ఒంగోలులో టిడిపి కార్యాలయం వద్ద ఎమ్మెల్యే ఆమంచి దిష్టి బొమ్మ దగ్ధం చేస్తున్న దృశ్యం
ఒంగోలు: టిడిపి కార్యకర్తలు ప్రకాశం జిల్లా చీరాల స్వతంత్ర శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ను వదిలిపెట్టడంలేదు. ఆయనను పార్టీలోకి రానివ్వకుండా శతవిధాలా అడ్డుపడుతున్నారు. ఆమంచి గెలిచిన రెండవ రోజు నుంచే టిడిపిలో చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి చీరాలలోని టిడిపి నేతలు, కార్యకర్తలు ఆమంచిని టీడీపీలోకి తీసుకోవద్దంటూ ఆందోళన మొదలు పెట్టారు. చీరాల, ఒంగోలు, హైదరాబాద్లలో ఆందోళనలు చేశారు. ఈ రోజు మళ్లీ ఒంగోలులోని జిల్లా టిడిపి కార్యాలయం ముందు పార్టీ కార్యకర్తలు ఆందోళన చేశారు. ఆమంచిని టీడీపీలోకి తీసుకోవద్దని నినాదాలు చేశారు. ఆమంచి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ప్రకాశం జిల్లా టిడిపి మినీ మహానాడులో ఈ విషయమై పెద్ద రభసే జరిగింది. ఆమంచికి వ్యతిరేకంగా టిడిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. నిన్న చీరాలకు చెందిన టిడిపి కార్యకర్తలు హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎక్కి ఆందోళన చేశారు. ఆమంచి కృష్ణమోహన్‌ను పార్టీలో చేర్చుకోవద్దని వారు డిమాండ్ చేశారు. మళ్లీ ఈరోజు ఒంగోలులో ఆందోళన చేశారు. టిడిపిలో చేరడానికి ఆమంచి ఎంత ప్రయత్నించినా కార్యకర్తలు మాత్రం ఆయన ప్రయత్నాలను తిప్పికొడుతూ చుక్కలు చూపిస్తున్నారు. ఆయనను పార్టీలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు.
చీరాల శాసనసభ స్థానం నుంచి టిడిపి తరపున పోటీచేసి ఓడిపోయిన పోతుల సునీత నిన్న హైదరాబాద్లో మాట్లాడుతూ నైతికంగా తనదే విజయం అని చెప్పారు. ఆమంచి కృష్ణమోహన్ను టీడీపీలో చేర్చుకోవద్దని పార్టీ అధిష్టానాన్ని ఆమె కోరారు. గతంలో ఆమంచి టీడీపీ కార్యకర్తలను దూరంగా ఉంచారని ఆమె ఆరోపించారు. ఆమంచి అవినీతిపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆయన అధికారులను మేనేజ్ చేశారని ఆమె ఆరోపించారు.