
విభేదాలు బట్టబయలు
తెలుగుదేశంపార్టీలో మంత్రి పరిటాల సునీత, ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి.
– పరిటాల సునీత వర్సెస్ వరదాపురం సూరి
– సీఎం పర్యటనలో ఫ్లెక్సీలపై కనిపించని మంత్రి సునీత ఫొటోలు
– ధర్మవరం బ్రాంచ్ కెనాల్ విభేదాల నేపథ్యంలో ఫొటోలపై సూరి నిషేధం!
సాక్షిప్రతినిధి, అనంతపురం : తెలుగుదేశంపార్టీలో మంత్రి పరిటాల సునీత, ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇన్నిరోజులు ఇద్దరి మధ్య అంతర్గతంగా ఉన్న విభేదాలు శనివారం ధర్మవరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా బట్టబయలయ్యాయి. ముఖ్యమంత్రి రాకను స్వాగతిస్తూ ధర్మవరంలో హెలిప్యాడ్ నుంచి సభా వేదిక వరకూ భారీ సంఖ్యలో రోడ్లకు ఇరువైపులా ఎమ్మెల్యే అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీలో ఎక్కడా మంత్రి సునీత ఫొటో కన్పించలేదు. కేవలం పల్లె రఘునాథరెడ్డి ఫొటో మాత్రమే కన్పించింది. సునీత ఫొటోలు కన్పించకపోయేందుకు వారిద్దరి మధ్య కొద్దిరోజులుగా నడుస్తున్న అంతర్గత విభేదాలకు తోడు ఇటీవల ధర్మవరం బ్రాంచ్ కెనాల్ అంశంలో భేదాభిప్రాయాలు వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ కాలువ ఆధునికీకరణకు 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకుంది. దీని కోసం రూ.13.11 కోట్లు కేటాయించారు. ఈ పనుల్ని 2008– 09లో రత్నా ఇన్‌ఫ్రా ప్రారంభించింది. తర్వాత ఈ పనులు అనివార్య కారణాలతో నిలిచిపోయాయి. ఈక్రమంలో ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.32.94కోట్లకు టీడీపీ ప్రభుత్వం పెంచింది. ఈ పనులు దక్కించుకునేందుకు ఇరువర్గాలు ఎవరికివారు తీవ్ర ప్రయత్నాలు చేశారు. తమ నియోజకవర్గంలోనూ కొంతమేర కాలువ ఉంటుంది కాబట్టి పనులు తమకే ఇవ్వాలని సునీత వర్గీయులు, లేదు పనులు మంజూరు చేయించింది సూరి కాబట్టి తమకే పనులు కావాలని సూరీ వర్గీయులు పట్టుబట్టారు. ఈ అంశం అధికారులకు కూడా తలనొప్పిగా మారింది.
చంద్రబాబు పర్యటన సందర్భంగా శనివారం ఈ పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉంది. ఈ క్రమంలో శుక్రవారం ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు సునీత ధర్మవరం వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, సునీత ఎదురుపడినా మాట్లాడుకోలేదు. శంకుస్థాపన పనులు వాయిదా వేయాలని సునీత అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. తన నియోజకవర్గంలో పనులు తాను చెప్పినట్లు జరగాలని, సునీత చెప్పినట్లు నడుచుకుంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని సూరి అధికారులను హెచ్చరించినట్లు తెలిసింది. వెరసి ఈ తతంగం ఇటు టీడీపీతో పాటు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది.
ఫ్లెక్సీల్లో ఫొటోపై కచ్చితమైన ఆదేశాలు : ఈ క్రమంలో ఫ్లెక్సీల్లో మంత్రి సునీత ఫొటోలు ప్రచురించకూడదని ఎమ్మెల్యే సూరితో పాటు ఆయన వర్గీయులు నిర్ణయించుకున్నారు. దీంతోనే సభావేదికపై ప్రోటోకాల్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మినహా తక్కిన ఏ ఒక్క ఫ్లెక్సీలో కూడా ఆమె ఫొటో ప్రచురించలేదు.