♦ పోతుల సునీతకు ఎమ్మెల్సీ ఇవ్వడంతో ఆమంచికి షాక్
♦ ఆమంచి జీర్ణించుకుంటారా?
♦ ఇప్పటికే రెండు వర్గాల మధ్య నిత్యం గొడవలే
♦ పార్టీ క్యాడర్, అధికారులకు ఇబ్బందే
♦ సునీత ఇక దూకుడు పెంచడం ఖాయం
♦ చీరాలలో ఇక రెండు అధికార కేంద్రాలు
చీరాల టీడీపీలో ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కుంపటి రాజేశారు. ఇప్పటికే పార్టీ రెండు వర్గాలుగా విడిపోయి నాయకులు నిత్యం తన్నుకుని తలకు పోసుకుంటున్నారు. ఉప్పు..నిప్పులా ఉన్న రెండు వార్గాల నాయకులు ఎవరికి వారు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ నాయకురాలు పోతుల సునీతకు సీఎం చంద్రబాబు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు పార్టీ అధిష్టానం షాకిచ్చినట్లయింది. నాయకుల సంగతి అంటుంచితే ఈ పరిణామం పార్టీ ద్వితీయ శ్రేణి క్యాడర్, అధికారులకు తలనొప్పి కావడం ఖాయం. మున్ముందు ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాలి.
ప్రకాశం జిల్లా : చీరాల తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు, గ్రూపు రాజకీయాలు నిత్యం భగ్గుమంటుంటాయి. అధికార పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా రగడే. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నుంచి.. నాలుగు విడతులుగా జరిగిన జన్మభూమి గ్రామసభలు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల వరకూ ఆ పార్టీ నేతలు ప్రజలకు మేలు చేసిందేమీ లేదు. తరుచూ నేతల మధ్య ఘర్షణలతో చీరాల నడిరోడ్డులో టీడీపీ పరువు బజారున పడింది. ఇప్పటి వరకూ పోతుల సునీత ముందుకు రాకుండానే వెనుకుండి మాజీ మంత్రి పాలేటి రామారావు సహకారంతో తమ వర్గానికి అండగా ఉంటూ వచ్చారు. ప్రస్తుతం ఊహించని రీతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చీరాల నియోజకవర్గ నాయకురాలు పోతుల సునీతకు ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు.
నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన సునీత నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. 2014 ఎన్నికల్లో నవోదయం పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్.. 2016 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతు, సహకారం కోసం ఆమంచిని సీఎం టీడీపీలోకి చేర్చుకున్నారు. అంతే వేగంగా నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి సునీతను తప్పించారు. ఆమెను జన్మభూమి కమిటీ సభ్యురాలిగా మాత్రమే కొనసాగించారు. అప్పటి వరకూ సునీత వెంట ఉన్న మున్సిపల్ చైర్మన్ ఎం.రమేష్, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు ఎమ్మెల్యే వర్గంలోకి జంప్ అయ్యారు. ఈ పరిస్థితిల్లో ఆమెతో ఉన్న కొందరు నాయకులతో పాటు, పాలేటి వర్గంలో ఉన్న మరికొందరిని కలుపుకుని ఆమంచికి వ్యతిరేకంగా టీడీపీ రెండో వర్గం నడుపుతూ వచ్చారు. బాపట్ల ఎంపీ శ్రీరాం మాల్యాద్రి కూడా పోతులకే మద్దతు తెలిపారు. ఇటీవల తన ఎంపీ నిధులను కూడా పోతుల వర్గీయులకే కట్టబెట్టారు. టీడీపీ రెండు వర్గాల బలాబలాలు ఎలా ఉన్నా వర్గపోరుకు మాత్రం కొదువ లేదు.
విభేదాలకు అంతే లేదు..
పార్టీ ఒక్కటైనా ఆ రెండు వర్గాల మధ్య విభేదాలకు అంతేలేదు. ఇప్పటి వరకూ సునీతకు ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టి నియోజకవర్గం నుంచి దూరం చేస్తారని అటు పార్టీ నాయకులు, ఇటు ప్రజల్లో ప్రచారం జరిగింది. సునీత కూడా కార్పొరేషన్ చైర్మన్ పదవి కోసం గట్టిగానే ప్రయత్నించినట్లు సమాచారం. ఎమ్మెల్సీ కోసం సునీత కూడా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు నియోజకవర్గంలో వారం నుంచి ప్రచారం జరిగింది. ఊహించని విధంగా ఆదివారం రాత్రి పోతుల సునీతకు ఎమ్మెల్సీ పదవిని కేటాయించినట్లు టీడీపీ అధిష్టానం ప్రకటించింది. ఎమ్మెల్యే ఆమంచి వర్గాని గట్టిషాక్ తగిలినట్లయింది.
ఆమంచికి ఎదురు దెబ్బే
నియోజకవర్గంలో రెండో నాయకత్వాన్ని సహించలేని ఎమ్మెల్యే ఆమంచికి ఇది ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. పోతులకు ఎమ్మెల్సీ పదవి దక్కడంతో నియోజకవర్గంలో ఆమె రెండో అధికార కేంద్రం అవుతుందనే విషయంలో సందేహం లేదు. చేతిలో అధికారం ఉండటంతో సునీత తన వర్గాన్ని బలోపేతం చేయడంతో పాటు అబివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, అధికారుల విషయంలో, లబ్ధిదారుల ఎంపికలో ఆమె జోక్యం ఉండటం ఖాయం. ప్రొటోకాల్ ప్రకారం అన్నీ అధికార కార్యక్రమాల్లో సునీత తన వర్గంతో కలిసి పాల్గొంటారు. దీన్ని ఎమ్మెల్యే ఆమంచి అంగీకరించే అవకాశం ఉండకపోవచ్చు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నా సునీతతో కలిసి ఆమంచి పనిచేసే అవకాశం లేదన్న ప్రచారం కూడా సాగుతోంది. చీరాల టీడీపీలో ఇక రోజూ రచ్చే. ఎవరూ ఊహించని విధంగా సునీతకు ఎమ్మెల్సీ ఇవ్వడం ఆమంచి దూకుడుకు చెక్ పెట్టడానికేనా.. అని నియోజకవర్గంలో ప్రచారం జోరందుకుంది. తన ప్రత్యర్థిగా ఉన్న సునీతకు ఎమ్మెల్సీ ఇవ్వడాన్ని ఆమంచి ఏ విధంగా అర్థం చేసుకుంటారో కాలమే సమాధానం చెప్పాలి.
నువ్వా.. నేనా !
Published Tue, Mar 7 2017 4:46 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
Advertisement