గొట్టిపాటి టీడీపీకి చెందిన వాడు కాదు : కరణం బలరాం
♦ కరణం, గొట్టిపాటి బాహాబాహీ
♦ ఇరువర్గాల సవాళ్లు, ప్రతి సవాళ్లు
♦ గొట్టిపాటిపై కరణం వర్గం దాడి
♦ తోపులాటలో కిందపడిపోయిన ఎమ్మెల్యే రవి
♦ రసాభాసగా టీడీపీ సమావేశం
సవాళ్లు.. ప్రతి సవాళ్లు, పరస్పర దాడులతో టీడీపీ జిల్లా సమావేశం దద్ధరిల్లింది. టీడీపీ జిల్లా అధ్యక్షుడి ఎన్నిక కోసం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరణం బలరాం అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్గం బాహాబాహీకి సిద్ధమైంది. వేమవరం జంట హత్యల నేపథ్యంలో గొట్టిపాటిపై ఆగ్రహంతో ఉన్న కరణం వర్గం ఆయనపై దాడికి దిగింది. దీనిని అడ్డుకునేందుకు గొట్టిపాటి వర్గం ఎదురుదాడికి ప్రయత్నించింది. మొత్తంగా మంగళవారం జరిగిన టీడీపీ జిల్లా సమావేశం రణరంగాన్ని తలపించింది. ఒంగోలు నగరంలోనిఏ1 కన్వెన్షన్ హాలు ఇందుకు వేదికైంది.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : టీడీపీ జిల్లా అధ్యక్షుడి ఎన్నిక కోసం ఆ పార్టీ మంగళవారం ఒంగోలులోని ఏ1 కన్వెన్షన్ హాలులో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ కరణం బలరాం, ఆయన తయుడు వెంకటేష్‌లు తమ వర్గీయులతో హాజరయ్యారు. ఇదే సమావేశానికి ఎమ్మెల్యే గొట్టిపాటితో పాటు ఆయన వర్గీయులు హాజరయ్యారు. ఈ నెల 29న జరిగిన వేమవరం జంట హత్యలకు ఎమ్మెల్యే గొట్టిపాటి కారణమని, తమ వర్గీయులను గొట్టిపాటి హత్య చేయించాడని కరణం వర్గీయులు ఆగ్రహంతో ఉంది. గొట్టిపాటిని చూడగానే ఎమ్మెల్సీ కరణం ఒక్కసారిగా రేయ్.. అంటూ గొట్టిపాటిపై చేయి చేసుకున్నారు.
ముందుగా ఇరువురు ఎదురుపడిన సందర్భంలో గొట్టిపాటి గన్‌మేన్ కరణం గన్‌మేన్‌ను పక్కకు నెట్టే ప్రయత్నం చేయబోగా కరణం ఆగ్రహించినట్టు తెలుస్తోంది. చేయి చేసుకోబోయిన కరణంను గొట్టిపాటి గన్‌మేన్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కరణం, ఆయన అనుచరులు గన్‌మేన్‌తో పాటు గొట్టిపాటి అనుచరులను చితకబాదారు. ఇంతలో అక్కడకు చేరుకున్న మరింత మంది కరణం వర్గీయులు గొట్టిపాటి వర్గంపై దాడికి దిగింది. గొట్టిపాటిని రక్షించుకునే ప్రయత్నంలో ఆయన అనుచరులు గొట్టిపాటికి వలయంగా ఉండిపోయారు. ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. గొట్టిపాటి కింద పడిపోయారు.
గొట్టిపాటి టీడీపీ కాదన్న కరణం..
పరిస్థితి అదుపు తప్పడం, గొట్టిపాటి కిందపడిపోవడం చూసిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి నారాయణ, మంత్రులు పరిటాల సునీత, శిద్దా రాఘవరావులు పరుగులు పెట్టి ఇరువర్గాలను నిలువరించే ప్రయత్నం చేశారు. గొట్టిపాటి టీడీపీకి చెందిన వాడు కాదని.. టీడీపీ కార్యకర్తలను హత్య చేయించాడని అలాంటి వ్యక్తిని సమావేశానికి ఎలా రానిస్తారంటూ కరణం బలరాం, ఆయన తనయుడు వెంకటేష్‌లు పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ మంత్రిని నిలదీశారు.
వెంటనే గొట్టిపాటిని సమావేశం నుంచి బయటకు పంపాల్సిందేనంటూ సీరియస్‌గా చెప్పారు. లేకపోతే ఊరుకునేది లేదని అమీతుమీకి సిద్ధమని తేల్చి చెప్పారు. దీంతో బెంబేలెత్తిన మంత్రులు గొట్టిపాటిని అక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ కోరారు. తామేందుకు వెళ్లాలంటూ గొట్టిపాటి వర్గం మంత్రులతో వాదనకు దిగింది. కరణం వర్గం కేకలు, ఈలలతో అంతు తేలుస్తామంటూ రెచ్చిపోయింది. గొట్టిపాటి అనుచరులపై మరోమారు దాడికి సిద్ధమైంది. పరిస్థితి విషమించటంతో మంత్రులు గొట్టిపాటికి నచ్చజెప్పి జిల్లా అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన అభిప్రాయం తీసుకొని ఆయన్ను సమావేశం నుంచి పంపించి వేశారు.
టీడీపీ అధ్యక్ష ఎన్నిక వాయిదా..
గొట్టిపాటి, కరణం వర్గాల గొడవతో టీడీపీ జిల్లా సమావేశం రచ్చరచ్చగా మారింది. ఈ సమావేశంలోనే అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉండగా కరణం, గొట్టిపాటి గొడవ నేపథ్యంలో మంత్రులు ఎన్నికను వాయిదా వేశారు. పాత నేతలతో పాటు ఫిరాయింపు ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకోవడంతో సరిపెట్టారు. అందరి అభిప్రాయాలను ముఖ్యమంత్రికి పంపుతామని అధ్యక్ష ఎన్నిక విషయంలో సీఎం తుది నిర్ణయం తీసుకుంటారని మంత్రులు విలేకర్లకు చెప్పి చేతులు దులుపుకున్నారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలు పరార్..
ఎమ్మెల్సీ కరణం బలరాం, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్గాల మధ్య గొడవ నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు జిల్లా సమావేశం నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయారు. తొలుత సమావేశానికి వచ్చిన కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌లు సమావేశంలో పది నిమిషాలు మాత్రమే ఉండి గొట్టిపాటి రవికుమార్ వెళ్లిన మరుక్షణమే వారు వెళ్లిపోయారు.
హత్య చేసిన వారిని వదిలిపెట్టం..
గొట్టిపాటి రవికుమార్‌ది అసలు టీడీపీనే కాదు. పార్టీ కార్యకర్తలను హత్య చేసిన వాడిని సమావేశానికి ఎలా రానిస్తారు? నిర్దాక్షిణంగా కార్యకర్తలను హత్య చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టం. కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటాం. ఎవరిపైనా నిష్కారణంగా దాడి చేయాల్సిన పని మాకు లేదు.
– విలేకరులతో కరణం
రెచ్చగొడుతున్నా..సహిస్తున్నా.. :
కరణం బలరాం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారు. అయినా సహిస్తున్నా. వేమవరం జంట హత్యలకు గ్రామంలోనే పరిస్థితులే కారణం.
– విలేకరులతో గొట్టిపాటి