హొసూరు:క్రిష్ణగిరి జిల్లాలో అధికార అన్నాడీఎంకే పార్టీలో గ్రూప్ రాజకీయాలు భగ్గుమంటున్నాయి. ఒకే పార్టీకి చెందిన వారు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. మున్సిపల్ సమావేశంలో ఒకే పార్టీకి చెందిన కౌన్సిలర్లు ముష్టి యుద్ధానికి పాల్పడుతున్నారు. జిల్లాలో అన్నాడీఎంకేలో రెండు గ్రూపులు ఉన్నాయి. వాటికి మాజీ మంత్రి కేపీ మునిస్వామి, ప్రస్తుత పార్లమెంట్ డెప్యూటి స్పీకర్ తంబిదురై ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేపీ మునిస్వామి మంత్రిగా ఉన్నంతవరకు ఆ వర్గానిదే జిల్లాలో పై చేయిగా ఉండేది. పార్లమెంటు ఎన్నికల అనంతరం మంత్రి పదవి కోల్పోవడంతో ఆయన వర్గీయులకు జిల్లాలో చుక్కెదురైంది. జిల్లా అన్నాడీఎంకే కార్యదర్శిగా తంబిదురై వర్గీయులైన గోవిందరాజుకు పదవి కట్టబెట్టారు.
జిల్లాలో మాజీ మంత్రి కేపీ మునిస్వామి వర్గీయుల్లో క్రిష్ణగిరి మున్సిపల్ చైర్మన్ తంగముత్తు కూడా ఉన్నారు. తంగముత్తుకు వ్యతిరేక వర్గం పార్టీలోనే సమస్యలను రాజేస్తున్నారు. మున్సిపల్ సమావేశాల్లో స్వంత పార్టీ కౌన్సిలర్లే రెండు సమావేశాల నుంచి సమస్యలను లేవనె త్తుతూ బాహాబీహ కి దిగారు. కుర్చీలు, బల్లలు ధ్వంసం చేశారు. పార్టీలో కుమ్ములాట జరుగుతున్నా జిల్లా కార్యదర్శిగా గోవిందరాజు పట్టించుకోవడం లేదు. జిల్లాలో రెండు వర్గాలు కొట్లాడుకోవడంతో అధిష్టానం సీరియస్ అయ్యింది. సోమవారం ఇరువర్గాల వారిని చెన్నైలో వివరణలు ఇచ్చుకోవాలని సూచించింది. దీంతో ఇరువర్గాల వారు చెన్నై బయలుదేరి వెళుతున్నారు. గ్రూప్ రాజకీయాలతో జిల్లాలో అధికార అన్నాడీఎంకే పరిస్థితి దిగజారుతోందని, వెంటనే సరిచేయాలని పార్టీ అభిమానులు కోరారు. ఇరువర్గాల వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని పరిశీలకులు భావిస్తున్నారు.
అన్నాడీఎంకేలో పెరుగుతున్న గ్రూపు రాజకీయాలు
Published Mon, Dec 1 2014 2:52 AM | Last Updated on Sat, Sep 2 2017 5:24 PM
Advertisement
Advertisement