికించిన గోడకు సమీపంలో తెలుపు, నీలి రంగులో కనిపించే ఓ ఇంటిలో తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలతో రాజేష్‌ నివసించేవాడు.

ఆ ఇంటికి ఓ మూలన విషాధ వదనంతో రాజేష్‌ తండ్రి సుదర్శన్‌ కూర్చొని ఉన్నారు. ఆయన్ని మీడియా వెళ్లి పలకరించగా ‘నా కుమారుడి చేతులను హంతకులు ముక్కలు ముక్కలుగా నరికేశారు. ప్రాణాపాయం స్థితిలో ఉన్న నా కుమారుడిని ఆస్పత్రికి తరలించేందుకు, వాడి అవయవాలను పట్టుకెళ్లేందుకు పోలీసులకు దుప్పట్లు కావాల్సి వచ్చింది. ముక్కలు, ముక్కలుగా తెగిన చేతులతో అప్పుడు మా వాడు ఎంత నరకం అనుభవించాడో చెప్పలేను’ అంటూ కన్నీరు మున్నీరయ్యారు.

‘నా కుమారుడు చిన్న వయస్సులో ఇంటి బరువు బాధ్యతలు నెత్తికెత్తుకున్నారు. నేను చాలా ఏళ్లపాటు సౌదీ అరేబియాలో భవన నిర్మాణ కార్మికుడిగా పని చేశాను. కానీ పెద్దగా సంపాదించలేకపోయాను. నా పరిస్థితిని అర్థం చేసుకున్న రాజేష్‌ తన మాధ్యమిక విద్యాభ్యాసం ముగియగానే ఇంటిల్లి పాదిని పోషించడానికి పనిలో స్థిరపడ్డారు’ అని చెప్పిన ఆ 60 ఏళ్ల వద్ధుడు వెక్కివెక్కి ఏడిస్తూ  ఇంకేమీ మాట్లాడలేక పోయారు. ఆ ఇంట్లో మరో గదిలో రాజేష్‌ భార్య ఇద్దరు చిన్న పిల్లలను పట్టుకొని శూన్యంలోకి చూస్తూ కూర్చొని ఉంది. మీడియా ప్రతినిధులెవరూ ఆమెను పలకరించేందుకు సాహసించలేదు. బయట వేసిన టెంట్‌ కింద 30 మంది ఆరెస్సెస్‌ కార్యకర్తలు కూర్చొని ఉన్నారు. వారంతా రాజేష్‌ హత్య గురించే మాట్లాడుకుంటున్నారని తెలుస్తోంది. బయటకు వినిపించకుండా గుసగుసగా మాట్లాడుకుంటున్నారు.


రాజేష్‌ హత్యకు దారితీసిన పరిస్థితులు
సంఘ్‌ పరివార్, పాలకపక్షమైన సీపీఎం పార్టీ విద్యార్థి విభాగం మధ్య జూలై 18వ తేదీన తలెత్తిన ఉద్రిక్తతలే రాజేష్‌ హత్యకు దారితీశాయి. భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న అఖిల భారత విద్యార్థి పరిషద్‌ విద్యార్థులు సిటీ కాలేజీకి వెళ్లి కాలేజీ ఆవరణలోని ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థుల జెండాలను కూల్చేశారు. జూలై 24వ తేదీన ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు ర్యాలీగా కాలేజీకి వెళ్లి కొత్తగా మరో పది జెండాలను ఎగురవేశారు. దీంతో రెండు విద్యార్థి సంఘాల మధ్య ఉద్రిక్తలు పెరిగాయి. ఈ నేపథ్యంలో సీపీఎం కార్యకర్తలు జూలై 28వ తేదీన బీజేపీ రాష్ట్రపార్టీ కార్యాలయంపై దాడి చేశారు. ఆ సమయంలో కార్యాలయంలోఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మనం రాజశేఖరన్‌ దాడి నుంచి తప్పించుకొని పారిపోయారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే బీజేపీ, ఏబీవీపీ, ఆరెస్సెస్‌ కార్యకర్తలు ఓ బృందంగా ఏర్పడి కేరళ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కొడియేరి బాలకష్ణన్‌ కుమారుడి ఇంటిపై దాడి చేశారు. బీభత్సం సష్టించారు. ఆయన కుమారుడు గాయాలతో బయట పడినట్లు తెల్సింది.

