సాక్షిప్రతినిధి, వరంగల్: ఓరుగల్లు కాంగ్రెస్‌లో వర్గ పోరు తారస్థాయికి చేరింది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో నేతల మధ్య నెలకొన్న గందరగోళం పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తోంది. పార్టీలోని అంతర్గత ప్రజాస్వామ్యంతో హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్, జనగామ జిల్లా మాజీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి మధ్య పొలిటికల్ వార్ సాగుతోంది. వ్యక్తిగత విమర్శలతోపాటు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని జంగాను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించి.. సస్పెండ్ చేస్తూ సోమవారం అధిష్టానానికి సిఫార్సు చేశారు నాయిని రాజేందర్‌రెడ్డి. జంగా తానేమీ తక్కువ కాదన్నట్లు తనను సస్పెండ్ చేసే అధికారం నాయినికి లేదంటూ, అవసరమైతే ఆయననే సస్పెండ్ చేస్తున్నట్లు జంగా ప్రకటించి పార్టీకి లేఖ రాయనున్నట్లు మీడియా సమావేశంలో ప్రకటించారు.
రచ్చకెక్కిన కాంగ్రెస్ రాజకీయం
పకడ్బందీ వ్యూహంతో పార్టీ అధిష్టానం ముందడుగు వేస్తుంటే.. పార్టీలో నెలకొన్న అంతర్గత ప్రజాస్వామ్యం, నేతల మధ్య గ్రూప్ రాజకీయాలు పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఉమ్మడి వరంగల్‌లో ఈ పరిస్థితి నాలుగైదు నియోజకవర్గాల్లో ఉన్నా.. అందుకు మొదటగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం వేదికగా మారింది. రాజకీయ జగడం నాయిని వర్సెస్ జంగా అన్నట్లు సాగుతోంది. పలుమార్లు ప్రయత్నించినా చివరి నిమిషంలో టికెట్ దక్కని నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ దక్కించుకోవడమే లక్ష్యంగా రాజేందర్‌రెడ్డి పని చేస్తున్నారు. ఇదే సమయంలో 2018లో పాలకుర్తి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన జంగా రాఘవరెడ్డి కూడా ఈసారి ఇక్కడి నుంచే పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఇద్దరు నేతలు పోటాపోటీగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. హాథ్ సే హాథ్ జోడో యాత్ర కూడా వేర్వేరుగా చేస్తున్నారు.
పోటాపోటీ ప్రెస్‌మీట్లు.. కాంగ్రెస్ శ్రేణుల్లో కలవరం
సోమవారం జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు ఉండగా.. కాజీపేటలో జంగా రాఘవరెడ్డి పోటీ నిరసన దీక్ష చేపట్టడం కలవరం సృష్టిస్తోంది. డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి దీనిని తీవ్రంగా పరిగణిస్తూ జంగా రాఘవరెడ్డిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తూ సస్పెన్షన్‌కు పార్టీ అధిష్టానానికి సిఫార్సు చేశారు. నాలుగేళ్లలో 20 సార్లు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశానని, జంగాపై చర్యలు తీసుకోని పక్షంలో తాను నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
దీనిపై స్పందించిన జంగా రాఘవరెడ్డి కాజీపేటలో మీడియాతో మాట్లాడుతూ ‘కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేసే అధికారం డీసీసీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డికి లేదు.. ఆయననే నేను సస్పెండ్ చేస్తూ అధిష్టానానికి లేఖ రాస్తున్నా..’ అంటూ వ్యక్తిగత ఆరోపణలు చేశారు. తాను స్థానికుడినని.. రాజేందర్‌రెడ్డి కాదని.. ఎట్టి పరిస్థితుల్లో వరంగల్ పశ్చిమలో పోటీ చేసి తీరుతానని స్పష్టం చేశారు. కాగా.. తాజా ఘటనపై టీపీసీసీ ముఖ్యులు ఆరా తీయడం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment