సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా కాంగ్రెస్ వర్గ రాజకీయాలు సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. జిల్లా కాంగ్రెస్(డీసీసీ) అధ్యక్షుడు ఆమంచి కృష్ణమోహన్ చాపకిందకు నీళ్లు వస్తున్నాయి. ఆయన్ను డీసీసీ పీఠం నుంచి తప్పించాలని పీసీసీ చీఫ్ బొత్స సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. సీఎం కిరణ్ వర్గీయుడిగా ఉండేందుకే ఆమంచి మొగ్గుచూపడమే బొత్స ఆగ్రహానికి కారణం. మరోవైపు కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి కూడా ఆమంచి తీరుపై గుర్రుగా ఉన్నారు. దాంతో ఆమంచి ఉద్వాసనకు రంగం సిద్ధమైంది. ఎన్నికల నాటికి సీఎం కిరణ్‌వర్గంపై పైచేయి సాధించాలన్నది బొత్స వ్యూహం. అందులో భాగంగానే జిల్లాలో ఆమంచిపై వేటు పడనుందని తెలుస్తోంది. జిల్లా కాంగ్రెస్‌లో సరికొత్త రాజకీయ సమీకరణలిలా ఉన్నాయి..
సీఎంతో సాన్నిహిత్యం...బొత్సకు దూరం
రాజకీయంగా రంగులు మార్చే ఆమంచి కృష్ణమోహన్ నైజమే ప్రస్తుత పరిస్థితికి కారణం. బొత్స వర్గీయుడిగా మెలిగి డీసీసీ అధ్యక్ష పీఠాన్ని ఆయన దక్కించుకున్నారు. ప్రధానంగా మంత్రి మహీధర్ రెడ్డి సీఎం కిరణ్‌కు సన్నిహితుడిగా ఉన్నందున బొత్స తన వర్గీయుడిగా ఉంటారన్న నమ్మకంతో ఆమంచిని డీసీసీ అధ్యక్షుడిని చేశారు. కానీ మారిన పరిస్థితుల్లో ఆయన బొత్సకు దూరం జరుగుతూ వచ్చారు. పూర్తిగా సీఎం వర్గీయుడిగా ముద్ర పడేందుకే మొగ్గుచూపారు. దీన్ని గమనించినప్పటికీ బొత్స ఏమాత్రం బయటపడకుండా వేచిచూసే ధోరణి అవలంబించారు.
దీన్ని గుర్తించలేని ఆమంచి పూర్తిగా సీఎం కిరణ్ వర్గీయుడిగా మారిపోయి ఒకానొక దశలో బొత్సను బేఖాతరు చేసే స్థితికి చేరుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే ఊపులో ఆయన కేంద్ర మంత్రి పనబాక లక్ష్మితో కూడా వైరం కొనితెచ్చుకున్నారు. తన అసెంబ్లీ నియోజకవర్గంలో ఆమె ఏమాత్రం జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్న రీతిలో వ్యవహరించారు. సంతనూతలపాడు, అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల్లో తన మాట చెల్లుబాటు అవుతున్నప్పటికీ... చీరాలలో తనకు కనీస గౌరవం దక్కడం లేదని ఆమె కొంతకాలంగా ఆమంచిపై గుర్రుగా ఉన్నారు.
బొత్సకు అందివచ్చిన అవకాశం...
ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన - తదనంతర పరిణామాలు బొత్సకు కలసివచ్చాయి. అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పీసీసీకి అధిష్టానం ఆదేశించింది. వాస్తవానికి ఆమంచి అధిష్టానికి వ్యతిరేకంగా పెద్దగా వ్యాఖ్యలు ఏమీ చేయలేదు. మొదట్లో కాస్త హడావుడి చేసినప్పటికీ ఆయన విభజనకు సహకరించేందుకు మొగ్గుచూపుతున్నట్టు కనిపిస్తున్నారు. కానీ ఆమంచిని డీసీసీ పీఠం నుంచి తప్పించాలని భావిస్తున్న బొత్స మాత్రం దీన్ని అవకాశంగా తీసుకున్నారు. అందుకే అధిష్టానానికి సమర్పించిన నివేదికను జాగ్రత్తగా రూపొందించారు. ‘అధిష్టానాన్ని ఆమంచి విమర్శించారని... కాబట్టి ఆయన్ని డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగించలేమని’ బొత్స నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం.
తద్వారా ఆమంచిని తప్పించి మరొకర్ని డీసీసీ అధ్యక్షుడిగా నియమించాలన్నది ఆయన ఉద్దేశం. తదుపరి డీసీసీ అధ్యక్షుడిపై కూడా ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేసినట్టు తెలుస్తోంది. అధిష్టానానికి సన్నిహితంగా ఉండే కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, ఎంపీ మాగుంట సూచించిన మేరకు కొత్త డీసీసీ అధ్యక్షుడి నియామకానికి బొత్స నిర్ణయించారు. తద్వారా ఇటు జిల్లాలోనూ అటు అధిష్టానం వద్ద తన పట్టును పెంచుకోవాలన్నది ఆయన లక్ష్యం. దీనిపై అధికారిక ప్రకటన వారంరోజుల్లోనే వెలువడనుందని తెలుస్తోంది. జిల్లా పార్టీలో వర్గ రాజకీయాలను ప్రభావితం చేయనున్న ఈ పరిణామాలను కాంగ్రెస్ శ్రేణులు ఆసక్తిగా గమనిస్తున్నాయి. అటు సీఎం కిరణ్ సన్నిహితుడైన మంత్రి మహీధర్ రెడ్డి వర్గంతో వైరం... ఇటు పీసీసీ చీఫ్ బొత్స, కేంద్రమంత్రి పనబాకతో విరోధం... వెరసి ఆమంచి పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైందని వ్యాఖ్యానిస్తున్నాయి.
ఎసరు?
Published Sun, Dec 1 2013 3:56 AM | Last Updated on Sat, Sep 2 2017 1:08 AM
Advertisement
Advertisement