పోతుల సునీత
హైదరాబాద్: నైతికంగా తనదే విజయం అని సార్వత్రిక ఎన్నికలలో ప్రకాశం జిల్లా చీరాల శాసనసభ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయిన పోతుల సునీత అన్నారు. చీరాలలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ను టీడీపీలో చేర్చుకోవద్దని పార్టీ అధిష్టానాన్ని ఆమె కోరారు.
గతంలో ఆమంచి టీడీపీ కార్యకర్తలను దూరంగా ఉంచారని ఆమె ఆరోపించారు. ఆమంచి అవినీతిపై విచారణ చేయించాలని ఆమె డిమాండ్ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆయన అధికారులను మేనేజ్ చేశారని ఆమె ఆరోపించారు. ఆ ఎన్నికలలో నైతికంగా తనదే విజయం అని పోతుల సునీత చెప్పారు.
టిడిపిలో చేరడం కోసం ఆమంచి తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే చీరాల ప్రాంత కార్యకర్తలు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఈ రోజు కూడా చీరాలకు చెందిన టిడిపి కార్యకర్తలు ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎక్కి ఆందోళనకు దిగారు. ఆమంచి కృష్ణమోహన్‌ను పార్టీలో చేర్చుకోవద్దని వారు డిమాండ్ చేశారు.