పట్టు వీడని ‘అసమ్మతి’
- ‘పురం’ టీడీపీలో కొనసాగుతున్న విభేదాలు
- పీఏ శేఖర్ మద్దతుదారులపై ‘అసమ్మతి’ నేతల గురి
- చిలమత్తూరు, లేపాక్షి ఎంపీపీలను తొలగించాల్సిందేనంటూ పట్టుబట్టిన వైనం
-రాజీ యత్నాలను కొనసాగించిన పార్టీ పరిశీలకుడు
హిందూపురం అర్బన్ : హిందూపురం నియోజకవర్గ టీడీపీ నేతల్లో విభేదాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే బాలకృష్ణఽ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) శేఖర్‌ను తొలగించాలంటూ పట్టుబట్టి పంతం నెగ్గించుకున్న మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, అంబికా లక్ష్మీనారాయణ, వారి వర్గీయులు.. ఇప్పుడు పీఏ వర్గంగా ముద్ర వేసుకున్న చిలమత్తూరు, లేపాక్షి ఎంపీపీలపై దృష్టి పెట్టారు. పీఏ అడుగులకు మడుగులొత్తడంతో పాటు ప్రతి పనిలో కమీషన్లు, పర్సెంటేజీలు వసూలు చేసిన ఆయన వర్గీయులపైనా వేటు వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లేపాక్షి, చిలమత్తూరు మండలాల్లోని అసమ్మతి నాయకులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు వరుస సమావేశాలు నిర్వహించారు.
ఆ ఇద్దరు ఎంపీపీలను పదవుల నుంచి తొలగిస్తేనే పార్టీలో ప్రక్షాళన జరిగినట్లు అవుతుందని అసమ్మతి వాదులు చెబుతున్నారు. లేపాక్షి ఎంపీపీ హనోక్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రూ.2 కోట్లతో ఇల్లు కట్టాడని, ప్రతి పనిలో పర్సెంటేజీలు తీసుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. చిలమత్తూరు ఎంపీపీ నౌజియాబాను మరిది అన్సార్ కూడా అవినీతిలో మునిగిపోయారని విమర్శిస్తున్నారు. ఇదిలావుండగా.. ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గానికి వచ్చేలోపు పార్టీ నేతలందరూ ఏకం కాకుంటే చర్యలు తప్పవని పార్టీ సంస్థాగత ఎన్నికల పరిశీలకుడిగా వచ్చిన కృష్ణమూర్తి నాయకులను హెచ్చరించినట్లు సమాచారం. ఆయన మూడురోజులుగా నియోజకవర్గ టీడీపీ నాయకులను వేర్వేరుగా కలిసి ప్రస్తుత పరిణామాలపై ఆరా తీస్తున్నారు.
అందరినీ సమన్వయ పరచడానికి ప్రయత్నాలు సాగిస్తున్నా.. నాయకులు మాత్రం తమ డిమాండ్లు చెబుతున్నారు తప్ప సర్దుకుపోయే పరిస్థితి కనిపించడం లేదు. శుక్రవారం ఉదయం లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన అనంతరం ఆయన స్థానిక టీడీపీ నాయకులతో ఎమ్మెల్సీ ఎన్నికలపై సమాలోచనలు చేశారు. ప్రస్తుతం పార్టీలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయని, సర్దుకుపోవాలని సూచించారు. బాలకృష్ణ ఆదేశాల మేరకే తాను హిందూపురం వచ్చినట్టు చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీపీ హనోక్, ఎంపీటీసీ సభ్యులు చలపతి, చిన్న ఓబన్న తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత చిలమత్తూరులో మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, టీడీపీ నాయకులతో భేటీ అయ్యారు. మరవకొత్తపల్లి బీసీ కాలనీ సమీపంలో జెడ్పీటీసీ సభ్యుడు లక్ష్మీనారాయణరెడ్డి వర్గీయులతో మాట్లాడారు. కొడికొండ గ్రామంలో ఎంపీపీ నౌజియాబాను వర్గీయులను కలిశారు. గ్రూపు రాజకీయాలు, అసమ్మతి సమావేశాలు మానుకోవాలని హితవు పలికినట్లు తెలిసింది.