ఆ మరుసటి రోజు, అంటే జూలై 29వ తేదీన రాత్రి 8.45 గంటలకు దళితుడైన రాజేష్‌ శాఖా కార్యక్రమం ముగించుకొని ఇంటికి వస్తుండగా 12 మంది సభ్యులుగల బృందం ఆయనపై దాడి చేసింది. తీవ్ర గాయాలతో ఆయన ఆస్పత్రిలో మరణించారు. సీపీఎం నాయకులే ఈ హత్యకు కుట్రపన్ని అమలు చేశారని సంఘ్‌ పరివార్‌ సభ్యులు ఆరోపించారు. ఆ మరుసటి రోజు జూలై 30వ తేదీన సీపీఎం నాయకుడు బాలకృష్ణన్, తిరువనంతపురంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి హత్యను ఖండించారు. ఆ హత్యతో సీపీఎంకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. 31వ తేదీన రాజేష్‌ హత్య కేసులో మొత్తం 12 మంది నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారిలో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న మణికుట్టన్‌ ఉన్నారు. ఆయన ఇంతకుముందు రెండుసార్లు జైలుకెళ్లి వచ్చిన రౌడీ షీటర్‌. మిగిలిన వారిలో ఇద్దరికి మాత్రమే సీపీఎంతో సంబంధాలు ఉన్నాయి. వారిలో ఒకరు సీపీఎంకు అనుబంధమైన సీఐటీయు క్రియాశీలక సభ్యుడుకాగా, డెమోక్రటిక్‌ యూత్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా క్రియాశీలక సభ్యుడు మరొకరు. బీజేపీ, సీపీఎం పార్టీల మధ్య తలెత్తిన ఘర్షణ పరిస్థితులే రాజేష్‌ హత్యకు దారితీశాయని ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు.



కేరళలో రాజకీయ హింసాకాండ కొనసాగడం ఇప్పుడే కొత్తకాదు. కొన్ని దశాబ్దాలుగా బీజేపీ, వామపక్ష పార్టీలకు మధ్య హత్యలు, ప్రతీకార హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంతకుముందు కన్నూర్‌ జిల్లాలో ఎక్కువగా జరిగేవి. ఉత్తర కేరళాకు మాత్రమే పరిమితం అయ్యాయి. ఇప్పుడు రాజధాని పరిసర ప్రాంతాలకు కూడా విస్తరించాయి. కేరళలో 9.8 శాతం మంది దళితులు ఉన్నారు. మొదటి నుంచి సీపీఎం, ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీల ప్రభావం ఎక్కువగా ఉంటూ వస్తోంది. కల్లమ్‌పల్లిలో కూడా దళితులే ఎక్కువగా నివసిస్తున్నారు. వారిపై సీపీఎం ప్రభావమే ఎక్కువగా ఉంది. వారిపై పట్టు సాధించేందుకు బీజేపీ ఇప్పుడిప్పుడే కషి చేస్తోంది. బీజేపీ ప్రోద్బలంతో రాజీష్‌  గత ఫిబ్రవరి నెలలోనే అక్కడ ఆరెస్సెస్‌ శాఖను ఏర్పాటు చేశారు. ఇప్పుడిప్పుడే దళిత యువత ఆరెస్సెస్‌ శాఖకు ఆకర్షితులవుతున్నారు. ఈ కారణంగానే ఇరు పార్టీల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని, అవి ఘర్షణలకు దారితీస్తున్నాయని తిరువనంతపురంలో ‘దళిత్‌ రైట్స్‌ అకాడమిక్‌ రీసర్చ్‌ ఇన్షియేటివ్‌’ సంస్థ డైరెక్టర్‌ వీబీ అజయ్‌ కుమార్‌ అభిప్రాయపడ్డారు. ఏ పార్టీ ప్రాబల్యం కోసం ప్రయత్నించినా సామాజిక అభివృద్ధికి నోచుకోని దళితులే బలవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement